ఇండోనేషియా విమానం అదృశ్యం, 162 మంది గల్లంతు

 

మరొక రెండు రోజుల్లో ఈ 2014సం. ముగియనున్న ఈ సమయంలో మరో ఘోర విమాన దుర్ఘటన జరిగింది. మొత్తం 162 మంది ప్రయాణికులు సిబ్బందితో కూడిన ఇండోనేషియాకు చెందిన నెంబర్: 8501 ఎయిర్ ఏషియా విమానం స్థానిక కాలమాన ప్రకారం నిన్న తెల్లవారుజామున 5.20ని.లకు ఇండోనేషియాలో సురబయ విమానాశ్రయం నుండి సింగపూరు బయలుదేరిన  విమానం 45 నిమిషాలు  ప్రయాణం చేసిన తరువాత జావా సముద్రంపై పయనిస్తున్న సమయంలో ట్రాఫిక్ కంట్రోల్ రూమ్స్ తో సంబంధాలు తెగిపోయాయి. వెంటనే అప్రమత్తమయిన ఇండోనేషియా ప్రభుత్వం విమాన అన్వేషణ కోసం 5 నౌకలు, 2 యుద్ద విమానాలు, ఒక ప్రత్యేక గాలింపు విమానాన్ని విమానం కూలిపోయినట్లు భావిస్తున్న బెలితుంగ్ ప్రాంతానికి పంపింది. అయితే నిన్న రాత్రి చీకటి పడేవరకు వెతికినప్పటికీ విమాన ఆచూకి కనుగొనలేకపోయారు. మళ్ళీ ఈరోజు తెల్లవారు జామునుండే గాలింపు చర్యలు మొదలుపెట్టారు. విమానంలో పయనిస్తున్న వారిలో 149మంది ఇండోనేషియా దేశానికి చెందినవారే ఉన్నారు. విమాన అన్వేషణకు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, బ్రిటన్ తదితర దేశాలు పాలుపంచుకొంటున్నట్లు తాజా సమాచారం.