ఆరు లక్షల ఉద్యోగాలెక్కడ జగన్ రెడ్డి! ఆర్టీసీలో కొత్తగా ఇచ్చినవెన్ని?
posted on Jun 19, 2021 5:37PM
ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ ఉద్యోగ విప్లవం తీసుకొచ్చిందా? రెండేండ్లలోనే ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించిందా ? ఉద్యోగ కల్పనపై ఇటీవల ఏపీ ప్రభుత్వం చేసిన ప్రకటన ఇప్పుడు చర్చగా మారింది. ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారన్నది ఆసక్తిగా మారింది. ప్రభుత్వం చెబుతున్నట్టు రాష్ట్రంలో ఆరు లక్షల మందికి పైగా ఉపాధి లభించిందా అన్న ప్రశ్నకు కాదనే జవాబే వస్తుంది. ప్రభుత్వ లెక్కలన్ని తప్పుడు తడకని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం చెప్పిన లెక్కలను పరిశీలించినప్పుడు వాటిలో తాత్కాలిక సచివాలయ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్, కాంటాక్ట్ ఉద్యోగులతో పాటు ఆర్టీసీ ఉద్యోగులను కలిపి చూపించినట్లు అర్థమవుతోంది.
ఉద్యోగాల కల్పనకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సందర్భంగా.. గత రెండేళ్లలో ఆరు లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్టు ఏపీ సర్కార్ ప్రకటించింది. అందులో సుమారు రెండు లక్షలు శాశ్వత ఉద్యోగాలని చెప్పింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించి ఉద్యోగ భద్రతనిచ్చామని అంటోంది. ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పన గతంలో ఎప్పుడూ జరగలేదని గొప్పగా ప్రకటించుకుంది. రెండేళ్లలోనే జగన్ హయంలో 6,03,756 మందికి ఉద్యోగాలు కల్పించినట్టు పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చింది. అంతేకాదు అవినీతి, ఆశ్రిత పక్షపాతం, లంచాలకు కూడా తావు లేకుండా ఈ నియామకాలు చేసినట్టు తెలిపింది.అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియమాకాలు కూడా అవినీతి లేకుండా చేశామని చెబుతోంది. దళారీల బెడద లేకుండా వారికి ప్రతీనెలా 1వ తేదీనే వేతనాలు వచ్చేలా ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని చెబుతోంది. ఏటా రూ.3,600 కోట్లు భారం పడుతున్నా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా 51,387 మందికి ఉద్యోగ భద్రత కల్పించామని ఘనంగా ప్రకటించింది జగన్ రెడ్డి ప్రభుత్వం.
అయితే ప్రభుత్వం చెబుతున్న ఉద్యోగాల లెక్కలపై లోతుగా పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు వాస్తవాలకు పొంతనలేదని తేలింది. వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత 2019 ఆగస్టు నుంచి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రారంభించారు. వాటి పరిధిలో రాష్ట్రవ్యాప్తగా 1,21,518 మందికి ఉద్యోగాలు కల్పించారు. ఇవన్నీ శాశ్వత ఉద్యోగాలని సర్కార్ చెబుతోంది. కానీ ఇప్పటి వరకూ సచివాలయ ఉద్యోగులకు సర్వీస్ రిజిస్ట్రర్‌లో నమోదు ప్రక్రియ పూర్తికాలేదు. వారికి కేవలం ప్రొబేషనరీ పిరియడ్ పేరుతో ప్రస్తుతం నెలకు రూ. 15 వేలు వేతనం మాత్రమే ఇస్తున్నారు. పీఎఫ్ సహా ఇతర సదుపాయాలేమీ అందడం లేదు.దీంతో వీరంతా సర్కార్ ఉద్యోగులు ఎలా అవుతారన్నది ప్రశ్న.
