రేవంత్‌రెడ్డికి భట్టి హ్యాండిస్తారా? కేసీఆర్ స్కెచ్ వర్కవుట్ అయ్యేనా?
posted on Oct 22, 2021 3:53PM
రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. కానీ, పార్టీ సీనియర్లలో మాత్రం ఇంకా కదలిక రాలేదు. సీతక్క, షబ్బీర్ అలీ, మధు యాష్కి వంటి కొద్ది మంది రేవంత్ రెడ్డి అడుగులో అడుగేసి నడుస్తున్నా, ఇతర సీనియర్ నాయకులు వెయిట్ అండ్ వాచ్ మూడ్’లోనే ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, సీనియర్ల స్తబ్దతకు ఇంకా కారణాలున్నా ఇప్పట్లో ఎన్నికలు లేక పోవడం కూడా సీనియర్ నాయకుల స్లీపింగ్ మోడ్’కు కారణమని కొందరు పార్టీ నేతలు అంటున్నారు. అలాగే, జాతీయ స్థాయిలో పార్టీ ఇంకా పూర్తి స్థాయిలో ‘సెట్’ అవలేదు. వచ్చే ఏడాది ప్రారంభంలో యూపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడితేనే గానీ, కాంగ్రెస్ ఫ్యూచర్ మీద క్లారిటీ రాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సో అంతవరకు వెయిట్ అండ్ వాచ్ పాలసీ ఫాలో కావడం ఉత్తమం అనే స్టేట్ సీనియర్ నాయకులు కూడా ఉన్నారని పార్టీ వర్గాల సమాచారం. అలాగే, ఈ లోగా హుజూరాబాద్’ ఫలితంతో స్టేట్ సీన్’లో కూడా ఇంకొంత క్లారిటీ వస్తుందని, ఏ రకంగా చూసినా, ప్రస్తుతానికి వెయిట్ అండ్ వాచ్’ ఉత్తమం అనే అభిప్రాయమే పార్టీ సీనియర్ లీడర్స్’లో ఉందని అంటున్నారు.
అదలా ఉంటే, అధికార తెరాస మరో సారి కొందరు సీనియర్ లీడర్ల ఎగరేసుకు పోయేందుకు పావులు కదుపుతోంది. జాబితా కొంచెం పెద్దగానే ఉన్నా, ఫస్ట్ ప్రయారిటీ మాత్రం, సీఎల్పీ నేత బట్టి విక్రమార్కదే అంటున్నారు. రేవంత్ రెడ్డి దూకుడును తగ్గించి, కాంగ్రెస్ స్పీడ్’కు బ్రేకులు వేసేందుకు భట్టి విక్రమార్క వంటి సీనియర్ అండ్ సిన్సియర్ లీడర్’ను తమ వైపుకు తిప్పుకోవడం అవసరమని తెరాస నాయకత్వం భావిస్తోంది. ఈ నేపధ్యంలోనే ఎలాగైనా భట్టిని బుట్టలో వేసుకునేందుకు, ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తడం మొదలు, దళిత బంధు పథకం విస్తరణలో భాగంగా ప్రభుత్వం ఎంపిక చేసిన నియోజక వర్గాల్లో భట్టి ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గాన్ని కూడా చేర్చింది. అంతే కాదు, మిగిలిన, సొంత పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాలకు రూ .50 కోట్లు చొప్పున విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, భట్టి నియోజక వర్గం మధిర నియోజకవర్గానికి మాత్రం రూ .100 కోట్లు విడుదల చేసి, ప్రత్యేక ప్రేమను వ్యక్త పరిచారు.
నిజానికి అంతకు ముందు నుంచి భట్టి పై కేసేఆర్ ప్రేమ పొంగుతున్నా, మరియమ్మ లాకప్ డెత్ ఇష్యూతో, ‘లవ్ స్టొరీ’ ఓపెన్ అయింది. ఇక అక్కడి నుంచి, దళిత సాధికారిత పేరున తెచ్చిన దళిత బంధును అడ్డుపెట్టుకుని భట్టికి వరసగా బిస్కెట్లు వేస్తూనే ఉన్నారు కేసీఆర్. తెరాస...ప్రేమ బాణాలు సంధిస్తూనే ఉంది. కొద్ది రోజుల క్రితం మంత్రి కేటీఆర్ మీడియా ముచ్చట్ల (చిట్ చాట్ ) లో మరోసారి, మరో వలపుబాణం విసిరారు. భట్టి లాంటి మంచి నాయకుడిని పక్కనబెట్టి.. గట్టి అక్రమార్కులు పార్టీని ఏలుతున్నారంటూ ప్రాసతో కూడిన మరో మెరుపు బాణం వదిలారు.
నిజానికి, భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ విషయంలో ఎక్కడా నెగటివ్ కామెంట్స్ చేయలేదు. రేవంత్ రెడ్డి తనను పక్కన పెట్టారని, కేసీఆర్, కేటీఆర్ చెవిలో ఏమైనా చెప్పారేమో కానీ, బహిరంగంగా మాత్రం ఎక్కడా తనకు రేవంత్ రెడ్డితో విభేదాలున్నాయని సూచన మాత్రంగా అయినా సంకేతాలు ఇవ్వలేదు. అయినా కేటీఆర్ ఆయనకేదో అన్యాయం జరిగిపోయిందని చెప్పడం ద్వారా భట్టిని బుట్టలో వేసుకునేందుకు ఏస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చును. అయితే, భట్టిని బుట్టలో వేసుకోవడం అన్ని పార్టీలు తిరిగి వచ్చిన మోత్కుపల్లిని బుట్టలో వేసుకున్నంత ఈజీ కాదని, పార్టీ, సిద్ధాంత నిబద్దత గల భట్టి విషయంలో తెరాస నాయకులకు భంగపాటు తప్పదని అంటున్నారు భట్టి కమిట్మెంట్ తెలిసిన కాంగ్రెస్ నాయకులు.