కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది సజీవదహనం
posted on Dec 25, 2025 8:12AM
.webp)
కర్నాటక రాష్ట్రంలో గురువారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది సజీవదహనమయ్యారు. మరో 12 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరు నుంచి గోకర్ణకు వెడుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి కంటైనర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. బుధవారం బెంగళూరులోని గాంధీనగర్ నుంచి 30 మంది ప్రయాణీకులతో గోకర్ణకు బయలు దేరిన ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు గురువారం తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో 48వ నంబర్ జాతీయ రహదారిపై హిరియూర్ సమీపంలో అదుపుతప్పి కంటైనర్ ను ఢీ కొంది.
వెంటనే బస్సులో మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. ఈ ఘటనలో 18 మంది సజీవదహనం అయ్యారు. మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో అందరూ గాఢ నిద్రలో ఉండటంతో తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఓ 12 మంది మాత్రం కిటీకీ అద్దాలు పగుల గొట్టుకుని బయటపడగలిగారు.
అయితే వారికి సైతం తీవ్రమైన కాలిన గాయాలయ్యాయని చెబుతున్నారు. బయటపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళణ వ్యక్తం అవుతున్నది. ప్రమాద సమాచారం అందిన వెంటనే చిత్రదుర్గ జిల్లా పోలీసులు, అగ్నిమాపక దళం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చిత్రదుర్గ జిల్లా ఆసుపత్రికి తరలించారు.