డామిట్ కథ అడ్డం తిరగింది! ఆందోళనలో వైసేపీ నేతలు

ఆంధ్ర ప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లో జరగని అవినీతిని జరిగినట్లు చూపిస్తూ, , వైసీపీ ప్రభుత్వం  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని  అక్రమంగా అరెస్ట్ చేసింది. గత వారం రోజులగా కేసు పూర్వాపరాలను గమనిస్తున్న ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఇది. 

అందుకే  అనకాపల్లి నుంచి అమెరికా వరకు చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా ఆందోళనలు ఊపందుకుంటున్నాయి.ఈ నేపథ్యంలోనే, వైసీపీలో అంతర్మథనం మొదలైందని అంటున్నారు. ఎటూ మళ్ళీ గెలిచేది లేదని నిర్ణయానికి వచ్చిన కొందరు మంత్రులు, మరి కొంత మంది నాయకులు మినహా, మిగిలిన నాయకులు, శ్రేణులు లోలోపల కుతకుతలాడి పోతున్నారని అంటున్నారు. అలాగే క్షేత్ర స్థాయిలో ప్రజాభిప్రాయాన్ని, ప్రజాగ్రహాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు అయితే మరింతగా  కలవర పడుతున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసి, ముఖ్యమంత్రి జగన్ పెద్ద తప్పు చేసారని,ఆయన నిర్ణయం పిలిచి మరీ తన్నించు కున్నట్లు ఉందని అంటున్నారు.   

అంతే కాదు,ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కష్టాలను కొని తెచ్చుకున్నారా? చంద్రబాబు అరెస్ట్  విషయంలో జగన్ రెడ్డి లెక్క తప్పిందా? అంటే అవుననే అంటున్నారు  వైసీపే నాయకులు, అభిమానులు. చంద్రబాబును జైలుకు పంపిస్తే తమకు ఎదురుండదని, తద్వారా రేపటి ఎన్నికల్లో తమకు తిరుగుందందని జగన్ రెడ్డి ఉహించారు. అయితే, ఆయన  రచించిన, వ్యూహం బెడిసి కొట్టింది. స్వయంగా జగన్  రెడ్డే ఇప్పడు   డామిట్ ..కథ అద్దం తిరిగిందని, తలపట్టుకునే పరిస్థితి వచ్చిందని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు అరెస్ట్తో వైసీపీ గ్రాఫ్ గణనీయంగా పడిపోయిందని తాజా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే 2019 ఎన్నికల్లో, ఒక్క ఛాన్స్   వ్యూహంతో వైసీపీని గెలిపించిన, ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్ సైతం, చంద్రబాబు అరెస్ట్ విషయంలో జగన్ రెడ్డిని   తప్పు చేస్తున్నావ్  జగన్ అని హెచ్చరించిట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే  చంద్రబాబు  రిమాండ్  కొనసాగినా, ఆయన జైల్లోనే ఉన్నా  తెలుగు దేశం పార్టీదే గెలుపని తాజా సర్వేలు సూచిస్తున్నాయని అంటున్నారు. 

మరో వంక  చంద్రబాబు అక్రమ అరెస్ట్  ని వ్యతిరేకిస్తూ వేర్వేరు రంగాల ప్రముఖులు స్పందిస్తున్నారు.తెలుగు సినిమా రంగ ప్రముఖులే కాకుండా, తమిళ సినిమా రంగ ప్రముఖులు సైతం చంద్రబాబుకు అండగా నిలిచేందుకు ముందు కొస్తున్నారు. ముఖ్యంగా తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్, ఓపెన్ గా చంద్రబాబు అరెస్ట్ ను ఖండించడమే కాకుండా,  రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్ర బాబును పరామర్శించేందుకు రానున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబును పరామర్శించేందుకు రజనీ కాంత్ వస్తున్నారని ప్రచారం జరిగింది. నిజానికి అది ప్రచారం కాదు, నిజం.

అదే విషయాన్ని రజనీకాంట్ స్వయంగా  చెప్పారు. కుటుంబ  సభ్యులతో కలిసి కోయంబత్తూరు వచ్చిన రజనీకాంత్ ను ఈ విషయమై మీడియా ప్రశ్నించింది. అందుకు.. రజనీకాంత్,  అవును  చంద్రబాబు నాయుడిని కలిసేందుకు ఈ రోజు (ఆదివారం) వెళ్లాలనుకున్నాను. అయితే ఫ్యామిలీ ఫంక్షన్ కారణంగా అది కుదరలేదు  అని చెప్పారు. అంటే  ప్రస్తుతానికి స్వయంగా ఆయన వచ్చినా, రాకున్నా చంద్రబాబుకు ఆయన సంపూర్ణ మద్దతు ఉండనే విషయం మరో మారు స్పష్టమైంది. దీంతో  నెల్లూరు, చిత్తూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రజనీ ఫాన్స్   చంద్రబాబు కు మద్దతు తెలుపుతున్నారు. 

నిజానికి,చంద్రబాబు అరెస్ట్ జరిగిన వెంటనే రజనీకాంత్ ఫోన్ చేసి నారాలోకేష్ ను పరామర్శించారు. నిజానికి, ఒక్క రజనీకాంత్ మాత్రమే కాదు  ఇంకా చాల మంది తెలుగు  తమిళ సినిమా ప్రముఖులు, చంద్రబాబు అరెస్టును తప్పు పడుతున్నారు. అయితే, తొందరపడకుండా, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని  అనేక మంది సినిమా ప్రముఖులు  ఎదురు చూస్తున్నారు.దీంతో, ముందు ముందు, మరిన్ని కష్టాలు తప్పవని వైసేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.