కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్.. 20 మంది మావోయిస్టులు హతం
posted on May 7, 2025 10:58AM

కర్రెగుట్టల్లో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. దేశంలో నక్సలిజం అణచివేతే లక్ష్యంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ లో భాగంగా గత కొన్ని రోజులుగా భద్రతా బలగాలు కర్రెగుట్టలను జల్లెడ పడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా బుధవారం (మే 7) ఉదయం కర్రెగుట్టలపై భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పరిధిలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో కనీసం 20 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది.
ఘటనా స్థలం నుంచి భద్రతా దళాలు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. కాగా ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. అలాగే మంగళవారం కూడా ఇదే కర్రెగుట్టలలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఓ మహిళా మావోయిస్టు హతమైంది. కర్రెగుట్టలలో గత కొంత కాలంగా జరుగుతున్న కూంబింగ్ లో భాగంగా జరిగిన ఎన్ కౌంటర్లలో ఇప్పటి వరకూ నలుగురు మహిళా మావోయిస్టులు మరణించారు.
భద్రతా బలగాలు వందల సంఖ్యలో మావోయిస్టుల స్థావరాలు, బంకర్లను ధ్వంసం చేశాయి. బీఎస్‌ఎఫ్, ఎస్‌టీఎఫ్, డీఆర్‌జీ బలగాలు సంయుక్తంగా ఈ గాలింపు చర్యలు చేపట్టారు. గత రెండు వారాలుగా కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు సాగుతున్నాయి.