భార్యాభర్తలు మెసేజ్ లలో ఈ పనులు చేస్తే వారి రిలేషన్ నాశనమే..!
posted on Sep 27, 2024 9:30AM
రిలేషన్ షిప్ లో కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. ప్రేమ జంట అయినా, భార్యాభర్తలైనా ప్రతి ఒక్కరూ తమ భాగస్వామితో సమయం గడపాలని, మాట్లాడాలని కోరుకుంటారు. అయితే ఒకరికొకరు దూరంగా అంటే వేర్వేరు ప్రదేశాలలో ఉన్న జంటలు ఒకరితో ఒకరు సమయం గడపడం కొంత కష్టమే. వారి మధ్య కమ్యూనికేషన్ మాత్రమే సంబంధాన్ని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. కమ్యూనికేట్ చేయడానికి భార్యాభర్తలు ఒకరికొకరు కాల్ చేసుకోవచ్చు, వీడియో కాల్‌లు చేయవచ్చు లేదా మెసేజ్ లు కూడా పంపవచ్చు.
బిజీ లేదా ఇతర కారణాల వల్ల భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఫోన్‌లో మాట్లాడుకోలేక పోయినట్లయితే, రోజంతా కొన్ని మెసేజ్‌ల ద్వారా భాగస్వామికి తాను దూరంగా లేడనే భావన కలిగించవచ్చు. అయితే, కొన్నిసార్లు ఈ మెసేజ్లు భార్యాభర్తల మధ్య వివాదాలకు కూడా కారణం అవుతాయి. భార్యాభర్తలు పొరపాటున కూడా కొన్ని మెసేజ్ లను తమ భాగస్వామికి పంపకూడదు. అవేంటంటే..
రెస్పాండ్ కావడం..
భార్యాభర్తలు దూరంగా ఉన్నప్పుడు వారి మధ్య మెసేజ్ లలో జరిగే కమ్యూనికేషన్ ఎంత సరదాగా ఉంటుందో.. ఏదైనా తేడా జరిగితే చాలా ప్రభావవంతంగా కూడా ఉంటుంది. ముఖ్యంగా భార్యలు ఏవైనా మెసేజ్ పెట్టినప్పుడు భర్తలు లేదా అబ్బాయిలు ఎక్కువగా రెస్పాండ్ కారు.కేవలం ఒక ముక్క లేదా ఒక మాటతో లేదా ఎమోజీలతో, స్చిక్కర్లతో రిప్లే ఇస్తుంటారు. ఇది కమ్యూనికేషన్ పట్ల అనాసక్తిని వ్యక్తం చేస్తుంది. అందుకే భార్యాభర్తలు ఒకరికొకరు మెసేజ్ చేసుకొనేటప్పుడు స్పష్టంగా ఉండాలి.
కోపం..
కోపం బంధాలను విచ్చిన్నం చేస్తుంది. భార్యాభర్తలు మెసేజ్ చేసుకొనేటప్పుడు కోపం ప్రదర్శించడం కాదు. భార్యలు ఎప్పుడూ భర్తల గురించే ఆలోచిస్తారు. భార్యలు మెసేజ్ చేసినప్పుడు వారికి ఇచ్చే రిప్లే కోపంతో కూడుకుని ఉండకూడదు. ఒకవేళ కోపంగా ఉన్నప్పుడు మెసేజ్ చేసినా, కాల్ చేసినా కొంచెం సేపటి తరువాత టచ్ లోకి వస్తాను అని చెప్పి కొద్దిసేపు మౌనంగా ఉండిపోవాలి. ఆ తరువాత సహజంగా మాట్లాడాలి.
పదే పదే..
భర్త లేదా భార్య ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. భార్య భర్తకు అయినా, భర్త భార్యకు అయినా పదే పదే నాన్ స్టాప్ గా మెసేజ్ లు చేయకూడదు. ఒకసారి మెసేజ్ చేశాక అవతలి నుండి రెస్పాన్స్ లేకపోతే ఏదైనా పనిలో ఉన్నారని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో కంగారు పడుతూ ఉంటారు. భర్త తొందరగా స్పందించకపోతే ఏం జరిగిందో అని గాబరా పడతారు. కానీ అవతల వారిని అర్థం చేసుకోవాలి. భర్తలు కూడా భార్య మెసేజ్ లు చూసిన తరువాత కాల్ చేసి మాట్లాడటం మంచిది.
గొడవలు వద్దు..
మెసేజ్ లో ఏ విషయాలు అయినా సాధారణ పలకరింపులు, బాగోగులు అడిగి తెలుసుకోవడం, ఏవైనా కబుర్లు చెప్పుకోవడం మంచిది. దేని గురించి అయినా ప్రశ్నించడం, సీరియస్ విషయాల గురించి అడగటం చేయకూడదు. ఇలాంటివన్నీ నేరుగా మాట్లాడుకోవడం మంచిది. లేకపోతే ఇద్దరి మధ్య గొడవలు, అపార్థాలు పెరుగుతాయి.
*రూపశ్రీ.