99 వేల రూపాయల సంఘం

ఒకానొక సమయంలో ఓ గొప్ప జమీందారు ఉండేవాడు. నౌకర్లూ, చాకర్లూ, పొలాలూ, వాహనాలూ, భవనాలూ... ఇలా అన్నిరకాల సంపదలూ ఆ జమీందారు దగ్గర ఉన్నాయి. కానీ ఏం లాభం! అతని మనసులో ప్రశాంతత లేదు, అతని జీవితంలో సంతోషం లేదు. ఓ రోజు ఎప్పటిలాగే జమీందారు దిగాలుగా తన తోటలో కూర్చుని ఉన్నాడు. అదే సమయంలో ఒక పనివాడు తోటలో ఉత్సాహంగా పనిచేయడం అతని కంటపడింది. ఆ పనివాడి ఒంటి మీద సరైన బట్ట లేదు. అయినా ఆడుతూపాడుతూ పనిచేస్తున్న అతన్ని చూసి జమీందారుకి ఆశ్చర్యం వేసింది. ‘ఇంత సంపద ఉన్న నేనే నిస్సారంగా జీవితాన్ని గడిపేస్తుంటే... ఈ పేదవాడు ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నాడు?’ అనిపించింది.


జమీందారుగారు తన మనసులో మాటని వెంటనే దివాన్జీతో పంచుకున్నాడు. దానికి దివాను- ‘ఆ పేదవాడు ఎందుకంత సంతోషంగా ఉన్నాడో... అతని సంతోషాన్ని దూరం చేసే ఉపాయం ఏమిటో నాకు తెలుసు. మీరు ఒక్క 99 వేలు ఇచ్చారంటే... నేను మీకో విచిత్రం చూపిస్తాను,’ అన్నాడు. దివాన్జీ మాట మీద నమ్మికతో జమీందారు ఓ 99 వేలు అతని చేతిలో పెట్టారు.


ఆ రోజు రాత్రి పేదవాడి ఇంటి ముందర 99 వేల రూపాయలున్న మూటని గుట్టుచప్పుడు కాకుండా పెట్టాడు దివాన్జీ! మర్నాడు ఉదయమే లేచి ఆ డబ్బుని చూసిన పేదవాడి సంబరానికి అంతులేకుండా పోయింది. ఈ దెబ్బతో తాను లక్షాధికారిని అయిపోయానని మురుసుకున్నాడు. కానీ లెక్కపెట్టి చూస్తే ఏముంది! ఆ డబ్బు సరిగ్గా 99 వేలే ఉంది. ఈ డబ్బుని ఎవరు అందించారో కానీ, ఎటూ కాకుండా ఇచ్చారేమిటా అని సందేహపడ్డాడు. ఇంకొక్క వేయి రూపాయలు ఉంటే తాను లక్షాధికారిని అయ్యేవాడిని కదా అని బాధపడ్డాడు. ‘ఇప్పుడు మాత్రం మించిపోయిందేముంది! ఈ నెల కాస్త కష్టపడి పనిచేశానంటే ఓ వేయి రూపాయలు మిగుల్చుకుని ఆ లోటుని పూర్తిచేయవచ్చు. ఆ తర్వాత లక్షరూపాయలని ఏం చేయాలా అని ఆలోచించవచ్చు!’ అని అనుకున్నాడు.


మర్నాటి నుంచి ఆ పేదవాడి తీరు మారిపోయింది. ఆ వేయి రూపాయల లోటుని పూడ్చడమే అతని ధ్యేయంగా మారిపోయింది. పనిలోంచి పాట దూరమైపోయింది, మొహంలో స్పష్టంగా చింత కనిపిస్తోంది. ఆ వేయి రూపాయలని పూడ్చేందుకు తన భార్యాబిడ్డలను కూడా పనికి పంపడం మొదలుపెట్టాడు. కానీ అదేం చిత్రమో కానీ... నెల పూర్తయినా కూడా వేయి రూపాయల లోటు నిండలేదు సరికదా.... ఏదో ఒక ఖర్చు పేరుతో ఉన్న డబ్బులోంచి కొంత కరిగిపోయింది. దాంతో లోటు మరింత లోతుకి చేరుకుంది.


ఇలా నెల, రెండు నెలలు కాదు... ఆరు నెలలు గడిచిపోయాయి- కానీ లోటుని పూడ్చడం పేదవాడి వల్లకాలేదు. దాంతో అతని చింత కూడా పెరిగిపోసాగింది. పైగా ఎవరన్నా ఆ డబ్బు కోసం తిరిగివస్తారేమో అన్న భయమూ మొదలైంది. ఇప్పుడు మనిషిలో నవ్వు లేదు, పనిలో జీవం లేదు... మొత్తంగా అతని జీవితంలో సంతోషమే లేదు! ఒకరోజు జమీందారుగారు ఏదో పనిమీద తోటకి వచ్చినప్పుడు, ఆయన కంటికి ఈ పేదవాడు కనిపించాడు. ఆనాడు సంతోషానికి నిర్వచనంగా చూసిన మనిషికీ, ఆ రోజున దుఃఖానికి ప్రతిరూపంగా కనిపించి వ్యక్తికీ ఏమాత్రమూ పొంతన లేదయ్యే! ఇదంతా దివాన్జీ పన్నిన ఉపాయపు ఫలితమే అని అర్థమైంది. వెంటనే దివాన్జీని పిలిపించి విషయాన్ని వాకబు చేశాడు.


దివాన్జీ, జమీందారుకి జరిగిన విషయమంతా చెప్పాడు. ‘ప్రభూ! ఇప్పుడతను 99వేల రూపాయల సంఘంలో సభ్యుడు! అందుకే అతనికి ఆ చింత!’ అన్నాడు దివాన్జీ.


‘99వేల రూపాయల సంఘమా! అదేంటి?’ అని ఆశ్చర్యంగా అడిగాడు జమీందారు.
‘తనకి ఉన్నదానితో సంతృప్తి పడకుండా, ఆ ఉన్నది చేజారిపోతుందేమో అని భయపడుతూ, ఉన్నదానికి మరింత జోడించాలనే తపనతో వ్యాకులపడుతూ... జీవితాన్ని చేజార్చుకునేవారంతా ఈ 99వేల రూపాయల సంఘంలోని సభ్యులే!’ అని చెప్పుకొచ్చాడు.


‘అంటే ఇప్పుడు మనం కూడా ఆ సంఘంలోని సభ్యులమే అంటారా!’ అని అడిగాడు జమీందారు.
‘అందులో సందేహమేముంది ప్రభూ! లేకపోతే మీ మనసులో ఎప్పుడూ ఎడతెగని చింత ఎందుకు ఉంటుంది?’ అని సెలవిచ్చాడు దివాన్జీ. అప్పటి నుంచి జమీందారు తనకి ఉన్నదాంతో సంతృప్తి చెందడం మొదలుపెట్టాడు. ఆ ప్రయత్నంతో అతని జీవితంలోకి సంతోషం కూడా ప్రవేశించింది.
(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

 

- నిర్జర.

Related Segment News