వీధిపోరాటాల స్థాయికి తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరు!.. కొత్త అధ్యక్షుడి ఎంపిక అంత వీజీ కాదు
posted on Nov 20, 2024 10:00AM
దక్షిణాదిలో పాగా వేయాలన్న ఆకాంక్ష నరవేర్చుకోవడానికి బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణను తన రాజకీయ ప్రయోగశాలగా మార్చేసింది. రాష్ట్రంలో కమలం పార్టీకి ఏదో మేరకు బలం ఉండటం.. అర్బన్ ప్రాంతాలలో నాయకత్వం బలంగా ఉండటంతో 2023 అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలోకి రావడం దాదాపు ఖాయమన్న నిర్ణయానికి వచ్చేసిన కమలనాథులు పార్టీని మరింత పటిష్ఠం చేసే దిశగా వడివడిగా అడుగులు వేశారు. అయితే ఆ అడుగులన్నీ తప్పుటడుగులుగా ఆ ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
తెలంగాణలో బీజేపీ బలోపేతం అవుతోందని ఆ పార్టీ నేతలు ఎంత గట్టిగా చెప్పుకుంటున్నా.. వర్గ పోరు కారణంగా రాష్ట్రంలో బీజేపీ పురోగతి రెండడుగులు ముందుకు మూడడుగులు వెనక్కు అన్న చందంగానే తయారైంది. అందుకు ముఖ్యంగా పార్టీ బలోపేతం పేరిట బీజేపీ అగ్రనాయకత్వం ఇతర పార్టీల నుంచి వేరువేరు రాజకీయ కారణాలతో వచ్చే వారికి తలుపులు బార్లా తెరిచేయడమే. దీంతో పార్టీలో కొత్త, పాత నేతల మధ్య విభేదాలు వీధి పోరాటాల స్థాయికి చేరుకున్నాయి. దీంతో తెలంగాణలో బీజేపీ ప్రయోగం పూర్తిగా విఫలమైంది. ఇరత పార్టీల నేతలు, తొలి నుంచీ పార్టీలోనే ఉన్న వారి మధ్య పంచాయతీలు తీర్చ లేక అధిష్ఠానం రాష్ట్రంలో పార్టీ పటిష్ఠత అన్న విషయాన్నే వదిలేసినట్లుగా కనిపిస్తోంది.
గత ఎన్నికల సముదాయంలో ఇంటి పోరును సరిదిద్దేందుకు అప్పటికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను మార్చి పార్టీ రాష్ట్ర పగ్గాలను కిషన్ రెడ్డికి అప్పగించి చేతులు కాల్చుకుంది. ఆ ఎన్నికలలో అధికారం చేపట్టాలని కలలుగన్న పార్టీ కేవలం మూడో స్థానానికి పరిమితమైంది.
ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు పూర్తై ఐదు నెలలు గడిచినా కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్థానంలో మరో అధ్యక్షుడిని నియమించాలని అధిష్ఠానం ఎంత ప్రయత్నిస్తున్నా.. అందరికీ ఆమోదయోగ్యమైన నేతను ఎంపిక చేయడంలో విఫలమౌతోంది. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా బిజీగా ఉంటూ, రాష్ట్ర వ్యవహారాలను మేనేజ్ చేయడం కష్టం అనీ, రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తామనీ బీజేపీ హైకమాండ్ చెప్పిన మాట ఇప్పటికీ ఆచరణలోకి రాకపోవడానికి పార్టీలో అంతర్గత విభేదాలే కారణం.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఈటల రాజేందర్ ఉన్నా ఆయనకు ఆ పదవి రాకుండా బండి సంజయ్ అడ్డం పడు తున్నారని బీజేపీ శ్రేణులే అంటున్నాయి. ఈటల రాజేందర్ కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించడాన్ని ఒక్క బండి సంజ య్ మాత్రమే కాదు.. బీజేపీలోని కోర్ హిందూవాదులు, ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ లాంటి సంస్థలు కూడా గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. గతంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ హైకమాండ్ అనూహ్యంగా బండి సంజయ్ కు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడానికి కారణం ఈటల రాజేందర్ అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయాన్ని బండి సంజయ్ సహా తొలి నుంచీ బీజేపీలో ఉన్న నేతలు నమ్ముతున్నారు. బండి అభిమానులు, బీజేపీ కార్యకర్తలు, రాష్ట్రంలోని హిందూ వాదులు కూడా ఈటల కారణంగానే బండిని పార్టీ హైకమాండ్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిందని భావిస్తున్నాయి. అప్పట్లో బండి వారసుడు ఈటలే అన్న వార్తలు కూడా గట్టిగా వినిపించినా బీజేపీ అధిష్ఠానం మధ్యే మార్గంగా కిషన్ రెడ్డికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది.
దీంతో ఇప్పుడు ఈటలకు పార్టీ అధ్యక్ష పదవి రాకుండా బండి సంజయ్ సంజయ్ అడ్డంపడుతున్నట్టు తెలుస్తోంది. ఈటలకు రివెంజ్ గిఫ్ట్ ఇచ్చేందుకు బండి శత విధాలుగా ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఈ ఇరువురి మధ్యా సయోధ్య కుదిర్చి ఈటలకు పదవి కట్టబెట్టడం ఎలా అని హైకమాండ్ తల పట్టుకుంటోంది. పరిస్థితి కరవమంటే కప్పకు కోపం... వదల మంటే పాముకు కోసం అన్నట్లుగా మారింది. ఈటలకు పదవి ఇస్తే బండి నొచ్చుకుంటాడు.. ఆయనతో పాటు కార్యకర్తలూ కాడె వదిలేస్తారు. ఈటలను పక్కన పెడతామంటే ఆయన బీజేపీనే వదిలేస్తారని పార్టీ హైకమాండ్ భయపడుతోంది. ఎందుకంటే ఈటల సామాజికంగా, ఆర్థికంగా బలమైన నేత.. ఆయన అలిగి పార్టీ మారితే ఒక్కడిగా కాకుండా కొందరు తన వర్గం ఎమ్మెల్యేలనూ కూడా తన వెంట తీసుకుపోయే అవకాశం ఉంది. అలా ఈటల తన వర్గంతో కాంగ్రెస్ గూటికి చేరితే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది. ఆ భయం తోనే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో బీజేపీ హైకమాండ్ ఎటూ తేల్చుకోలేక పోతోంది.
పోనీ మధ్యే మార్గంగా ఈటల రాజేందర్ ను కాదని మరొకరికి అప్పగిద్దామంటే అక్కడా పోటీయే. ఎంపీ రఘునందనరావు, డీకే అరుణ వంటి వలస నేతలూ రేసులో ఉన్నామంటూ గట్టిగా చెబుతున్నారు. వారు చాలరన్నట్లు మరో ఎంపీ అర్వింద్ కుమార్, అలాగే మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరికి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు కట్టబెట్టినా మిగిలిన వారు అలకపాన్పు ఎక్కడం తధ్యం. తెలంగాణలో బీజేపీ అగ్రనాయకత్వం చేసిన ప్రయోగాల కారణంగా రాష్ట్ర పార్టీపై హైకమాండ్ పూర్తిగా పట్టు కోల్పోయింది. కనీసం పార్టీ అధ్యక్షుడిని కూడా ఎంపిక చేయలేని నిస్సహాయ స్థితిలో మిగిలిపోయింది. ఈ పరిస్థితుల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకూ పార్టీ కొత్త అధ్యక్షుడి ఎంపిక, నియామకం పెండింగులోనే ఉన్నా ఆశ్చర్యం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.