మెగాస్టార్ చిరంజీవి 60 నాటవుట్...
posted on Aug 22, 2015 11:11AM
ఈరోజు మెగాస్టార్ చిరంజీవి జన్మదినం. నవ యువకుడిలా కనిపిస్తున్న ఆయనకి 60సం.లంటే ఎవరికీ నమ్మలేకపొతున్నారు. ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకయిన కొణిదెల శివ శంకర ప్రసాద్ మెగాస్టార్ గా ఎదిగేందుకు చాలా కృషి చేసారు. సినీపరిశ్రమలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన తరువాత, ఆ సినీ పరిశ్రమను విడిచిపెట్టి రాజకీయాలలోకి ప్రవేశించారు. సినీ పరిశ్రమలో పైకి ఎదగడానికి ఆయన చాలా ఒడిడుకులు ఎదుర్కొన్నారు. కానీ తన స్వల్ప రాజకీయ జీవితంలో అంతకంటే చాలా ఎక్కువే ఒడిడుకులు ఎదుర్కోవలసి వచ్చింది.
రాజకీయాలలో చేరిన తరువాత ఆయనకు మూడుసార్లు అగ్నిపరీక్షలు ఎదుర్కోవలసి వచ్చింది. మొదటిసారి ఆయన సమైక్యాంధ్ర, తెలంగాణా పట్ల తన వైఖరిని ప్రకటించవలసి వచ్చినప్పుడు సందిగ్ధంలో పడ్డారు. చివరికి సమైక్యాంధ్రకే మొగ్గు చూపారు కానీ పెద్దగా ఫలితం లేకపోయింది.
తరువాత తను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఎన్నికలలో ఓడిపోయినప్పుడు మళ్ళీ సందిగ్దంలో పడ్డారు. ఎన్నో ఆశలు, ఆశయాలతో స్థాపించిన పార్టీ బోర్లా పడటంతో రాజకీయాలలోకి ప్రవేశించి తప్పు చేశానా? అని మధనపడవలసి వచ్చింది. ఆ పరిస్థితులను అధిగమించి కాంగ్రెస్ లో చేరి రాజకీయాలలో రాణిస్తున్న సమయంలో రాష్ట్ర విభజన అంశం ఆయనకు మరో అగ్నిపరీక్షగా మారింది.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు పూనుకోవడం, ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలనుకోవడంతో కాంగ్రెస్ పార్టీతో బాటు ఆయన కూడా ప్రజలనుండి వ్యతిరేకత ఎదుర్కోవలసి వచ్చింది. పైగా అదే సమయంలో ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో రాజకీయాలలోకి ప్రవేశించడం, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకిస్తూ తెదేపా, బీజేపీలతో చేతులు కలపడంతో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో స్వయంగా చిరంజీవే సారధ్యం వహించినప్పటికీ ఎన్నికలలో ఆ పార్టీ ఘోరపరాజయం పాలయింది. మళ్ళీ ఇప్పుడప్పుడే కోలుకొనే పరిస్థితి కనబడకపోవడంతో ఆయన మళ్ళీ సినిమాలలోకి వచ్చినట్లున్నారు.
ఆయన ఇప్పుడు తన 150వ సినిమా తీయడానికి సంసిద్ధం అవుతున్నారు. రాజకీయాలలో మంచిపేరు సంపాదించుకోవడం ఎంతటివారికయినా కష్టమేనని చిరంజీవి రాజకీయ జీవితం చూస్తే అర్ధమవుతుంది. కానీ అదేకష్టం సినిమాలలో పెడితే చాలా ఉన్నత శిఖరాలకు చేరవచ్చునని ఆయన సినీ జీవితం చూస్తే అర్ధమవుతుంది. తనకు ఎనలేని పేరు ప్రతిష్టలు, ప్రజాధారణ తెచ్చిపెట్టిన సినీ పరిశ్రమకి తిరిగి వచ్చారు కనుక ఆయన సెకండ్ ఇన్నింగ్స్ చాలా విజయవంతంగా సాగుతుందని అందరికీ తెలుసు. కానీ ఆయన ఎప్పటికీ సినీ పరిశ్రమలోనే ఉండాలని ఆయన అభిమానులు కోరుకొంటున్నారు. మరి ఆయన వారి చిరు కోరికని మన్నిస్తారో లేక ఇంకా రెండు పడవలలో కాళ్ళు పెట్టి సాగుతారో వేచి చూడాలి. తెలుగు ప్రజలందరి తరపున తెలుగు ఒన్ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.