బతుకమ్మ కోసమో...జి.హెచ్.యం.సి. ఎన్నికల కోసమో?
posted on Oct 2, 2015 12:20PM
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి తెరాసతో ఉన్న రహస్య అనుబంధం మరోమారు నిన్న బయటపడింది. మే నెలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాస అభ్యర్ధికి మద్దతు తెలపడం ద్వారా తమ రెండు పార్టీల మధ్య రహస్య అనుబంధం కొనసాగుతోందని జగన్మోహన్ రెడ్డి స్వయంగా దృవీకరించినట్లయింది. తెరాస అధినేత కేసీఆర్ కుమార్తె మరియు ఎంపీ కవిత నిన్న హైదరాబాద్ లో లోటస్ పాండ్ నివాసానికి వెళ్లి జగన్మోహన్ రెడ్డితో మంతనాలు సాగించారు. కానీ జగన్ భార్య భారతిని బతుకమ్మ పండుగలో పాల్గొనమని ఆహ్వానించేందుకే ఆమె వచ్చేరని వైకాపా చెప్పుకొంటోంది.
ఆంధ్రా నేతలు, పార్టీలు తెలంగాణా రాష్ట్రాన్ని దోచుకు తిన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సార్లు ఆరోపించడం అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రా నేతలను, పార్టీలనే కాదు...సాక్షాత్ జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి కూడా తెలంగాణాని దోచుకొన్నారని తెరాస నేతలు ఆరోపిస్తునే ఉన్నారు. మరి అటువంటప్పుడు తమని దోచుకొన్న అదే నేత కొడుకు ఇంటికి తెరాస ఎంపీ కవిత వెళ్లి అతని భార్యని బతుకమ్మ ఆడుదామని ఎందుకు పిలుస్తున్నట్లు? దాని అంతర్యం ఏమిటి? అనే సందేహాలు కలుగక మానవు.
ఎన్నికలలో ప్రజల సెంటిమెంటును రెచ్చగొట్టవలసి వచ్చినప్పుడు మాత్రమే ఆంధ్రా నేతలు దోపిడీ గురించి, ఇంకా అవసరమయితే రాజశేఖర్ రెడ్డి తెలంగాణాకు చేసిన అన్యాయం, ద్రోహం గురించి తెరాస నేతలు గట్టిగా మాట్లాడుతుంటారు. రాజశేఖర్ రెడ్డి తెలంగాణాకు అన్యాయం చేసారు కానీ తెరాసకు కాదు కనుక మిగిలిన సమయంలో మాత్రం తమ తమ రాజకీయ అవసరాల నిమిత్తం వైకాపాతో స్నేహంగా ఉంటారు. వైకాపా అధినేత జగన్ ఇంటికి వెళ్లి ఆయన భార్య భారతిని మాత్రమే బతుకమ్మ ఆడేందుకు పిలవడంలో అంతర్యం కూడా అదే అయిఉండవచ్చును. లేకుంటే చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా ఆమె వెళ్లి ఆహ్వానించేవారు.
కానీ మళ్ళీ అక్కడే చాలా తెలివిగా తెదేపాను ‘ఫిల్టరింగ్’ చేసేసారు. కవిత వెళ్ళింది సాక్షి మీడియా చైర్ పర్సన్ భారతిని కలవడానికి కానీ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని కాదని చెప్పడం చూస్తే “ఆహా! ఏమి తెలివితేటలు? అని అందరూ ఆశ్చర్యపోక తప్పదు. సాక్షి మీడియా చైర్ పర్శన్ భారతిని ఆహ్వానించారు కనుక మిగిలిన మీడియా అధినేతల అందరి ఇళ్ళకు వెళ్లి వారి భార్యలను కూడా కవిత ఆహ్వానిస్తారనుకోలేము. ఎందుకంటే వారందరికీ రాజకీయ పార్టీలు లేవు. అయితే ఇంతకీ కవిత లోటస్ పాండ్ కి ఎందుకు వెళ్ళినట్లు? అని ఆలోచిస్తే వరంగల్ లోక్ సభ స్థానానికి ఉపఎన్నికలలో, జి.హెచ్.యం.సి. ఎన్నికలలో వైకాపా మద్దతు లేదా సహకారం కోరడానికే అయ్యుండవచ్చును.
వరంగల్ పట్టణంలో కూడా ఆంధ్రాకు చెందినవారు చాలా మందే స్థిరపడి ఉన్నారు. కనుక వాళ్ళకి గాలం వేయాలంటే వైకాపా ఉండాల్సిందే. ఇక జి.హెచ్.యం.సి. వార్డుల పునర్విభజన నిలిపివేస్తున్నట్లు ఈ మధ్యనే తెరాస ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జి.హెచ్.యం.సి.పరిధిలో స్థిరపడిన ఆంధ్రా ఓటర్లను ఏరివేసే ప్రక్రియ కూడా ఒక కొలిక్కి వస్తోంది. జి.హెచ్.యం.సి. ఎన్నికల షెడ్యుల్ ప్రకటించడానికి హైకోర్టు ఇచ్చిన గడువు కూడా దగ్గర పడుతోంది. కనుక ఈ ఏడాది చివర్లోగా జి.హెచ్.యం.సి. ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో ఆంధ్రా ఓటర్ల ఏరివేయడం, విద్యుత్ సంస్థల నుండి 1239 మంది ఉద్యోగులను తొలగించడం వంటి అనేక కారణాల వలన ఆంధ్రా ప్రజల నుండి తెరాస తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకొంది. కనుక ఈ ఎన్నికలలో మిగిలిన ఆంధ్రా ఓటర్లకు గాలం వేయాలంటే వారికి 'ఆంధ్రా గాలాన్నే' ఉపయోగించవలసి ఉంటుంది. అందుకే బతుకమ్మ పండుగకి భారతిని ఆహ్వానించే సాకుతో తెరాస, వైకాపా నేతలిద్దరూ లోటస్ పాండ్ లో మంతనాలు సాగించి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాసకి మద్దతు తెలిపిన జగన్, ఈ ఎన్నికలలో మాత్రం దానికి మద్దతు, సహకారం ఇవ్వకుండా ఉంటారనుకోలేము.