80 మంది ఉగ్రవాదులు హతం.. ఆపరేషన్ సింధూర్ కు ప్రపంచ దేశాల మద్దతు!
posted on May 7, 2025 10:37AM

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా మంగళవారం (మే 6) అర్ధరాత్రి తరువాత భారత్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో 80 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా వర్గాల నుంచి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ ఆర్మీ మెరుపు దాడులతో విరుచుకుపడింది. ఈ మెరుపుదాడులకు ఆపరేషన్ సింధూర్ అని నామకరం చేసింది. కచ్చితమైన లక్ష్యాలపై అత్యంత ప్రణాళికాబద్ధంగా జరిగిన ఈ డాడుల్లో కనీసం 80 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
ఐక్యరాజ్యసమితి నిషేధించిన జైషే మహమ్మద్ (జేఈఎం), లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్ర సంస్థలకు చెందిన మొత్తం తొమ్మిది స్థావరాలు లక్ష్యంగా జరిగిన ఈ దాడులు విజయవంతమయ్యాయి.
అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు జైషే మహమ్మద్‌కు బలమైన పట్టున్న బహవల్పూర్, లష్కరే తోయిబా కీలక కేంద్రమైన మురిడ్కేలోని మసీద్ వా మర్కజ్ తైబాపై జరిగిన దాడుల్లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ రెండు ప్రాంతాల్లోనే సుమారు50 నుంచి 60 మంది ఉగ్రవాదులు హతమైనట్లు అంచనా. లక్షిత దాడులకు గురైన ప్రాంతాల్లో మృతుల సంఖ్యను నిఘా సంస్థలు ధృవీకరించాల్సి ఉంది.
అయితే పేరు చెప్పడానికి ఇష్టపడని ఉన్నత స్థాయి భద్రతా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఆపరేషన్ సింధూర్ లో 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడులను పాకిస్థాన్ ధృవీకరించడమే కాకుండా తీవ్రంగా ఖండించింది. దీనిని యుద్ధ చర్యగా అభివర్ణించింది. ఈ దాడుల్లో ఒక చిన్నారితో సహా ఎనిమిది మంది పౌరులు మరణించారని ఆరోపించింది. ఈ దాడుల అనంతరం, పాకిస్థాన్ దళాలు జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ), అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వెంబడి భారీగా కాల్పులకు, మోర్టార్ల దాడులకు తెగబడ్డాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు భారతీయ పౌరులు మరణించినట్లు అధికారులు తెలిపారు. భారత భద్రతా దళాలు కూడా దీటుగా స్పందించాయి. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.
కాగా భారత్ ఆపరేషన్ సింధూర్ ను అగ్రరాజ్యం అమెరికా సమర్ధించింది. ఉగ్రవాదంపై పోరులో పాకిస్థాన్ భారత్ కు మద్దతు ఇవ్వాలని సూచించింది. కాగా ఆపరేషన్ సింధూర్ పై భారత్ ప్రపంచ దేశాలకు వివరణ ఇచ్చింది. నిషేధిత ఉగ్ర శిబిరాలపై ఇండియన్ ఆర్మీ సక్సెస్ ఫుల్ గా దాడులు చేసినట్లు తెలిపింది.
భారత్ ఆపరేషన్ సింధూర్ ను ఇజ్రాయెల్ సమర్ధించింది. భారత్ ఆత్మరక్షణ కోసమే దాడి చేసిందని భారత్ లోని ఇజ్రాయెల్ రాయబారి పేర్కొన్నారు. అయామకులపై దాడులు చేసి తప్పించుకోవడం సాధ్యం కాదని ఉగ్రవాదులు గ్రహించాలని పేర్కొన్నారు.