జీతం కోటిన్నర.. ఓరి దేవుడో...
posted on Dec 2, 2014 4:36PM
ఏడాదికి జీతం జస్ట్ కోటిన్నర. అది కూడా బోలెడంత సీనియారిటీ ఉన్న ఉద్యోగికి ఇచ్చే జీతం కాదు.. ఉద్యోగంలో చేరిన మొదటి సంవత్సరంలోనే నూనూగు మీసాల యువకుడు సంపాదించే ఏడాది జీతం. అవును ఖరగ్‌పూర్ ఐఐటీలో చదువుతున్న ఒక విద్యార్థికి క్యాంపస్ సెలక్షన్ల సందర్భంగా ఒక అమెరికన్ సంస్థ ఈ జీతాన్ని ఆఫర్ చేసింది. దానికి ఆ విద్యార్థి ఓకే కూడా చెప్పేశాడు. ఐఐటీలో చదువు పూర్తి చేసుకున్న వెంటనే ఎంచక్కా విమానంలో అమెరికాకి వెళ్ళిపోయి ఉద్యోగంలో చేరిపోవడమే అతని పని. తాజాగా ఖరగ్‌పూర్ ఐఐటీలో క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిగాయి. పలు స్వదేశీ, విదేశీ సంస్థలు ఈ ఇంటర్వ్యూలలో పాల్గొన్నాయి. ఈ సంస్థలు మొత్తం 163 మంది విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చేశాయి. స్వదేశీ కంపెనీలు సంవత్సరానికి 43 లక్షల రూపాయల వరకు జీతాన్ని ఆఫర్ చేస్తే, విదేశాలకు చెందిన సంస్థలు కోటి రూపాయలకు పైగానే జీతాలను ఆఫర్ చేశాయి. అమెరికాకి చెందిన ఒక కంపెనీ ఓ విద్యార్థికి కోటిన్నర జీతం ఆఫర్ ఇచ్చి అపాయింట్ చేసుకుంది. ఆ గోల్డెన్ ఛాన్స్ కొట్టిన విద్యార్థి పేరు, ఈ బంపర్ ఆఫర్ ఇచ్చిన అమెరికా కంపెనీ పేరు మాత్రం ఖరగ్‌పూర్ ఐఐటీ అధికారులు వెల్లడించడం లేదు. ఒక ఏడాదికి కోటిన్నర.. ఒక భారతీయ విద్యార్థికి క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా మొదటి సంవత్సరంలోనే ఈ స్థాయి జీతం లభించడం ఇదే ప్రథమం.