మహత్యం ఎంతకి దొరుకుతుంది

 

ఎవరో ఏడుస్తున్న శబ్దం విన్న హరితకి హఠాత్తుగా మెలకువ వచ్చింది. గోడ మీద ఉన్న గడియారం వంక చూస్తే సమయం రాత్రి మూడయ్యింది. ఇంతలో పక్క గదిలోంచి మరోసారి ఎవరో వెక్కివెక్కి ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ఆ వెక్కిళ్ల మధ్య ‘అంటే పిల్లవాడు మనకి దక్కడంటారా!’ అన్న తల్లి మాటలు వినిపించాయి.

 

‘మెదడుకి ఆపరేషన్‌ అంటే మాటలా!’ ఇప్పటికిప్పుడు లక్షలకి లక్షలు కావాలి. అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది. అమ్ముకోవడానికి ఇల్లు లేదు. అప్పు చేయడానికి పరపతి లేదు. నెలనెలా వచ్చే జీతం బొటాబొటీగా మన ఇల్లు గడిచేందుకే సరిపోతోంది. ఏదో ఒక మహత్యం మన జీవితాల్లో ప్రవేశిస్తే తప్ప వాడు బతికేలా లేడు..’ గద్గదమైన స్వరంతో అనునయిస్తున్నాడు తన తండ్రి.

 

తమ్ముడికి వచ్చిన అనారోగ్యం గురించే తన తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్నారన్న విషయం హరితకి అర్థమైంది. కానీ ఆ ఎనిమిదేళ్ల పాపకి మహత్యం అన్న మాటకి మాత్రం అర్థం బోధపడలేదు. కాకపోతే మహత్యం ఉంటే తన తమ్ముడి అనారోగ్యం నమయవుతుందని మాత్రం తెలుసుకొంది. దాంతో తెల్లవారిన వెంటనే సందు చివర ఉన్న మందుల షాపుకి వెళ్లి మహత్యం కొని తీసుకురావాలని మాత్రం నిర్ణయించుకుంది.

 

ఆ రాత్రి హరితకి నిద్రపట్టలేదు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా! ఎప్పుడు తన తమ్ముడి కోసం మహత్యాన్ని కొనుక్కువద్దామా అని ఎదురుచూడటమే సరిపోయింది. ఇంతలో భళ్లున తెల్లవారింది. ఎన్నో రోజుల నుంచి తను పైసాపైసా పోగేసుకుంటూ వచ్చిన డబ్బుల్ని చూసుకుంది. మొత్తం 69 రూపాయల లెక్క తేలింది. ఆ డబ్బులన్నీ ఒక చిన్న మూట కట్టుకుని మందుల షాపు దగ్గరకు చేరుకుంది.

 

మందుల షాపు ఖాళీగానే ఉంది. కానీ ఆ షాపు యజమాని మాత్రం ఎవరో పెద్దాయనతో ఆప్యాయంగా మాట్లాడుతూ కనిపించాడు. అతనిలో మాట్లాడే హడావుడిలో షాపులోకి వచ్చిన హరితని గమనించనేలేదు. ‘అంకుల్‌!’ పిలిచింది హరిత. మందులషాపు యజమాని ఆ మాటలకి ఉలకలేదు, పలకలేదు. హరితకి ఒక్కసారిగా తన తమ్ముడు గుర్తుకువచ్చి ఏడుపు ముంచుకువచ్చింది. ‘‘అంకుల్‌! నా తమ్ముడికి ఒంట్లో బాగోలేదు. వాడి కోసం అర్జంటుగా ఒక మహత్యం కావాలి!’’ అంటూ గట్టిగా అరిచింది.

 

హరిత మాటలు విన్న ఆ ఇద్దరూ ఒక్కసారి ఆమె వంక చూశారు. హరిత కళ్లలో నీరు. షాపతనితో మాట్లాడుతున్నతను ఒక్కసారి హరితను దగ్గరకు తీసుకుని ‘‘మీ తమ్ముడికి ఏం జరిగిందమ్మా!’’ అంటూ అనునయంగా అడిగాడు.
‘‘వాడికి మెదడులో ఏదో తేడా చేసిందట. అది నయం కావాలంటే ఏదో మహత్యం కావాలంట,’’ అంటూ ఏడుస్తూ చెప్పింది హరిత. ఆ పెద్దాయన ఏదో కాసేపు ఆలోచించాడు. ఆ తరువాత ‘‘పద! ఓసారి మీ ఇంటికి వెళ్లి మీ అమ్మానాన్నలతో మాట్లాడదాం,’’ అంటూ హరితను బయల్దేరదీశాడు.

 

ఇంతకీ ఆ పెద్దాయన ఓ పేరు మోసిన వైద్యుడు. తన బంధువుని ఓసారి పలకరించి పోయేందుకని మందుల షాపుకి వచ్చాడు. అక్కడ అనుకోకుండా ఆయనకు హరిత తారసపడింది. హరిత ఇంటికి చేరుకున్న ఆ వైద్యుడికి వారి పరిస్థితి బోధపడింది. వెంటనే పైసా తీసుకోకుండా తన ఆసుపత్రిలో అతని ఆపరేషన్‌కు ఏర్పాటు చేశాడు. ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తయ్యింది. ‘‘నిజంగా ఇలాంటి ఆపరేషన్‌ చేయించాలంటే మన స్తోమత సరిపోయేది కాదు కదా,’’ అన్నాడు ఆసుపత్రి బయట నిల్చొన్న తన భార్యని చూస్తూ.  ‘‘నిజమే! కానీ స్తోమత లేకపోతేనేం. తన తమ్ముడిని ఎలాగైనా బతికించుకోవాలనుకునే హరిత వాడికి తోడుగా ఉంది కదా! అలాంటి మంచి మనసు ఉన్న పిల్ల చాలు. మన కుటుంబం ఏ కష్టాన్నైనా ఎదుర్కోగలదు,’’ అని బదులిచ్చింది హరిత తల్లి.

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

 

..Nirjara

Related Segment News