బలమా! బలహీనతా!
posted on Apr 17, 2021 9:30AM
ఒక పన్నెండేళ్ల పిల్లవాడు ఏదో ఘోరమైన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతని కుడి చేయి ఎందుకూ పనికిరాకుండా పోయింది. కానీ ఆ పిల్లవాడికి చిన్నప్పటి నుంచీ ఓ కోరిక ఉండేది. ఎలాగైనా తను కరాటేలో గొప్ప ప్రతిభావంతుడిని కావాలన్నదే ఆ కోరిక! కానీ ఇప్పుడేం చేసేది? తన కుడి చేయి ఇక కరాటేకి సహకరించదు కదా! అయినా ఆశ చావక తన బడిలో ఉంటున్న కరాటే మాస్టరు దగ్గరకు వెళ్లాడు.
`నేను ఇంక జీవితంలో కరాటేని నేర్చుకోలేమోనని అనిపిస్తోందండీ` అన్నాడు బాధగా. ఆ మాస్టరుగారు ఒక్కనిమిషం ఆలోచించి `నీలో కనుక నిజంగా పట్టుదల ఉంటే తప్పకుండా కరాటేలో గొప్ప నేర్పును సాధిస్తావు. కానీ నేనేం చెబితే నువ్వు అలాగే చేయవలసి ఉంటుంది. సరేనా!` అని అన్నాడు. `నా చిన్నప్పటి కోరికను నెరవేర్చుకునేందుకు నేను ఎలాంటి కష్టాన్నైనా భరించడానికి సిద్ధంగా ఉన్నాను.' అంటూ సంతోషంగా ఒప్పుకున్నాడు పిల్లవాడు.
మరుసటి రోజు నుంచి పిల్లవాడు రోజూ కరాటే మాస్టరుగారి దగ్గరకు వెళ్లసాగాడు. కానీ విచిత్రంగా ఆ కరాటే మాస్టరు రోజూ పిల్లవాడికి ఒకటే కదలికని నేర్పేవాడు. ఎన్నిరోజులు చేసినా అదే పని. అదే కదలికని అభ్యాసం చేసీ చేసీ పిల్లవాడు అలసిపోయేవాడు. ఎప్పుడూ ఒకటే రకం భంగిమతో అతనికి చిరాకు వేసేది. కానీ ఏం చెప్పినా చేయాల్సిందే అన్న గురువుగారి మాటకి కట్టుబడి ఊరకుండిపోయేవాడు.
కొన్నాళ్లకు ఇంక ఉండబట్టలేక `కరాటే అంటే ఇంతే కాదు కదా! ఇంకా వేరే ఏమైనా నేర్పుతారా?` అని అడిగాడు. `నువ్వు ఈ ఒక్క కదలికనే సాధన చేస్తూ ఉండు. చాలు!` అంటూ కస్సుమన్నారు గురువుగారు. ఇంక మారుమాట్లాడకుండా అదే భంగిమను సాధన చేస్తూ ఉండిపోయాడు పిల్లవాడు. ఇలా ఉండగా కొన్నాళ్లకి ఆ బడిలో కరాటే పోటీలు మొదలుపెట్టారు. `నువ్వు కూడా ఈ పోటీలలో పాల్గోవాలి!` అన్నారు గురువుగారు. `ఏదీ ఈ ఒక్క భంగిమనతోనా!` అంటూ ఉక్రోషంగా బదులిచ్చాడు పిల్లవాడు.
గురువుగారు ఓ చిరునవ్వు నవ్వి ఊరుకుండిపోయారు. ఆశ్చర్యంగా పిల్లవాడు తనకి పోటీలో ఎదుటపడిన ఇద్దరు ప్రత్యర్థులనీ చాలా తేలికగా మట్టి కరిపించేశాడు. పోటీలో ముందుకు వెళ్తున్న కొద్దీ మరింత బలమైన ప్రత్యర్థులు ఎదురుపడసాగారు. కానీ ఎలాగొలా చివరిక్షణంలో అయినా వాళ్లని ఓడించగలిగాడు. పోటీలో ఒకో అంచె ముందుకు వెళ్తున్న కొద్దీ అతనిలో విశ్వాసం పెరిగిపోసాగింది. చివరికి ఎలాగైతేనేం... ఆ పోటీలో అతనే విజేతగా నెగ్గాడు. `గురువుగారూ! జరిగింది నమ్మలేకపోతన్నాను. నేనీ ఒక్క కదలికతోనే విజయాన్ని సాధిస్తానని మీరు ఎలా అనుకున్నారు?` అని అడిగాడు ఆశ్చర్యంగా.
`మరేం లేదు! నీకు నేర్పిన ఈ కదలిక కరాటేలోనే చాలా కష్టమైనది. అందుకని చాలామంది దాన్ని నేర్చుకోవడానికి వెనుకాడతారు. ఇకపోతే చాలామంది కుడిచేత్తో పోరాడినంత బలంగా ఎడమచేత్తో పోరాడలేరు. అందుకనే ఆ ఒక్క పట్టుతోనే నువ్వు విజయాలను సాధించగలిగావు` అన్నారు గురువుగారు.
ఎంతసేపూ తన బలహీనత గురించి ఆలోచించే ఆ పిల్లవాడు, ఆ బలహీనతని సైతం బలంగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు నేర్చుకున్నాడు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక బలహీనత ఉంటుంది. కానీ ఒకోసారి దాన్నే తన బలంగా మార్చుకోవడమో లేక ఇతర మార్గాలను అన్వేషంచడమో చేస్తే విజయం తప్పక దక్కుతుంది.