ఆదివాసీల ప్రాణాలకు విలువలేదా?

బస్తర్‌గూడ ఎన్‌కౌంటర్‌ లోతుల్లో కెళితే ఆదీవాసీలు ఎన్ని విధాలుగా నష్టపోతున్నారో తెలుస్తుంది. ప్రభుత్వం, పోలీసులు, అటవీశాఖ,కాంట్రాక్టర్లు, పారిశ్రామిక వేత్తలు, మావోయిస్టులు వీళ్లంతా వారి జీవన సౌలభ్యాన్ని కొల్లగొడుతున్న వారే.. .ప్రభుత్వం వారికి విద్యా,వైద్యం, ఆహారం ఏదీ అందుబాటులో ఉంచదు. పోలీసులు (కేంద్రబలగాలు)వారి ప్రాణాలను చాలా తేలిగ్గాతీసుకుంటారు. కాంట్రాక్టర్లు వారిని తల్లిఒడిలాంటి అటవినుండి తరిమేస్తున్నారు. అక్కడ వ్యవసాయం చేసేందుకు ఆదీవాసీలు కానివారు అటవీశాఖనుండి భూముల్ని లీజుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. వారికి చెందిన భూముల్లో వారే కూలీలుగా మారుతున్నారు.ఆదీవాసీలు సాంప్రదాయ సిద్దంగా అడవిలో పండే కుంకుడు, శీకాకాయ, బీడీ ఆకు కొన్ని రకాలయిన వేర్లు , తేనే,అమ్ముకుంటూ వుంటారు. అయితే వారిని అడవిలోనికి అటవీశాఖవారు రానీయటం లేదు.కాంట్రాక్టర్లు అడవిలోని చెట్లను నరికి యూకలిప్టస్‌ లాంటి వాణిజ్య మొక్కలను నాటి ఆదీవాసీలకు బ్రతుకుతెరువు లేకుండా చేస్తున్నారు. అటవీశాఖ జులుం వీరి మీద అధికంగా ఉంది. ఆదీవాసీలు వారి దయా దాక్షిణ్యాలపై బ్రతక వలసి వస్తుంది.

 

అడవిబిడ్డలు అడవి దాటి కొండలకి కోనలకు ఎగబ్రాకవలసి వస్తుంది. ఈ కొండలన్నీ ఇనుము,మ్యాంగనీసు, బాక్సైటు లాంటి ఖనిజాలతో ఉన్నాయి కాబట్టి పారిశ్రామిక వేత్తల కళ్లు వాటిమీద ఉన్నాయి. ప్రభుత్వానికి పరిశ్రమలు పెట్టి కాసులు కురిపిస్తామని, ఉద్యోగాలు ఇస్తామని అడవులనుండి, కొండలనుండి వారిని తరిమి కొడుతున్నారు. ఆకలితో ,రోగాలతో వాళ్ల జనాభా రోజురోజుకూ తగ్గిపోతుంది. ఇది చాలదన్నట్లు పోలీసుల ఎన్‌కౌంటర్‌ పేరుతో అమాయకులను, ఆడవాళ్లని, పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తున్నారు.

 

గత ఏడేళ్లలో దాదాపు పదివేలమంది చనిపోయారని తెలుస్తుంది. ఇప్పటికే మూడువేల మంది జైళ్లలో మగ్గుతున్నారు.వీరిలో చాలా మంది మీద చార్జిషీటుకూడా పెట్టలేదు. ఇది ఆదీవాసీ బ్రతుకు చిత్రం. ఈ ఛిద్రబ్రతుకుల్లో వారి కన్నీరును తుడవటానికి, వాళ్ల బాగోగులు చూడటానికి ఎవరున్నారని ..మనం చదువుకున్న తోడేళ్లం..చదువుకొని ....ఉన్న నీతిని పోగొట్టుకున్న వాళ్లం...మనకు రూపాయలనబడే కాగితాలే తెలుసుగాని ....ప్రాణాలకు విలువేంటి అని లెక్కలువేసుకుంటాం....అందుకే వాళ్లు అడవుల్లోనూ ఉండలేక జనారణ్యాల్లోనూ చోటు లేక బిక్కుబిక్కు మంటూ చూస్తున్నారు.

 

వాళ్లూ మనుషులే అనుకునే ఏ కొద్దిమందో వారికోసం పరితపిస్తే ప్రభుత్వం వారిని జైళ్లలో తోస్తుంది. మొన్న జరిగిన ఎన్‌కౌంటర్‌ను పరిశీలిస్తే...ఆదీవాసీలంతా ఆరోజు రాత్రి సమావేశం అయ్యి ఎక్కడ భూమిని సాగుచేద్దామా అని సమావేశం జరుపుతున్న సమయంలో సిఆర్‌పియఫ్‌ దళాలు వారి మీద దాడికి దిగాయి.... పెద్దలు...కాస్త తెలివైన వాళ్లు పోలీసులని గుర్తించినవారు చేతులు పైకెత్తి నిలుచుండిపోయారు. పిల్లలు, ఆడవాళ్లు తుపాకీ శబ్దాలకు భయపడినవారు పరుగెత్తి ప్రాణాలను కోల్పోయారు.

