తుళ్లూరు టూ తిరుమల.. అమరావతి రైతుల మహా పాదయాత్ర.. జనసేన సపోర్ట్!
posted on Oct 22, 2021 5:04PM
దాదాపు రెండేళ్లుగా ఉద్యమిస్తున్నారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని కాలరాయొద్దంటూ పోరాడుతున్నారు. రాజ్యం ఎంత ఒత్తిడి తెస్తున్నా.. కేసులతో ఎంతగా ఉక్కుపాదం మోపుతున్నా.. తగ్గేదే లే అంటూ అమరావతి రైతులు మొక్కవోని దీక్ష చేస్తున్నారు. కొవిడ్ కారణంగా ఉధృతి కాస్త సద్దుమనగగా.. మరోసారి రాజధాని రైతులు ఉద్యమ కార్యచరణకు పదును పెట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని పరిరక్షించాలని కోరుతూ నవంబర్ 1 నుంచి రైతులు మహా పాదయాత్ర చేపడుతున్నారు. తుళ్లూరు గ్రామం నుంచి తిరుమల వరకు 45 రోజుల పాటు పాదయాత్ర కొనసాగనుంది. డిసెంబర్ 17వ తేదీతో పాదయాత్ర ముగియనుంది.
మహా పాదయాత్రకు పలు పార్టీల మద్దతు కూడగడుతున్నారు. తాజాగా, మహా పాదయాత్రకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతును రాజధాని రైతుల ప్రతినిధులు కోరారు. శుక్రవారం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్‌ను రైతులు కలిసారు.
రెండేళ్లుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని రైతులు ఆరోపించారు. అమరావతి పరిరక్షణలో భాగంగా మహా పాదయాత్ర తలపెట్టినట్లు రైతులు చెప్పారు. రాజధాని కోసం మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్, మనోహర్‌లు మహా పాదయాత్రకు మద్దతు ఇవ్వాలని రైతులు, జేఏసీ నేతలలు విజ్ఞప్తి చేసారు. రైతుల మహా పాదయాత్ర విజయవంతం కావాలని మనోహర్ ఆకాంక్షించారు.