కరోనాతో జంటలలో పునరుత్పత్తి ఆగిపోతోందా?

లాక్డౌన్ సమయంలో కొత్త దంపతులు, ఇంటి పట్టున ఉంటున్న భార్యభర్తలు అనేక మంది సమయం దొరకడంతో దాంపత్య జీవితం మీదనే పూర్తి ఫోకస్ పెట్టి ఎంజాయ్ చేశారనే వార్తలు చూశాం కానీ అదే జంటలు పునరుత్పత్తి అంటే మాత్రం తెగ భయపడిపోతున్నాయట. ప్రఖ్యాతి గాంచిన జర్నల్ ఆఫ్ సైకో సొమాటిక్ రీసెర్చ్ గైనకాలజీ ఇటీవల ఇదే విషయం మీద ఒక స్టడీ నిర్వహించింది. మన దేశంతో సహా అనేక దేశాలలో జంటలు కరోనా సమయంలో తల్లిదండ్రులు కాకూడదు అనుకుంటున్నారు. గర్భం దాల్చినపుడు కరోనా సోకితే కష్టమనే భయం ఇందుకు ప్రధాన కారణం. సర్వే లో పాల్గొన్న 73 శాతం మంది ఇదే రకం అభిప్రాయం వెలిబుచ్చారట. ఇందుకు మనదేశంలోని నగరాలు కూడా మినహాయింపు కాదట. గర్భం వస్తే ప్రతి నెల చెకప్కు ఆసుప్రతికి వెళ్ళవలసి రావడం , డాక్టర్లు ఆసుపత్రులు అందుబాటులో లేకపోవడం, డాక్టర్లు కూడా ఎక్కువ మంది పేషెంట్లను డైరెక్టుగా చూడకుండా ఆన్ లైన్ లో కౌన్సలింగ్ చేస్తామనడం ఇందుకు కారణం. చాలా మంది జంటల్లో ఇంకో భయం కూడా ఉంది, కరోనా కాలంలో ఆర్థిక వ్యవస్థలు కుదేలు కావడం, ఉద్యోగాలకు గ్యారంటీ లేకపోవడం కూడా కారణమట. సర్వేలో పాల్గొన్న గైనకాలజిస్టులు కూడా తాము దంపతులకు ప్రస్తుతానికి ప్రెగెన్సీని పోస్ట్ పోన్ చేసుకోమని చెబుతున్నానమని, చాలా మంది అందుకు ఒప్పుకుంటున్నారని అంటున్నారట. 

 

ఇదంతా ఉద్యోగాల మీద ఆధారపడ్డ జంటల సంగతి అయితే మన హైదరాబాద్, విజయవాడ లాంటి నగరాల్లో ఇంకో నయా ట్రెండ్ నడుస్తోంది. డబ్బుల కోసం అవసరం ఉన్నా లేకపోయినా సిజేరియన్లు చేసే ఆసుపత్రులు, డాక్టర్లు మాత్రం సిజేరియన్లు చేయం అని చెప్పేస్తున్నారట. ఇందుకు డాక్టర్లలో కరోనా భయమే కారణం. సిటీలో ఒక ప్రముఖ గైనకాలజిస్టు ఏం చెప్పారంటే ఇపుడు తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఎవరికైనా ఏ సర్జరీ కానీ, ఏ మెడికల్ ప్రొసీజర్ చేసే ముందు కానీ కరోనా టెస్ట్ చేయాలన్న రూల్ పెట్టలేదు. 

 

మామూలుగా కరోనా పేషెంట్ తుమ్మినపుడో, దగ్గినపుడో కన్నా వారికి ఏదైనా సర్జరీ జరిగి శరీరాయవాలను ఓపెన్ చేసినపుడు రోగి లోపలున్న వైరల్ లోడ్ చాలా డైరెక్టుగా బయటకు ఎక్స్ పోజ్ అవుతుందట. దాంతో డాక్టర్లు, నర్సులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ అంటుకోవచ్చన్న భయం ఉందట. ఆ మధ్య కాలంలో నిమ్స్ లో డాకర్లు అనేక మంది ఒక్కసారిగా కరోనా పాజిటివ్ అయ్యారు. దానికి కారణం అక్కడ ఒకరిద్దరు పేషెంట్లకు సర్జరీ జరిగినపుడు వారికి ఆల్ రెడీ కరోనా సోకి ఉండటం, సర్జరీ అపుడు వైరల్ లోడ్ అందరికీ ఎక్స్ పోజయి కొందరు డాక్టర్లు వైరస్ బారిన పడటం జరిగింది. ఇంత భయాలున్న చోట అటు డాక్టర్లు, ఇటు జంటలు ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించకపోవడం విచిత్రం ఏమీ కాదు. ఇక నలభై యేళ్ళ లేటు వయసులో కరీనా, అంతకన్నా మరీ లేటు వయసులో సైఫ్ అలీ ఖాన్ తల్లితండ్రులం కాబోతున్నామని ప్రకటన చేశారు. వారు సెలబ్రిటీలు కాబట్టి వారికి ఏం చేసినా  నడుస్తోంది కానీ మామూలు జంటలు మాత్రం ఇపుడు ప్రెగ్నెన్సీ అంటే సుముఖంగా లేరని తెలుస్తోంది. సిటీలో ఇపుడు వెలవెలబోతున్న ఫర్టిలిటీ సెంటర్లే ఇందుకు ఉదాహరణ. 

Related Segment News