భారత నూతన ఉపరాష్ట్రపతి ధన్‌కర్
posted on Aug 6, 2022 8:31PM
భారత నూతన ఉపరాష్ట్రపతిగా జగ్‌దీప్ ధన్‌కఢ్ ఘనవిజయం సాధించారు. ఈ రోజు నిర్వహించిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్టీఏ అభ్యర్థి జగదీప్ ధన్కర్ కు మొత్తం 528 ఓట్లు వచ్చాయి. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన మార్కరెట్ ఆల్వాకు 182 ఓట్లు వచ్చాయి. ఎన్టీఏ అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధించడంతో దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగి పోయాయి. ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన ధన్ కర్ వెంకయ్యనాయుడు స్థానంలో 14వ భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన గెలుపును లోక్‌సభ జనరల్ సెక్రటరీ ఉత్పల్ కె.సింగ్ అధికారికంగా ప్రకటించారు. 346 ఓట్ల ఆధిక్యంతో ధన్‌కఢ్ గెలిచారు. మొత్తం పోలైన 725 ఓట్లలో 528 ఓట్లను ఆయన సొంతం చేసుకున్నారు. 15 ఓట్లు చెల్లలేదు. ధన్‌కఢ్‌పై విపక్షాల అభ్యర్థిగా పోటీ చేసిన మార్గరెట్ ఆల్వాకు 182 ఓట్లు వచ్చాయి. మొత్తం 725 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకోగా, 92.94 శాతం పోలింగ్ నమోదైన్టటు ఉత్పల్ కె సింగ్ తెలిపారు.
మార్గెరెట్ ఆల్వా ఎంపిక విషయంలో తమను సంప్రదించలేదంటూ కినుక వహించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్‌కు దూరంగా ఉంది. అయితే సువేందు అధికారి తండ్రి శిశిర్ అధికారి, దిబ్యేందు అధికారి ఓటు వేశారు. 34 మంది టీఎంసీ ఎంపీలు ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు ఉదయమే ఓటు వేశారు. మంత్రులు అమిత్ షా, కిరణ్ రిజిజు, నితిన్ గడ్కరి, ధర్మేంద్ర ప్రధాన్, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, గజేంద్ర సింగ్ షెఖావత్, అర్జున్ రాం మెఘ్వాల్, వి.మురళీధరన్, జ్యోతిరాదిత్య సింధియా,రాజీవ్ చంద్రశేఖర్, బీజేపీ ఎంపీ హేమమాలిని, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఆ పార్టీ ఎంపీలు శశిథరూర్, జైరాం రమేష్, అధీర్ రంజన్ చౌదరి, ఆప్ ఎంపీలు హర్బజన్ సింగ్, సంజయ్ సింగ్, డీఎంకే ఎంపీ కనిమొళి తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
జగ్‌దీప్ ధంఖర్ రాజస్థాన్‌లోని జుంజును జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. చిత్తోర్‌ఘర్‌లోని సైనిక్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత, అతను ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసాడు మరియు రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుండి LLB చదివారు.
ఆయన రాజస్థాన్‌లోని ప్రముఖ న్యాయవాదిగా రాజస్థాన్ హైకోర్టు, సుప్రీంకోర్టు రెండింటిలోనూ ప్రాక్టీస్ చేశాడు. ఆయన రాజస్థాన్ హైకోర్టు బార్ అసోసియేషన్‌కు కూడా నాయకత్వం వహించారు. ఆయన 1989 లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అదే సంవ త్సరం రాజస్థాన్‌లోని జుంజును నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. చంద్రశేఖర్ నేతృత్వంలోని జనతాదళ్ ప్రభుత్వంలో పార్లమెం టరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. జగ్దీప్ ధంకర్ పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా కొనసాగారు. అతను సుదేష్ ధంకర్‌ను వివాహం చేసుకున్నాడు. అగ్దీప్ ధంకర్ జాట్ కమ్యూనిటీకి చెందినవారు.