కేసీఆర్ పై అప్పుడే తమిళిసై రిపోర్ట్... జగన్ పైనా అమిత్ షాకి నివేదిక..!

 

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో గవర్నర్ల నియామకంపైనా చర్చ జరిగింది. కనీసం మాట మాత్రంగానైనా చెప్పకుండా గవర్నర్లను నియమించారని, పైగా కరుడుగట్టిన బీజేపీవాదులను ఏరికోరి పంపించారని కేసీఆర్, జగన్ అభిప్రాయపడినట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి. ముఖ్యంగా తెలంగాణలో కేసీఆర్ అండ్ టీఆర్ఎస్ టార్గెట్ గానే తమిళిసైని రంగంలోకి దింపారని ఆమె పేరు ప్రకటించినరోజు నాటి నుంచే ప్రచారం జరుగుతోంది. పైగా గవర్నర్ల వ్యవస్థపైనా, కేంద్రం తీరుపైనా... తమిళిసై తెంగాణకు వచ్చిన రోజే ...ఓ ప్రముఖ పత్రికలో కేసీఆర్ సీపీఆర్వో రాసిన కథనం పెను దుమారమే సృష్టించింది. గవర్నర్ తమిళిసై టార్గెట్ గా, కేంద్రం తీరును ఎండగడుతూ, ముఖ్యమంత్రి కేసీఆరే... తన సీపీఆర్వోతో ఆ కథనాన్ని రాయించారని బీజేపీ ఆరోపించింది. ఇక తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించి కనీసం రెండు వారాలు కూడా కాకముందే, ఢిల్లీ వెళ్లిన తమిళిసై.... అప్పుడే కేసీఆర్ గవర్నమెంట్ పైనా, రాష్ట్రంలో పరిస్థితులపైనా కేంద్రానికి, ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి రిపోర్ట్ ఇవ్వడం సంచలనంగా మారింది.

అయితే, గవర్నర్ తమిళిసై ఢిల్లీ పర్యటనలో ఉండగా, కేసీఆర్-జగన్ లు గవర్నర్ల నియామకంపై అసంతృప్తి వ్యక్తంచేయడం చూస్తుంటే... తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోన్న పరిణామాలను కేంద్రానికి ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తున్నారని గుర్తించే, అలాంటి కామెంట్స్ చేశారని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు, విపక్షాల విమర్శలు, లోటుపాట్లు, ప్రజాఆందోళనలు, వివాదాస్పద నిర్ణయాలు, మీడియా కథనాలు... ఇలా ప్రతి ఒక్కటీ క్షణాల్లో కేంద్రానికి చేరిపోతోందని, అది గుర్తించే ఏపీ సీఎం జగన్ ....సీఎంవోతో ఆగమేఘాల మీద ప్రకటన ఇప్పించారని చెప్పుకుంటున్నారు.

ఏపీ సీఎంవో వివరణ ఇచ్చినప్పటికీ, ముఖ్యమంత్రుల సమావేశంపైనా, మీటింగ్ ఇన్నర్ టాక్స్ పైనా, మీడియా కథనాలపైనా కేంద్రానికి ఇప్పటికే రిపోర్ట్ వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రధానంగా కేంద్రం తీరుపై అసహనం, గవర్నర్ల నియామకంపై అసంతృప్తి వ్యక్తంచేశారన్న కామెంట్స్ అమిత్ షాకి చేరాయని అంటున్నారు. మరి కేసీఆర్-జగన్ మీటింగ్ ఇన్నర్ కామెంట్స్ పై కేంద్రం ఎలా రియాక్టవుతుందో... ముందుముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.