అవుట్ సోర్సింగ్ పద్ధతిలో 2,59,565 మందికి వాలంటీర్లుగా ఉద్యోగాలు కల్పించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. వారికి అప్కోస్ ద్వారా వేతనాలు చెల్లిస్తున్నా, ఇతర ప్రయోజనాలు మాత్రం లేవు. మొదట కేవలం నెలకు రూ. 5 వేలు మాత్రమే జీతంగా ఇవ్వడంతో వాలంటీర్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సీఎం జగన్ వాలంటీర్లకు లేఖలు రాశారు. ఫిబ్రవరి 16న రాసిన లేఖలో వారు ప్రభుత్వ ఉద్యోగులు కాదని, కేవలం వాలంటీర్లు మాత్రమేననే విషయాన్ని గుర్తించుకోవాలని చెప్పారు. ముఖ్యమంత్రే వాలంటీర్లు ఉద్యోగులు కాదని చెప్పగా.. తాజా ప్రకటనలో మాత్రం వారిని ప్రభుత్వ ఉద్యోగాల జాబితాలో అవుట్ సోర్సింగ్ సిబ్బందిగా పేర్కొనడంపై విమర్శలు వస్తున్నాయి. ఇక ప్రభుత్వం చెబుతున్న లెక్కల్లో ఆప్కోస్ ద్వారా 95,212 మందికి ఉద్యోగాలు కల్పించినట్టు పేర్కొన్నారు. కానీ, వాస్తవానికి గతం నుంచి పనిచేస్తున్న సిబ్బందిని కొత్తగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్ పరిధిలోకి తీసుకువచ్చారని తేలింది. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది అందరినీ రెగ్యులర్ చేస్తామని, ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసిన జగన్ ఇప్పుడు దానికి భిన్నంగా... గతం నుంచి పనిచేస్తున్న సిబ్బందిని కార్పొరేషన్ ఉద్యోగులుగా చూపించడం విడ్డూరంగా ఉందని విపక్షాలు మండిపడుతున్నాయి.
ఇక రవాణా, రోడ్లు భవనాల శాఖ పేరుతో ఆర్టీసీ ఉద్యోగులు 51,387 మందికి ఉద్యోగాలు కల్పించినట్టు ప్రభుత్వ ప్రకటనలో ఉంది. కానీ వారంతా ఏపీఎస్ఆర్టీసీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులే. ప్రభుత్వరంగ సంస్థ కార్పోరేషన్‌లో కూడా వారంతా శాశ్వత ప్రాతిపదికన ఉపాధి పొందుతున్న వారే. ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థ నుంచి నేరుగా ప్రభుత్వ పరం కావడంతో వారు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు.
కానీ దానిని కూడా ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం ప్రస్తావించింది. 6 లక్షల ఉద్యోగాల్లో ప్రభుత్వం 50 వేల మంది ఆర్టీసీ సిబ్బందిని కూడా కలిపేసింది. ఆర్టీసీ సిబ్బందిని కూడా కొత్త ఉద్యోగాల కల్పనలో చూపించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కొత్తగా ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పకుండా.. ఈ దొంగ లెక్కలు ఎందుకని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు కొవిడ్ సేవల కోసం తాత్కాలిక ప్రాతిపదికన 26,325 మందిని నియమించినట్టు ప్రభుత్వం చెబుతోంది. అయినా అత్యవసర సేవల కోసం తాత్కాలిక ప్రాతిపదికన నియమించిన ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో భాగంగా చూపించారు. గత ఏడాది కరోనా ఉధృతి సమయంలో తీసుకున్న ఉద్యోగులను ఆ తర్వాత తొలగించారు.సెకండ్ వేవ్ సందర్భంగా అదనంగా వైద్యులు సహా అనేక విభాగాల్లో నియామకాలు చేశారు. వీళ్లను ఎంత కాలం కొనసాగిస్తారో తెలియదు. అయినా వీళ్లందరిని కూడా కొత్త ఉద్యోగుల జాబితాలో జగన్ రెడ్డి ప్రభుత్వం చూపించింది.