ఏ బహుమతి ఇవ్వాలి?
posted on Sep 23, 2016 12:00PM
తమ ఆప్యాయతనీ, అభినందలనీ తెలియచేసేందుకు చాలామంది బహుమతులనే మార్గంగా ఎంచుకొంటారు. కానీ ఎలాంటి బహుమతిని అందచేయాలన్నది ఎప్పుడూ ఒక సమస్యగానే తోస్తుంటుంది. ఫలితం! డబ్బులు ఖర్చుపెట్టి, సమయాన్ని వెచ్చింది ఏదో ఒక బహుమతిని కొనేస్తుంటారు. దాంతో ఇటు బహుమతిని ఇచ్చేవారికీ, పుచ్చుకునేవారికీ కూడా అసంతృప్తే మిగులుతుంది. అందుకే పెద్దలు చెప్పే కొన్ని సూత్రాలను పాటిస్తే బహుమతి ఇవ్వడం కూడా మంచి అనుభవంగా మిగిలిపోతుంది...
అభిరుచిని అనుసరించి
కొందరికి పుస్తకాలంటే ఇష్టం, కొందరికి పెర్‌ఫ్యూమ్ బాటిల్స్ అంటే ప్రాణం. బొమ్మలను సేకరించేవారు కొందరైతే పాటలంటే చెవి కోసుకునేవారు మరికొందరు. ఇలాంటివారికి వారి అభిరుచిని తగిన బహుమతిని ఇస్తే చాలా సంతోషిస్తారు. ఒకవేళ అలా కుదరకపోయినా, అభిరుచికి పూర్తి విరుద్ధమైన బహుమతులను ఇవ్వడం కంటే ఒక గులాబీ పువ్వుని చేతిలో పెట్టడం మేలు.
సందర్భాన్ని బట్టి
మనం ఏ సందర్భానికి బహుమతిని అందించాలనుకుంటున్నాం అనేది మన నిర్ణయాన్ని ప్రభావితం చేయవలసిన అంశం. కొత్త సంవత్సరం వేడుకల దగ్గర్నుంచీ పెళ్లిరోజుల వరకూ సందర్భాన్ని బట్టి బహుమతిని ఇస్తే బాగుంటుంది. అలా కాకుండా న్యూ ఇయర్ రోజున పాల పీకనీ, పెళ్లిరోజున యాపిల్ పళ్లనీ ఇస్తే అవతలివారిని వేళాకోళం చేసినట్లే అవుతుంది. ఒకోసారి పుష్టగుచ్ఛం ఇస్తే సరిపోవచ్చు, ఒకోసారి బంగారు గొలుసు ఇస్తే బాగుండు అనిపించవచ్చు. ఎప్పుడు ఎలాంటి బహుమతి ఇవ్వాలి అన్నది ఆయా సందర్భాల మీద ఆధారపడి ఉంటుంది.
బడ్జట్‌ని దృష్టిలో ఉంచుకొని
అవతలివారి దగ్గర ప్రశంసలు పొందడం కోసం భారీబడ్జట్ బహుమతులు అందించి చాలామంది చేతులు కాల్చుకుంటూ ఉంటారు. ఖరీదైన బహుమతికంటే మంచి బహుమతి ఇవ్వడం మేలన్న విషయం వారికి బోధపడదు. పైగా ఉన్నతాధికారులు, ధనవంతుల మెప్పు కోసం ఇచ్చే భారీబహుమతులు వారి కంటికి ఎలాగూ ఆనవు. కాబట్టి బహుమతిని కొనేటప్పుడు మన స్తోమతను దృష్టిలో ఉంచుకోవాలి. అది మన సృజనను ప్రతిబించేలా, అవతలి వారికి ఉపయోగపడేలా ఉండాలి. అంతేకానీ ఆర్భాటానికి చిహ్నంగా మిగిలిపోకూడదు.
మొక్కుబడులు వద్దు
ఏదో ఒక బహుమతి ఇవ్వాలి కదా అని చాలామంది ఇంట్లో చేతికందిన వస్తువుని చుట్టచుట్టి ఇచ్చేస్తూ ఉంటారు. మరికొందరు తమ దగ్గర పోగైన బహుమతులనే చేతులు మారుస్తూ ఉంటారు. బహుమతి అనేది తప్పనిసరి తతంగంగానో, వస్తువులను వదిలించుకునే తంతుగానో సాగితే ఎవరికీ ఉపయోగం ఉండదు. దానివల్ల అవతలివారి మనసులో మన పట్ల వ్యతిరేక అభిప్రాయం ఏర్పడే ప్రమాదమూ లేకపోదు.
ఏదీ తోచకపోతే!
కొన్ని సందర్భాలలో ఏ బహుమతి తీసుకోవాలో ఎంతకీ స్ఫురించకపోవచ్చు. అవతలివారితో అంతగా పరిచయం లేకపోవడమో, వారి అభిరుచులు తెలియకపోవడమో దీనికి కారణం కావచ్చు. అలాంటప్పుడు వారి వయసుకి తగిన వస్తువుని బహుకరించేయవచ్చు. అదీ కాదంటే అందరికీ ఉపయోగపడేలాంటి వస్తువునీ కొనిపెట్టవచ్చు. ఇక ఏదీ తోచని పక్షంలో మన బడ్జెట్‌కు తగిన డబ్బుని ఓ కవర్లో పెట్టి ఇవ్వడమే ఉత్తమమైన మార్గంగా మిగిలిపోతుంది.
- నిర్జర.