సవాళ్లను ఎదుర్కోవడం ఎలా?

జంతువులకి ఆకలి, ఆరోగ్యంలాంటి భౌతికమైన సమస్యలే ఉంటాయి. వాటి సమస్యలన్నీ ఉనికి చుట్టూనే తిరుగుతాయి. కానీ మనిషి అలా కాదయ్యే! అతను ఏర్పరుచుకున్న క్లిష్టమైన సమాజజీవితంలో ప్రతిదీ ఒక సమస్యే! ఉద్యోగంలో ప్రమోషన్‌ దగ్గర్నుంచీ, పిల్లల చదువుల దాకా... ఆర్థిక సమస్యల దగ్గర్నుంచీ అత్తగారి పోరుదాకా అన్నీ సవాళ్లే. ఈ సవాళ్లను కనుక ఎదుర్కోలేకపోతే, ఎదుర్కొని ఛేదించకపోతే జీవితం దుర్భరంగా మారిపోతుంది. అందుకే సవాళ్ల గురించి నిపుణులు ఇస్తున్న సూచనలు కొన్ని ఇవిగో...

 

సమస్యని అంగీకరించండి

చాలామంది సమస్య ఎదురుపడగానే దాని నుంచి ఎలాగొలా తప్పుకొనేందుకు ప్రయత్నిస్తారు. తాము కాసేపు కళ్లు మూసుకుని ఉంటే ఏదో ఒక అద్భుతం జరిగి సమస్య మాయమైపోతుందన్న భ్రమలో ఉంటారు. కాలం కొన్ని సమస్యలని తీర్చగల మాట నిజమే అయినా చాలా సమస్యలకి మన చేతలే అవసరం అవుతాయి. ఆ చేతలే లేకపోతే చిన్నపాటి సవాళ్లు కాస్తా జీవన్మరణ సమస్యలుగా మారిపోతాయి. అందుకనే ముందు మన ముందు ఒక సమస్య ఉన్నదనీ... దానిని అభివృద్ధీ, వినాశనం మన చేతుల్లోనే గుర్తించడం తొలి మెట్టు.

 

విశ్లేషణ

సమస్య పట్ల భయంతో చాలామంది దాన్ని పైపైనే తడిమేందుకు ప్రయత్నిస్తారు. మరికొందరేమో సమస్యని కేవలం తమ దృష్టికోణం నుంచే చూస్తారు. అలా కాకుండా సమస్యని లోతుగా, అన్నివైపులా విశ్లేషించిన రోజున దాని మూలాలు తెలుస్తాయి. అసలు సమస్య ఎక్కడ ఉంది? దానిని ఎటునుంచి పరిష్కరించాలన్న అవగాహన ఏర్పడుతుంది.

 

సలహా- సంభాషణ

సమస్య గురించి మన లోలోనే కుమిలిపోయి ఉపయోగం లేదు. దానిని అనుభవజ్ఞులతోనో, పెద్దవారితోనో, ఆత్మీయులతోనో పంచుకోవడం వల్ల వారి దృష్టికోణం నుంచి కూడా సమస్యని అవగాహన చేసుకోవచ్చు. ఒక సమస్యకు అతీతంగా ఉన్న వ్యక్తి దానిని గమనించే తీరు ఎప్పుడూ వేరుగానే ఉంటుంది. పైగా అలాంటి కష్టకాలంలో వారు అందించే నైతిక స్థైర్యం మనం ఆత్మన్యూనతకీ, క్రుంగుబాటుకీ లోను కాకుండా కాపాడుతుంది.

 

భేషజాలను వదులుకోవాలి

చాలా సమస్యలు మన అహంకారం వల్లే ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా బంధాలకి సంబంధించిన సమస్యలెన్నో పంతాలు, పట్టింపుల వల్లే వస్తుంటాయి. మన తప్పు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు కూడా... నేను ఎక్కడా తగ్గాల్సిన పని లేదు, ఎవరికీ తలవంచాల్సిన పరిస్థితి రాదు అనుకుంటూ భేషజాలకి పోతే అంతిమంగా నష్టపోయేది మనమే! ఇతరులను క్షమాపణ కోరడమో, ఇతరుల సలహాను పాటించడమో, ఎదుటివారి సాయం తీసుకోవడమో చేయడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే తప్పకుండా భేషజాలను వదులుకోవాల్సి ఉంటుంది.

 

అంగీకారం

కట్టుదిట్టమైన ఇనుపగోడల మధ్య ఉన్నా ఏదో ఒక సమస్య రాక మానదు. సమస్యలనేవి జీవితంలో భాగమే అని అంగీకరించినప్పుడు, వాటిని ఎదుర్కొనే ధైర్యం కూడా వస్తుంది. సవాళ్లు లేకపోతే ఎదుగుదల అసాధ్యమని గ్రహించినప్పుడు ఎక్కడలేని తెగువా ఏర్పడుతుంది. ఏ సమస్యా లేనప్పుడు మనిషి సంతోషంగానే ఉంటాడు. కానీ సమస్య ఉన్నప్పుడు కూడా స్థిరిచిత్తంగా, ప్రశాంతంగా దానిని ఎదుర్కోగలిగే వారు విజయం సాధించగలుగుతారు.

 

సిద్ధంగా ఉండాల్సిందే!

సమస్య తరువాత జీవితం ఎప్పటిలాగే ఉండకపోవచ్చు. చాలా సందర్భాలలో జీవితంలో అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి. మన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూనే, సమస్యని పరిష్కరించుకునే క్రమంలో కొన్ని బంధాలు చేజారిపోవచ్చు, కొన్ని సౌకర్యాలు దూరం కావచ్చు. వీటన్నింటికీ సిద్ధంగా ఉండి, జీవితాన్ని మళ్లీ ఎప్పటిలా గడిపేందుకు సిద్ధంగా ఉండాలి.

 

- నిర్జర.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News