స్విమ్మింగ్ పూల్‌లో పడి మూడేళ్ల బాలుడు మృతి

 

హైదరాబాద్ నగరంలోని కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్‌నగర్ ప్రాంతంలో జరిగిన విషాదకరమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఓ గేటెడ్ కమ్యూనిటీలోని స్విమ్మింగ్ పూల్‌లో పడి అర్జున్ కుమార్ (3) అనే మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన పలువురి కంటతడి పట్టించింది. హైదర్‌నగర్‌లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటున్న అర్జున్ కుమార్ అనే బాలుడు ఈరోజు ఆదివారం మధ్యాహ్నం సమయంలో తన తల్లిదండ్రుల సమీపంలో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అర్జున్ ఆడుకుంటూ ఆడుకుంటూ ఈత కొలను వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు.

 ఆ సమయం లో స్విమ్మింగ్ పూల్ వద్ద ఎవరు లేరు..కొంతసేపటి తర్వాత బాలుడు కనిపిం చకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. చివరకు స్విమ్మింగ్ పూల్‌లో బాలుడు నీటిలో మునిగిపోయి ఉన్నట్టు గుర్తించారు. వెంటనే అతడిని బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో అర్జున్ తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపో యారు. ఒక్కసారిగా జరిగిన ఈ దుర్ఘటనతో కుటుంబంలో శోకసంద్రం నెలకొంది. గేటెడ్ కమ్యూనిటీలో చిన్నారుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈత కొలను ప్రాంతంలో తగిన పర్యవేక్షణ లేకపోవడం, సేఫ్టీ ఏర్పాట్లు సరిగా లేకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకున్నదని గ్రేటర్ కమ్యూనిటీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. 

సమాచారం అందుకున్న వెంటనే కె.పి.హెచ్.బి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదవశాత్తు మృతి కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈత కొలను వద్ద భద్రతా నిబంధనలు పాటించారా? పర్యవేక్షణ లోపం ఉందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.ఈ విషాద ఘటన గేటెడ్ కమ్యూనిటీల్లో చిన్నారుల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. స్విమ్మింగ్ పూల్‌ల వద్ద తగిన రక్షణ చర్యలు, పర్యవేక్షణ తప్పనిసరి అన్న విషయం ఈ ఘటనతో స్పష్టమవుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu