ఇటీజ్ అఫీషియల్.. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల నుంచి ఇప్పాల ఔట్

నెట్‌వర్కింగ్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, టెలికమ్యూనికేషన్ పరికరాలు, హై-టెక్నాలజీ సేవలను అభివృద్ధిలో దిగ్గజ సంస్థ అయిన సిస్కో ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల నుంచి ఇప్పాల రవిచంద్రారెడ్డిని పక్కన పెట్టేసింది. పక్కన పెట్టేయడం కాదు.. పక్కన పడేసింది అనడం సబబు. వైసీపీ హయాంలో అత్యంత నీచంగా, అంతకు మించిన విద్వేష భావంతో తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ నేతలపై సామాజిక మాధ్యమంలో  పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇప్పాల ఇటీవల అనూహ్యంగా  సిస్కో బృందంలో ప్రత్యక్షమై లోకేష్ ఎదుట నిలిచారు. అదెలా అంటే.. సిస్కోతో  నైపుణ్యాల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నెల 25న అవగాహన ఒప్పందం చేసుకుంది. ఆ సందర్భంగా లోకేష్ తో సిస్కో బృందం భేటీ అయ్యింది. ఆ బృందంలో సిస్కో సౌత్ ఇండియా టెరిటరీ అక్కౌంట్స్ మేనేజర్ హోదాలో  ఇప్పాల రవిచంద్రారెడ్డి కూడా ఉన్నారు. ఆ బృందంతో పాటు వచ్చిన ఇప్పాల.. లోకేష్ ఎదుట నిలిచారు. ఆయనతో ఫొటోలు కూడా దిగారు. అయితే ఇప్పాల రవిచంద్రారెడ్డి ఎవరన్నది లోకేష్ కు అప్పటికి తెలిసే అవకాశం లేదు. దిగ్గజ కంపెనీ ప్రతినిథిగా భావించి ఇప్పాలతో మాట్లాడారు.

అయితే ఆ ఫొటోలు సోషల్ మీడియాలో రాగానే ఇప్పాల చరిత్ర అంతా బయటపడింది. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా తెలుగుదేశం పార్టీపైనా, ఆ పార్టీ నేతలపైనా ఇప్పాల ఎంత విషం చిమ్మారో నెటిజన్లు సోదాహరణంగా బయటపెట్టేశారు.  

దీంతో విషయం తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ వెంటనే రియాక్ట్ అయ్యారు.  వెంటనే సిస్కోకు  ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏ విధమైన ప్రాజెక్టులోనూ ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కాఇప్పాలను భాగస్వామిని చేయవద్దంటూ లేఖ రాశారు. ఆ లేఖలో ఇప్పాల వైసీపీ హయాంలో వ్యవహరించిన తీరును సోదాహరణంగా వివరించారు. వ్యాపార ఒప్పందాలకూ రాజకీయాలకూ సంబంధం లేదని పేర్కొంటూనే.. ఒక రాజకీయ పార్టీతో అంటకాగుతూ, ప్రభుత్వ వ్యతిరే కతను ప్రచారం చేస్తున్న వ్యక్తిని ఏపీ ప్రాజెక్టులలో భాగస్వామిగా అంగీకరించబోమని స్పష్టం చేశారు. దీంతో సిస్కో కూడా అంతే వేగంగా రియాక్ట్ అయ్యింది. ఇప్పాల రవిచంద్రారెడ్డిని ఏపీ ప్రాజెక్టుల నుంచి తొలగించింది. ఆ మేరకు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది.  అంతే కాకుండా లోకేష్ లేఖలోని అంశాలను ప్రస్తావిస్తూ సిస్కో  ఇప్పాలను ఏపీకి చెందిన అన్ని ప్రాజెక్టుల నుంచీ తొలగించినట్లు లోకేష్ పేషీకి  అధికారికంగా సమాచారం అందించింది. 

అయితే ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాలలో ఏ ప్రాజెక్టులోనూ ఇప్పాలను భాగస్వామిగా ఉంచరాదని సిస్కో నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకు ఏపీ మంత్రి లోకేష్ లేఖ రాసిన తరువాత సిస్కో బృందం తెలంగాణ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఓ ఒప్పందంపై సంతకాలు చేసే కార్యక్రమానికి ఇప్పాలను పక్కన పెట్టడమే తార్కానమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాలులో స్కిల్స్ యూనివర్సిటీ, సిస్కో మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఐటీ  మంత్రి శ్రీధ‌ర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇతర ఉన్నతాధికారులు, సిస్కో సీనియర్ వైఎస్ ప్రసిడెంట్ డాక్టర్ గయ్ డీడ్రిక్ గై డైడ్రిచ్, ఆ సంస్థ ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. అంటే ఒక్క ఇప్పాల రవిచంద్రారెడ్డి తప్ప.. ఏపీ సర్కార్ తో భేటీ సమయంలో ఉన్న బృందం అంతా కార్యక్రమంలో పాల్గొంది. ఆ కార్యక్రమానికి ఇప్పాలను సిస్కో పక్కన పెట్టేయడం, ఇప్పుడు ఏపీ ప్రాజెక్టుల నుంచి ఇప్పాలను తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం చూస్తుంటే తెలుగు రాష్ట్రాలలో సిస్కో ప్రాజెక్టుల నుంచి ఇప్పాలకు ఆ సంస్థ ఉద్వాసన చెప్పినట్లేనని పరిశీలకులు అంటున్నారు.