ఇరు రాష్ట్రాల సీఎం లను కలిపిందెవరు?
posted on Oct 3, 2019 10:12AM

తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి రెండుసార్లు కలిశారు. ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. సాగు నీటి ప్రాజెక్టులతో పాటు రెండు రాష్ట్రాల సమస్యల పై చర్చించారు. ఎన్నికల ముందు నాటికి వీరిద్దరూ కలిసింది లేదు. కానీ ఏపీ ఎన్నికల తరువాత కేసీఆర్, జగన్ కలిసి పనిచేస్తు ఏకతాటిపై ముందుకు సాగుతున్నారు. అయితే వీరిని కలిపింది ఎవరు అనే విషయం పై ఇప్పుడు చాలా చర్చ జరుగుతోంది. వైఎస్ రాజశేఖరెడ్డి ఆత్మగా పేరున్న కెవిపి, రాష్ట్ర విభజన తరువాత తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో దాదాపు కనుమరుగయ్యారని అనుకున్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకే పరిమితమైన ఆయనా పెద్దగా పొలిటికల్ ప్లాట్ ఫాంపై కనిపించింది తక్కువ. రాష్ట్ర విభజన సమస్యల పై రాజ్య సభలో పోరాటం చేశారు. ప్లేకార్డులతో ప్రదర్శనలు చేసేవారు. వైఎస్ తో కేవీపీకి సన్నిహిత సంబంధాలున్నాయి. కానీ జగన్ తో సంబంధాలు అంతగా లేవనేది అందరూ చెప్పే మాట.
కాంగ్రెస్ వదిలి వచ్చేటప్పుడు తన మాట వినలేదని కెవిపి ఆ తర్వాత జగన్ కూ దూరమయ్యాడని ఓ ఊహ . అయితే ఇప్పుడు మళ్లీ జగన్ కే కేవీపీ దగ్గరయ్యారని ఓ గుసగుస రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. కేసీఆర్ తో జగన్ ను దగ్గర చేసింది కెవిపి అని ప్రచారం నడుస్తోంది. విభజన సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు గోదావరి, కృష్ణా జలాలను అనుసంధానం చేయడం వెనుక ఇద్దరు సీఎంలు కలిసి కూర్చోవడం వెనుక కేవీపీ ఎత్తుగడలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రోజెక్టు రివర్స్ టెండరింగ్ విషయంలో కూడా కేవీపీ సూచన మేరకే జరిగిందని ఏపీ రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారు. అయితే జగన్ కేవీపీ మధ్య సన్నిహిత సంబంధాలు లేవని కొందరు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే సంభందాలు ఉన్నాయని రాజకీయ సంబంధాలూ లేవని వీరంటున్నారు. టీఆర్ఎస్ నేతల నుంచి కూడా ఇదే సమాధానం వస్తుంది. కేవీపీ నుంచి తమకు సలహాలు స్వీకరించే అవసరం లేదనేది వారి వాదన. కేవీపీ కాంగ్రెస్ నేతని ఆయన సలహాలు ఎలా తీసుకుంటారనేది గులాబీ నేతల విమ్మర్షలు చేస్తున్నారు.