 

అయినా టెక్నాలజి మీద ఆధారపడిన పోలీసులు రాత్రిపూట లైట్లులేకుండా ఎలా కూంబింగ్‌కి ఎలా వెళ్లారు...ఎవరేమిటో నిర్థారణకు రాకుండా చీకట్లో కాల్పులు జరపటమేనా...వాళ్లకు అడవి ఎంతవరకు తెలుసు....అక్కడికి పోలీసులు కేవలం రెండు రోజుల ముందే వచ్చి, ఈ సంఘటన జరిగే ప్రదేశానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. సిఆర్‌పియఫ్‌ దళాధిపతిగా వీరప్పన్‌ను ఫాలో చేసి చంపిన విజయకుమార్‌ ఉన్నారు. వారేమంటున్నారంటే మేము కాల్పులు జరిపే టైమ్‌లో మావోయిస్టులు ఆదీవాసీలను మానవకవచాలుగా వాడుకున్నారని అదే జరిగిఉంటే అక్కడ పోలీసులకి మావోలపై కాల్పులు జరపటం తెలీదనే చెప్పాలి. ఎందుకంటే మావోయిస్టుల వ్యూహాలను అంచనావేయగలిగే నిపుణత లేని వారు అడవుల్లో మావోయిస్టుల్ని మట్టుబెట్టటానికి వెళ్లారు....ఆదీవాసీల ప్రాణాలను తీసారు. అడవిబిడ్డల కోసం ప్రభుత్వం చేసింది శూన్యం. అమాయకులు చనిపోయిన విషయాన్ని కేంద్ర మంత్రి కిషోర్‌ చంద్రదేవ్‌ కేంద్ర హోమ్‌ మినిస్టర్‌ చిదంబంకు పార్లమెంటులో అడిగే వరకు తెలియదట....ఒకవేళ అమాయకులు చనిపోతే సారీ అని దులుపుకున్నారు. ఆదీవాసీలంటే ఎంత చులకనో ఈ సంఘటనే చెబుతుంది.

 

ఆదీవాసీలంతా ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉన్నారనటానికి నిదర్శనం ప్రభుత్వం పంపిన నిత్యావసర వస్తువులను ఒక్కరంటే ఒక్కరు కూడా తీసుకోకుండా తిప్పి పంపడమే. దీని ద్వారా వారు గుండెకోత కంటె కడుపు మంట ఏమంత లెక్కలోనిది కాదని చెప్పకనే చెప్పారు. ఆదీవాసీలలో విద్యావ్యాప్తి కోసం రామకృష్ట మిషన్‌ 25 పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఇదివరలో రామకృష్ణ మిషన్‌ స్కూల్‌దగ్గర చౌక ధరల దుకాణం ఏర్పాటు చేసేవారు .ఇప్పుడు అవి పోలీసుల క్యాంపులకు తరలించారు దానివల్ల ఆదీవాసీలు 40 కిలోమీటర్లు నడవాల్సివస్తుంది.

 

ఇదివరలోఆదీవాసీలకు భూమికోసం జరిగే పోరాటాలు మాత్రమే ఉండేవి...అయితే ఇప్పడు కార్పొరేట్‌ సంస్థలతో అది పోరాడ వలసి వస్తుంది. ప్రభుత్వం ధర్మల్‌ ప్లాంట్లకు , ఖనిజ పరిశ్రమలకు విపరీతంగా అనుమతులు ఇచ్చింది.ఇప్పటికే ఆదీవాసీ ప్రాంతాల్లో 22 పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఆదీవాసీల హృదయ విదారక స్థితికి కారణం, ప్రభుత్వ అలసత్యం . ఆదీవాసీల కోసం జరపవలసిన పధకాలు, హక్కులు పేపర్లమీదే ఉన్నాయి.

 

వారికి ప్రతిఘటించే శక్తికూడా లేదు. ఎందుకంటే ఇప్పటివరకు చత్తీస్‌ఘడ్‌లో గాని, వేరే చోట్లగాని ఆదీవాసీలకు మద్దతుగా ఒక్క బహిరంగ సభ కూడా జరగలేదు. హైదరాబాద్‌లో జరపతలపెట్టిన సభకు బాధిత కుటుంబాలు పాల్గొనటానికి వస్తే అక్కడే వారిని అరెస్టు చేసినట్లు తెలుసింది.....ఆదీవాసీలను బ్రతకనిద్దాం..ఎందుకంటె ఎప్పుడన్నా మనిషెవరు అంటే చూపటానికి వుంటారు.... మనమెలాగూ టెక్నాలజీతో మెషిన్స్‌గా బ్రతుకుతున్నాం కదా.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu