హుజూర్ నగర్ లో హోరాహోరీ... మొత్తం యంత్రాంగాన్నే దింపుతోన్న టీఆర్ఎస్

 

రాజీనామాలు, ఉపఎన్నికలే ఆయుధంగా ఎదిగి బైపోల్స్ లో రికార్డులు మోత మోగించిన టీఆర్ఎస్ ను హుజూర్ నగర్ ఉపఎన్నిక భయపెడుతోంది. ఏదిఏమైనాసరే హుజూర్ నగర్ లో గులాబీ జెండా ఎగరేసి తీరాలన్న కసితో ముందుకెళ్తోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా... ఒకే ఒక్క ఉపఎన్నిక ద్వారా అటు కాంగ్రెస్ ను... ఇటు బీజేపీని చావు దెబ్బ కొట్టాలని వ్యూహప్రతివ్యూహాలకు టీఆర్ఎస్ పదునుపెడుతోంది. హుజూర్ నగర్ లో ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిచి తీరాల్సిందేనని, లేదంటే ప్రత్యర్ధుల చేతికి ఆయుధం ఇచ్చినట్లే అవుతుందని భావిస్తున్న అధికార టీఆర్ఎస్.... దాదాపు మొత్తం మంత్రిమండలితోపాటు ఎమ్మెల్యేలను ముఖ్యనేతలను మోహరిస్తోంది. అయితే, ఎన్నడూ లేనంతగా గట్టిపోటీ నెలకొనడంతో హుజూర్ నగర్ లో గెలుపు టీఆర్ఎస్ కు అత్యంత సవాలుగా మారిందంటున్నారు.

మొన్నటి ఎన్నికల్లో కేవలం ట్రక్కు గుర్తు వల్లే టీఆర్ఎస్ ఓడిపోయిందని భావిస్తోన్న టీఆర్ఎస్... ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి లేకపోవడంతో, పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తోంది. ఇప్పటికే మంత్రి జగదీశ్ రెడ్డికి హుజూర్ నగర్ ప్రచార బాధ్యతల్ని అప్పగించగా, కేసీఆర్ ఆదేశాలతో పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా రంగంలోకి దిగారు. ఇక, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్... మొత్తం ప్రచార బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. అయితే, మండల, గ్రామ, వార్డు స్థాయిలో... ప్రజల దగ్గరకు వెళ్లడానికి  మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలకు బాధ్యతలు అప్పగించారు. ముఖ్యంగా టీఆర్ఎస్ గెలిస్తేనే హుజూర్ నగర్ అభివృద్ధి జరుగుతుందన్న నినాదంతో ప్రచారాన్ని హోరెత్తించాలని గులాబీ లీడర్లకు, కేడర్ కు అధిష్టానం ఆదేశాలిచ్చింది. 

అయితే, పేరుకు తన భార్య బరిలో ఉన్నా, అసలు పోటీ తనకూ, టీఆర్ఎస్ కు కావడంతో, పీసీసీ చీఫ్ ఉత్తమ్ సవాలుగా తీసుకున్నారు. కేవలం గెలవడమే కాకుండా 30వేలకు పైగా భారీ మెజారిటీ సాధించే దిశగా ముందుకెళ్తున్నారు. నోటిఫికేషన్ కు నెలరోజుల ముందు నుంచే కేడర్ తో సమావేశాలు నిర్వహిస్తూ, ప్రజల్లోకి వెళ్తున్న ఉత్తమ్.... టీఆర్ఎస్ కు దీటుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఉత్తమ్ కు బాసటగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి లాంటి సీనియర్లు రంగంలోకి దిగుతున్నారు.

మొత్తానికి, హుజూర్ నగర్ సిట్టింగ్ సీటును నిలబెట్టుకుని, సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తుంటే, ఈసారి ఎలాగైనాసరే గులాబీ జెండా ఎగురవేసి విజయ ఢంకా మోగించాలని టీఆర్ఎస్ పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. మరోవైపు, ఈ రెండు పార్టీలకు బీజేపీ గుబులుపుట్టిస్తోంది. ఏదొకవిధంగా హుజూర్ నగర్లో కాషాయ జెండా ఎగరేసి, 2023లో అధికారంలోకి వచ్చేది తామేనని చెప్పాలని భావిస్తోంది. మొత్తానికి హుజూర్ నగర్ ఉపఎన్నిక... అటు టీఆర్ఎస్, కాంగ్రెస్ కే కాకుండా... ఇటు బీజేపీకి కూడా చావోరేవో అన్నట్లుగా మారింది.