పట్టుబడింది గోరంతైతే కొండంత దొరికిందని వైసిపి ఆరోపిస్తోంది: టిడిపి

ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రైడ్స్ రచ్చ కంటిన్యూ అవుతోంది. అయితే అధికారులిచ్చిన పంచనామా రిపోర్టు టిడిపి బయటపెట్టటంతో ఈ టాపిక్ మరోసారి చర్చనీయాంశమైంది. పట్టుబడింది గోరంతైతే కొండంత దొరికిందని వైసిపి ఆరోపిస్తోందని టిడిపి ఫైరైంది. అయితే అది ఒక రోజు పంచనామా రిపోర్టు మాత్రమేనంటూ వైసిపి కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేసింది. మరోవైపు ఈ అంశంపై పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు మాజీ పిఎస్ శ్రీనివాస్ ఇంట్లో ఐటీ సోదాలపై రగడ కొనసాగుతోంది. శ్రీనివాస్ ఇంట్లో రెండు వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలకు సంబంధించిన అంశాలు బయటపడ్డాయంటూ వైసీపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ ఇచ్చిన పంచనామా రిపోర్టును టిడిపి నేతలు బయటపెట్టారు. అందులో ఓ రశీదులో రెండు లక్షల అరవై మూడు వేలు, మరో రసీదులో యాభై రెండు లక్షల విలువైన బంగారు ఆభరణాలు గుర్తించినట్లు ఐటి శాఖ పేర్కొంది.

దీనిపై వైసీపీ నేతలు ఏం సమాధానం చెబుతారని టిడిపి నేతలు ప్రశ్నించారు. అయితే వైసీపీ మాత్రం టిడిపి ఆరోపణలను ఖండించింది. డిజిటల్ లావాదేవీల పైనా, లాకర్ లలో బయటపడిన దానిపైనా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ రసీదులు రెండూ ఒకరోజు సోదాలకు సంబంధించినవి మాత్రమేనని చెబుతోంది. రెండు వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఐటి శాఖే లిఖిత పూర్వకంగా చెప్పిందన్నారు వైసిపి నేత అంబటి రాంబాబు. మరోవైపు ఐటీ సోదాలపై బిజెపి కూడా స్పందించింది. వ్యవస్థను భ్రష్టు పట్టించడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఉండదన్నారు ఆ పార్టీ నేత సోము వీర్రాజు. చంద్రబాబు హయాంలో అక్రమాలు జరుగుతున్నాయని తాము మొదట్నుంచీ చెబుతున్నామన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఐటీ రైడ్స్ పై రియాక్టయ్యారు. జనసేన ఎప్పుడూ అవినీతిని ప్రోత్సహించబోదని స్పష్టం చేశారు, డబ్బుతో రాజకీయం చెయ్యట్లేదు కాబట్టే జనసేనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఐటీ రైడ్స్ పై చంద్రబాబు, లోకేశ్ ఎందుకు స్పందించడం లేదంటూ వైసీపీ ప్రశ్నిస్తూనే ఉంది.