స్వర్గానికి ద్వారాలు ఎక్కడ ఉన్నాయి?
posted on Jun 17, 2021 9:30AM
ఓ గురువుగారు సీతాపురం అనే పల్లెటూరి గుండా వెళ్తున్నారు. ఆ పల్లెటూరు అలాంటి ఇలాంటిది కాదు. అందులో అందరూ వీరులే! రాజుగారికి ఉన్న సైన్యంలో సగభాగం అక్కడి నుంచే వస్తుంటారు. సాక్షాత్తూ రాజుగారి సైన్యాధ్యక్షుడు కూడా అక్కడి వాడే. మల్లవిద్య, కర్రసాము, కత్తియుద్ధం… ఇలా ఎలాంటి యుద్ధవిద్యలో అయినా సరే, ఆ ఊరి జనానికి సాటి లేదు. అలాంటి సీతాపురం గుండా గురువుగారు వెళ్తున్నారు. అదే సమయంలో వారికి ఆ ఊరిలోనే విడిది చేసి ఉన్న సైన్యాధ్యక్షుడు ఎదురుపడ్డాడు.
గురువుగారిని చూసిన సైన్యాధ్యక్షుడు `గురువుగారూ మీ గురించి చాలా విన్నాను. ఇవాళ మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఎన్నాళ్ల నుంచో ఒక అనుమానం పీడిస్తోంది. దయచేసి నివృత్తి చేయండి` అని అడిగాడు.
`నాకు చేతనైతే తప్పక నివృత్తి చేస్తాను. ఏమిటా అనుమానం` అన్నారు గురువుగారు.
`మన పెద్దవాళ్లు ఎంతసేపూ స్వర్గం, నరకం అని ఊదరగొడుతుంటారు కదా! నిజంగా స్వర్గం, నరకం అనేవి ఉన్నాయంటారా? ఒకవేళ ఉంటే వాటికి ద్వారాలు ఎక్కడ ఉన్నాయి?` అని అడిగాడు.
`ఇంత మంచి ప్రశ్న అడిగావు. ఎవరు నువ్వు` అని అడిగారు గురువుగారు.
`నేను ఈ రాజ్యానికే సైన్యాధ్యక్షుడిని. రాజుగారి విజయాలన్నింటికీ కారణం నేనే!` అని గర్వంగా బదులిచ్చాడు సైన్యాధ్యక్షుడు.
`అబ్బే నిన్ను చూస్తే సైన్యాధ్యక్షునిలా లేవే. ఎవరో పగటివేషగాడిలా ఉన్నావు. నిన్ను చూస్తే నవ్వు వస్తోంది కానీ భయం వేయడం లేదు` అని ఎగతాళిగా అన్నారు గురువుగారు.
`ఎంతమాట! నేను పగటివేషగాడిలా ఉన్నానా! నన్ను చూస్తుంటే నవ్వులాటగా ఉందా! నీ నవ్వుని గొంతులోనే ఆగిపోయేలా చేస్తాను. ఉండు!`అంటూ తన కత్తిని దూసి గురువుగారి కంఠానికి గురిపెట్టాడు సైన్యాధ్యక్షుడు.
`ఇదే నాయనా నువ్వు చూడాలనుకున్న నరక ద్వారం. నీ కోపంతోనూ, ఉద్వేగంతోనూ, అహంకారంతోనూ… దాన్ని ఇప్పుడే నువ్వు తెరిచావు` అన్నారు గురువుగారు.
గురువుగారి మాటలకు సిగ్గుపడి సైన్యాధ్యక్షుడు తన కత్తిన తీసి ఒరలో ఉంచుకుని బాధగా నిలబడ్డాడు.
`ఇప్పుడు నువ్వు స్వర్గంలోకి అడుగుపెట్టావు. నీ ఆలోచనతోనూ, ప్రశాంతతతోనూ, పశ్చాత్తాపంతోనూ స్వర్గపు ద్వారాలను తెరిచావు` అన్నారు గురువుగారు చిరునవ్వుతో!
అపై సైన్యాధ్యక్షుడిని చూస్తూ ఇలా అన్నారు `చూశావా! స్వర్గం, నరకం రెండూ నీలోనే ఉన్నాయి. నువ్వు అనాలోచితంగా ప్రవర్తించిన రోజు నరకానికి దారిని తెరుస్తావు. జాగ్రత్తగా, ఖచ్చితంగా ఆలోచించగలిగిన రోజు స్వర్గానికి తలుపులు తీస్తావు. స్వర్గనరకాలు ఎక్కడో కాదు, నీ మనసులోనే ఉన్నాయి.` అంటూ సాగిపోయారు గురువుగారు.