భారత్-పాక్ సమావేశం రద్దయినట్లే?

 

భారత్-పాక్ దేశాల జాతీయ భద్రత సలహాదారుల డిల్లీలో సోమవారం జరగవలసిన సమావేశం రద్దయినట్లే భావించవచ్చును. ఆ సమావేశానికి ముందు పాక్ జాతీయ భద్రత సలహాదారు సర్తాజ్ అజీజ్ కాశ్మీరీ వేర్పాటువాద సంస్థ హురియత్ నేతలతో డిల్లీలో సమావేశం అవుతారని పాక్ ప్రకటించడంతో భారత్ అందుకు తీవ్ర అభ్యంతరం తెలిపింది. రష్యాలో ఉఫా అజెండా ప్రకారం ఉభయ దేశాల జాతీయ భద్రత సలహాదారులు కేవలం ఉగ్రవాదంపై చర్చించేందుకు మాత్రమే డిల్లీలో సమావేశమవ్వాలని భారత్-పాక్ ప్రధానులు అంగీకరించగా, ఇప్పుడు పాక్ హురియత్ నేతలతో సమావేశం అవుతామని చెప్పడం ఆ ఉఫా ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని భారత్ వాదిస్తోంది. ఇది భారత్-పాక్ చర్చల మధ్య మూడవ వర్గాన్ని కూడా చేర్చడమేనని, అందుకు తాము అంగీకరించబోమని భారత్ తేల్చి చెప్పింది. ఒకవేళ భారత్-పాక్ దేశాల జాతీయ భద్రత సలహాదారుల సమావేశం జరగాలని పాకిస్తాన్ నిజంగా కోరుకొంటున్నట్లయితే హురియత్ నేతలతో సమావేశమావ్వాలనే ఆలోచనని విరమించుకోమని భారత్ సూచించింది.

 

కానీ భారత్ చేసిన ఆ సూచనను పాక్ నిర్ద్వందంగా త్రోసిపుచ్చింది. కాశ్మీర్ అంశం లేకపోతే ఈ సమావేశం నిర్వహించడం వృధా అని తేల్చి చెప్పింది. పైగా భారత్ నిఘా వర్గాలు బెలూచిస్తాన్ లో పాకిస్తాన్ వ్యతిరేక చర్యలకు ప్రయత్నిస్తున్నాయని కొత్త ఆరోపణ చేసింది. తన వాదనను సమర్ధించుకొనేందుకు పాక్ మూడు నివేదికలు కూడా సిద్దం చేసుకొంది. ఒకవేళ ఇరు దేశాల జాతీయ భద్రత సలహాదారుల సమావేశం జరిగితే అందులో దానిని భారత్ ముందు పెట్టి సంజాయిషీ కోరుతామని తెలిపింది.

 

రష్యాలో ఇరుదేశాల ప్రధానులు ఈ సమావేశం నిర్వహించడానికి అంగీకరిస్తూ ప్రకటన చేసినప్పటికీ, భారత్-పాక్ సరిహద్దుల వద్ద తుపాకుల మోతలు వినిపిస్తూనే ఉన్నాయి. వీలు చిక్కినప్పుడల్లా పాక్ ఉగ్రవాదులు భారత్ పై దాడులు చేస్తూనే ఉన్నారు. ఒకవేళ పాకిస్తాన్ నిజంగా శాంతి కోరుకొంటున్నట్లయితే సమావేశానికి ముందు ఇటువంటి వాతావరణం, ఇటువంటి కొత్త మెలికలు, కొత్త ఆరోపణలు చేసేదే కాదు. కానీ దానికి ఈ సమావేశంలో హాజరు కావడం ఎంత మాత్రం ఇష్టం లేదు కనుకనే సమావేశ సమయం దగ్గిర పడుతున్నకొద్దీ రెచ్చిపోతోంది. కానీ పాక్ ఈ సమావేశం జరగకూడదని కోరుకొంటోంది? అని ప్రశ్నించుకొంటే దానికి చాలా బలమయిన కారణమే కనిపిస్తుంది.

 

ఇటీవల జమ్మూ లోని ఉదంపూర్ వద్ద పాక్ ఉగ్రవాది ఉస్మాన్ ఖాన్ సజీవంగా పట్టుబడటంతో ఆ దాడుల్లో పాక్ హస్తం, ప్రోత్సాహం ఉందని నిరూపించేందుకు భారత్ కు చాల బలమయిన ఆధారం లభించింది. ఇటువంటి పరిస్థితుల్లో సమావేశంలో పాల్గొనాలంటే పాకిస్తాన్ చాలా ఇబ్బందికరమయిన ప్రశ్నలకు జవాబులు చెప్పవలసి ఉంటుంది. అందుకే ఈ సమావేశం చెడగొట్టేందుకు మధ్యలో హురియత్ నేతలతో సమావేశం అంటు తెలివిగా మెలికపెట్టి తప్పించుకొంటోంది. కశ్మీరీ అంశంపై చర్చ జరగాలని పట్టుబట్టడం, భారత్ నిఘా వర్గాలపై లేనిపోని నిందలు వేస్తూ విమర్శలు ఎదుర్కోవలసిన తరుణంలో ప్రతివిమర్శలు చేస్తూ చాలా అతితెలివి ప్రదర్శిస్తోంది.

 

కానీ ఉఫా అజెండా ప్రకారం ఈ సమావేశం జరపడమా లేక రద్దు చేసుకోవడమో పాకిస్తాన్నే తేల్చుకోమని చెప్పడం ద్వారా భారత్ తనపై నిందపడకుండా తెలివిగా తప్పించుకొంటూ అదే సమయంలో పాకిస్తాన్ని అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టగలిగింది. ఇరు దేశాలు తమ వైఖరికి గట్టిగా కట్టుబడి ఉన్నందున ఇక ఈ సమావేశం జరిగే అవకాశం లేదనే భావించవచ్చును. ఒకవేళ ఇటువంటి వాతావరణంలో సమావేశం జరిగినా అది పరస్పరం నిందించుకోవడానికి, విమర్శలకే పరిమితం అవవచ్చును.