నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు ఇందుకే….
posted on Jan 27, 2025 9:30AM
మాట్లాడటం కూడా ఒక కళ అంటారు కొందరు. అంతి తడబాటు లేకుండా, విషయాన్ని సూటిగా, స్పష్టంగా, అది ఎదుటి వారికి నచ్చని విషయమైనా వారు నొచ్చుకోకుండా ఉండేలా చెప్పడానికి మనిషిలో ఎంతో చతురత, అంతకు మించి సమయస్ఫూర్తి ఉండాలని చెబుతారు. దీనికి ఉదాహరణగా రామాయణంలో హనుమంతుడిని చూపించేవారు ఎంతోమంది ఉన్నారు. ఎదుటివారిని మెప్పించేలా మాట్లాడటం, తనది కాని చోటుకు వెళ్లి అక్కడి నుండి క్షేమంగా తిరిగి రావడం హనుమ కార్యసాధనలో ఆయన మాటతీరే ఆయనకు బోలెడు సహాయం చేసిందని చెప్పవచ్చు.
అందుకే మన మాట తీరు అనేది చాలా ముఖ్యమని పెద్దలు చెబుతారు. మనం ఎవరితో మాట్లాడినా ఎదుటివారు మన మాట తీరుని బట్టి మన వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. వ్యక్తిత్వం అనేది చాలా ముఖ్యం. మన మాట తీరుపైనే మన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది.
మన మాట తీరులోనే మనలో ఉండే సభ్యత, సంస్కారం బయటపడతాయి. మనం మాటల ద్వారానే ఎదుటివారి యొక్క ప్రశంసలను పొందవచ్చు. మనం ఎప్పుడైనా సరే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళ ఆసక్తిని కనిపెట్టి దానికి తగ్గట్టుగా విషయాన్ని మార్చి మాట్లాడాలి. అంతేకానీ మనం మాట్లాడుతున్నది ఇక ఆపకూడదు మొత్తం చెప్పేయాలి అనే ఆలోచనలో ఎదుటివారి పరిస్థితి అసలు గమనించకుండా మాట్లాడకూడదు. మనం ఎప్పుడూ కూడా ఏదైనా ఒక విషయం గురించి చర్చించేటప్పుడు స్పష్టంగా మాట్లాడాలి. ఎందుకంటే సనుగుకుంటూ మాట్లాడితే మన మాటలు ఎదుటివారికి అర్ధం కావు. అట్లాగే వారు మనం చెప్పే దానిపట్ల ఆసక్తి చూపరు. ఎప్పుడూ మన గురించి, మన గొప్పలు గురించి గానీ, మన కుటుంబ సభ్యుల గురించిన ఎటువంటి గొప్పలను కూడా చెప్పుకోకూడదు. అట్లాంటి విషయాలు వినడానికి ఎదుటివారు ఆసక్తి చూపరు. మన దగ్గర నుంచి ఎప్పుడు తప్పించుకుందామా అన్నట్లుగా చూస్తూ ఉంటారు. అట్లాంటి పరిస్థితి ఎదుటివారికి రానివ్వకూడదు.
కొంతమంది మాట్లాడేటప్పుడు నోటిలో నుంచి తుంపర ఎదుటివాళ్ళ మీద పడుతుంది. అది మంచి పద్ధతి కాదు. మనకు అట్లాంటిది ఉంటే గనుక ఎదుటివారు మనతో మాట్లాడటానికి సంకోచిస్తారు. మన ప్రక్కన కూర్చోవాలన్నా, మనతో భోజనం చేయాలన్నా, మనతో మాట్లాడాలన్నా వారు ఇష్టపడరు. మనల్ని ఎప్పుడూ దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అట్లాంటి అలవాటు ఎవరికైనా ఉంటే అది మానుకోవటం చాలా మంచిది. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలి. అనవసరంగా ఏ విషయం గురించీ మాట్లాడకూడదు. అట్లాగే అవసరానికి మించి ఎక్కువగా కూడా మాట్లాడకూడదు. అధిక ప్రసంగం అనర్ధాలకు మూలం.
Speech is silver but silence gold అని ఒక వాక్యం ఉంది. అది అక్షరాల నిజం. అంటే దీని అర్ధం అన్ని వేళలా మౌనంగా ఉండమని కాదు. అవసరమైన చోట ఇది పాటిస్తే చాలు జీవిత గమనాన్ని మార్చుకుని మంచివైపుకు పయనం చేయగలుగుతాము.
◆నిశ్శబ్ద.