జగన్ తిరుపతి పర్యటనలో వైసీపీ రంగు పడింది
posted on Sep 29, 2022 1:47PM
వైసీపీ రంగుల పంచాయతీ మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ సారి ఆ పార్టీ రంగుల పిచ్చతో ఏకంగా దేవుడి బొమ్మలనే చెరిపేసింది. అది కూడా తిరుపతిలో అలిపిరి వెళ్లే దారిలో ఉండే గోడలపై ఉన్న దేవుడి బొమ్మలను చెరిపేసి వైసీపీ రంగులతో నింపేశారు. ఈ వ్యవహారంపై తిరుపతి ప్రజలలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తుతోంది.
ఇప్పటి దాకా ప్రభుత్వ కార్యాలయాలూ, పాఠశాలలకు వైసీపీ రంగులు వేసి కోర్టు మొట్టికాయలతో వాటిని తీసేసి మళ్లీ గతంలోలా మామూలు రంగులు వేసి లక్షల్లో ప్రజా ధనం వృధా చేసిన వైసీపీ సర్కార్ ఇప్పుడు జగన్ తిరుపతి పర్యటన సందర్భంగా అలిపిరి మార్గంలో దేవుడి బొమ్మల స్థానంలో వైసీపీ రంగులు వేసిన వైనానికి సంబంధించి వీడియోలు సామాజిక మాధ్యమంలో వైరల్ కావడంతో వైసీపీ నాయకులు అలర్ట్ అయ్యారు. ఇదంతా తెలుగుదేశం దుష్ప్రచారం అంటూ ధ్వజమెత్తారు. అంతటితో ఆగకుండా అలిపిరి మార్గంలో గోడలకు దేవుడి బొమ్మలు అలాగే ఉన్నాయనీ, వాటిని కనిపించకుండా వైసీపీ రంగులు వేశామనడం శుద్ధ అబద్ధమంటూ నాలుగు ప్రదేశాలలో దేవుడి బొమ్మలు ఉన్న వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేసింది.
దీంతో రంగుల పంచాయతీకి తెరపడుతుందని భావించిన వైసీపీకి తెలుగుదేశం పార్టీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. కేవలం నాలుగు చోట్ల మాత్రమే దేవుడి బొమ్మలను ఉంచారనీ మీగిలిన అన్ని ప్రాంతాలలోనూ బొమ్మలన్నిటినీ తొలగించారనీ పేర్కొంటూ అందుకు సంబంధిచి రుజువులతో సహా మరో వీడియోను తెలుగుదేశం ట్వీట్ చేసింది. దీంతో వైసీపీ నేతలు బొమ్మలు తొలగించలేదంటూ చేసిన వాదన శుద్ధ తప్పు అని తేలిపోవడంతో ఆ పార్టీకి రిటార్డ్ ఇచ్చే అవకాశమే లేకుండా పోయింది. దీంతో వైసీపీని వెనకేసుకొస్తూ తిరుపతి నగరపాలక సంస్థ రంగంలోనికి దిగింది. అలిపిరి మార్గంలో ఉన్న బొమ్మలు పాతవైపోవడంతో కొత్తగా రంగులు పూశామే తప్ప ఇందులో వైసీపీ ప్రమేయం ఏమీ లేదని చెప్పుకొచ్చింది.
అయితే పూయడానికి వైసీపీ పార్టీని స్ఫురింప చేసే రంగులు వినా మరేమీ దొకరలేదా అంటూ నెటిజన్లు తిరుపతి నగరపాలక సంస్థపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. మొత్తం మీద వైసీపీ రంగుల పంచాయతీ వెంకన్న దేవుడి పాదల వద్దకు చేరింది. వైసీపీ నేతల తీరును జనం కూడా తప్పుపడుతున్నారు. తిరుపతి పవిత్రతను చెడగొడుతున్నారంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పటి వరకూ తిరుపతిలో ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు ఎవరూ పాల్పడలేదని విమర్శిస్తున్నారు. వైసీపీ భ్రష్ట రాజకీయాలకు తిరుపతిని వేదిక చేసుకోవడం సరికాదనీ, దీనిని తామెంత మాత్రం అంగీకరించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే తిరుపతి నగరపాలక సంస్థపై కూడా తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. అధికార పార్టీ తప్పదాలను కప్పి పుచ్చడం వినా తిరుపతి కార్పొరేషన్ కు మరో పని లేదా అని దుమ్మెత్తి పోస్తున్నారు. దేవుని చిత్రాలను తొలగించి రంగులు వేయడానికి తిరుపతి బ్రహ్మోత్సవాల సమయంలోనే ముహూర్తం కుదిరిందా అని నిలదీస్తున్నారు. లేదా జగన్ మొప్పు పొందడం కోసం ఆయన పర్యటన సందర్భంగా ఆయన పార్టీ రంగులు వేశారా అని ప్రశ్నిస్తున్నారు.
ఇలా ఉండగా తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం మార్గంలో గోడలపై ఉన్న దేవుళ్ల చిత్రాలను తొలగించి.. జగన్ పార్టీ రంగులు వేయడం హిందూ మతాన్ని అవమానపరచడమేనని తెలుగుదేశం అధినేత అన్నారు. జగన్ తీరుపై భక్తులు ఆగ్రహంగా ఉన్నారని ట్వీట్ చేస్తూ ఆ ట్వీట్ కు రంగులు వేయక ముందు గోడపై హిందూ దేవుళ్ల చిత్రాలు ఉన్న ఫొటోను వైకాపా, పార్టీ రంగులు వేసిన తర్వాత ఫొటోలను జత చేశారు.