జగన్ దారెటు..?

 

అయ్యో పాపం.. అంతలా ఎవరిని చూసి పాపం అని అనుకుంటున్నారని డౌటా..?ఇంకెవరిని ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత జగన్మోహన్‌ రెడ్డిని చూసే. అలా ఉంది ప్రస్తుతం వైసీపీ అధినేత పరిస్థితి. ఎందుకంటే బీజేపీకి ఎప్పుడైతే తమ సపోర్ట్ ఉంటుందని చెప్పారో అప్పటినుండి జగన్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ప్రస్తుత పరిస్థితులు కూడా ఆయనకు ఏం అనుకూలంగా లేవని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అసలు సంగతేంటంటే...

 

రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుండి ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీకి ప్రత్యేక హోదా తేలేకపోతున్నారని.. ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పి ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా జగన్ ఊదరగొడుతూనే ఉన్నాడు. ఏకంగా ఢిల్లీకే వెళ్లి అక్కడ ప్రత్యేక హోదా కోసం దీక్ష చేసిన ఘనత కూడా దక్కించుకున్నారు.  అయితే దానివల్ల ఒరిగింది ఏం లేదనుకోండి. అలాంటి జగన్.. గుంటూరులో జరిగిన సభకు ఎందుకు రాలేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన గుంటూరులోని ఆంధ్రా ముస్లిం కళాశాలలో జరిగిన  ‘ప్రత్యేక హోదా భరోసా’ సభలో ప్రతిపక్ష పార్టీ నేతలందరూ పాల్గొన్నారు. ఇక వచ్చిన వారందరూ... తమ వంతుగా ఏపీ ప్రభుత్వంపై.. మోడీపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ సైతం తాను రాలేకపోతున్నానని.. ట్విట్టర్ లో మద్దతు తెలిపారు. అంతేకాదు... స్పెషల్ స్టేటస్ సాధించేందుకు అన్ని పార్టీలు ఒకే వేదికపైకి రావాలని కూడా సూచించారు. ఇక టీడీపీ అంటే బీజేపీకి మిత్రపక్షం కాబట్టి బీజేపీ ఏది చెబితే దానికి ఢూ.ఢూ బసవన్నలా తల ఊపుతుంది. ఇక్కడి వరకూ ఏ పార్టీకి ఆపార్టీ ఒక క్లారిటీతో ఉంది.

 

ఇకపోతే జగన్ మోహన్ రెడ్డి విషయమే గందరగోళంలో పడింది. ప్రత్యేక హోదా.. హోదా అంటూ అరిచిన జగన్ సభకు రాలేదు.. కనీసం రాలేకపోతున్నానని పవన్ కళ్యాణ్ లా ఏదైనా ప్రకటన లాంటింది చేశాడా అంటే అదీ చేయలేదు. దీంతో జగన్ పై పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక నాయకుడికి ఉండాల్సిన కనీస లక్షణాలు జగన్‌కు లేకుండా పోయాయని... అంతేకాదు చంద్రబాబు తన ఓటుకు నోటు కేసుకు భయపడే ప్రత్యేక హోదా అడగట్లేదని చెప్పుకొచ్చిన జగన్ ను చూసి.. ఇప్పుడు తన కేసులు గుర్తొచ్చాయా.. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే అక్రమాస్తుల కేసు ఎక్కడ మెడకి చుట్టుకుంటుందో అని భయపడుతున్నారా..? అని  పలు రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చ నడుస్తోంది. బీజేపీకి సపోర్ట్ ఇస్తే.. ప్రజల నుండి వ్యతిరేకత.. మరి ప్రత్యేక హోదా కోసం బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పితే కమలనాథులు ఫైర్ అవుతారు. దీంతో జగన్ పరిస్థితి అడ కత్తెరలో పడిన పోక చెక్కలా తయారైంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu