బాబు దార్శనికతకు దర్పణం!
posted on Jul 14, 2023 4:39PM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిట్ట నిలువునా చీలిపోయింది. రాజధాని లేని రాష్ట్రంగా నవ్యంధ్రప్రదేశ్ అపప్రదను మూటకట్టుకొంది. సరిగ్గా అదే సమయంలో జరిగిన ఎన్నికల్లో ఆ రాష్ట్ర ప్రజలు.. తెలుగుదేశం పార్టీకి జై కొట్టారు. అంతే ఆ పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్రమంలో ఓ వైపు రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు కోసం ఆన్వేషణ సాగిస్తూనే.. మరోవైపు రాష్ట్రానికి పరిశ్రమల స్థాపన కోసం తన వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో దక్షిణ కొరియాకు చెందిన కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు చేశారు. ఈ పరిశ్రమ కోసం పలు రాష్ట్రాలు పోటి పడినా.. కియా సంస్థ మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేయడం గమనార్హం.
అలా 2017లో ఆ పరిశ్రమ కార్ల తయారీని ప్రారంభించిన కియా.. తాజాగా శుక్రవారం (జూన్ 14) మిలియన్ కార్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకొంది. ఈ సందర్భంగా కియా సంస్థకు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతోన్నాయి. ఆ క్రమంలో నాటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు సైతం ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.
అనంతపురంలోని కియా ఫ్యాక్టరీ మిలియన్ కార్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకొవడం ఆనందంగా ఉందని... సదరు యాజమాన్యానికి ఆయన అభినందనలు తెలిపారు. 2017లో ఆంధ్రప్రదేశ్‌లో కియా పెట్టుబడులు ఓ బలమైన సంకల్పమన్న ఆయన.. ఈ సమర్థ విధానం ఆ ప్రాంత రూపురేఖల్ని మార్చి సంపద సృష్టి, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా తీర్చిదిద్దిందని చెప్పారు. ప్రపంచ వేదికపై కియా ఓ ప్రత్యేకతను చాటుకొందని స్పష్టం చేశారు. దీంతో రాయలసీమ ప్రాంతానికి ప్రయోజనం కలిగినందుకు తాను సంతోషిస్తున్నానన్నారు. వేలాది మంది స్థానికులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఉపాధి పొందుతున్నారని చంద్రబాబు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.
మరోవైపు కియా పరిశ్రమ.. మిలియాన్ కార్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకోవడంపై అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో పలు కథనాలు వెల్లువెత్తుతోన్నాయి. వీటిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ పరిశ్రమ రావడానికి ప్రధాన కారణం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని వారు స్పష్టం చేస్తున్నారు. నాడు రాయలసీమలో ఈ పరిశ్రమ ఏర్పాటు అయిందంటే.... నేడు అదే పరిశ్రమ ఉత్పత్తి రంగంలో తన ఘనతను చాటుకొందంటే.. అది చంద్రబాబు విజన్‌కి నిదర్శనమని వారు పేర్కొంటున్నారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైనా న్యాయం జరిగిందంటే.. అది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జరిగిందని వారు సోదాహరణగా వివరిస్తున్నారు.
తెలంగాణలోని ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనం కావడం, నవ్యంధ్రకు రాజధాని ప్రాంతాన్ని ఎంపిక , అందుకోసం రైతులను ఒప్పించి.. వారి నుంచి స్వచ్ఛందంగా వ్యవసాయ భూముల సమీకరణ.. ఆ రాజధాని ప్రాంతానికి అమరావతి అని నామకరణం... అలాగే ఉత్తరాంధ్రాలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఏర్పాటుకు నడుం కట్టినా... అటు రాయలసీమలో సైతం దాదాపుగా ఇదే తరహాలో పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినా.. అదంతా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి, పట్టుదల, మొక్కవోని దీక్షే కారణమని నెటిజన్లు ఈ సందర్బంగా తమ అబిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్త పరుస్తున్నారు.
అయితే 2014 ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమైన ఫ్యాన్ పార్టీ అధినేత, నాటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్.. కియా పరిశ్రమ నిబంధనలకు విరుద్దంగా ఏర్పాటు చేశారంటూ అప్పట్లో ఆరోపించారని వారు గుర్తు చేస్తున్నారు. అలాగే ఈ పరిశ్రమ కారణంగా భూములు కోల్పోయిన రైతులను సైతం ప్రతిపక్షనేతగా వైయస్ జగన్ పరామర్శించారని... అలాగే వారిని అన్ని విధాల రెచ్చగొట్టి.. కియా పరిశ్రమ ఏర్పాటు చంద్రబాబు తప్పుడు నిర్ణయమంటూ ఆయన వ్యాఖ్యానించారని నెటిజన్లు పేర్కొన్నారు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ కియా కార్ల పరిశ్రమను తరిమేస్తామంటూ వైయస్ జగన్ చెప్పారని గుర్తు చేశారు. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటిందని... ఇంతవరకు ఆ పరిశ్రమకు భూములు ఇచ్చిన రైతులను బాధ్యత గల ముఖ్యమంత్రిగా పరామర్శించిందే లేదని నెటిజన్లు ఈ సందర్బంగా గుర్తు చేశారు. అంతేకాదు.. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లో అనంతపురం నుంచి కియా కార్ల పరిశ్రమ.. పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రానికి తరలి పోతున్నదంటూ.. స్థానిక మీడియాలోనే కాదు.. అంతర్జాతీయ మీఢియాలో సైతం వార్త కథనాలు వెల్లువెత్తాయి. అంతేకాదు.. అందుకు.. కొత్త ప్రభుత్వం తీసుకు వచ్చిన విధి విధానాలతోనే కియా ఈ నిర్ణయం తీసుకో వలసి వచ్చిందంటూ.. కథనాలు సైతం అంతర్జాతీయ స్థాయిలో వచ్చాయి. దీంతో జగన్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే కియా కంపెనీ యాజమాన్యాన్ని అధికార ఫ్యాన్ పార్టీకి చెందిన ఎంపీ తుపాకీతో బెదిరించారనే ఓ చర్చ సైతం నాడు వాడి వేడిగా నడిచిన విషయం విధితమే. అలాంటి పరిస్థితుల్లో.. చంద్రబాబు హయాంలో వచ్చిన కియా పరిశ్రమ.. తాజాగా మైలురాయి చేరుకోవడం పట్ల.. నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్ సైతం సదరు పరిశ్రమ యజమాన్యాన్నికి అభినందనలు తెలపడం కొసమెరుపని నెటిజన్లు పేర్కొంటున్నారు.
ఇది చంద్రబాబు నాయుడి విజన్‌కి ఓ ఉదాహరణగా వారు చూపుతున్నారు. చంద్రబాబు నాయుడికి, వైయస్ జగన్‌కి మధ్య ఉన్న ఈ తేడాను గమనిస్తే.. ఆంధ్రులు.. భవిష్యత్తులో అయినా తప్పటడుగులు వేయకుండా ఉంటారని నెటిజన్లు ఓ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.