మీ వంటింట్లో హార్ట్ స్పెషలిస్టులు...
posted on Feb 27, 2015 3:14PM
గుండెని ఆరోగ్యంగా ఉంచే ఓ నాలుగు సూపర్ ఫుడ్స్ గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఆరోగ్యానికి మంచివని తెలిసినా మనం తేలిగ్గా తీసుకునే ఆ ఆహార పదార్థాల గురించి ఈమధ్య ఓ అధ్యయనంలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి.... అవేంటంటే....
మన రక్తంలోని ఎర్రరక్త కణాలు ఎలా వుంటాయి? ఒకదానితో ఒకటి పేర్చినట్లు వుంటాయి. కొన్ని అతుక్కోకుండా జారిపోతుంటాయి. అలా ఉంటేనే ధమనులు చక్కగా పని చేస్తాయి. గుండె వ్యాధులు రాకుండా వుంటాయి. అయితే డయాబెటిస్‌తో బాధపడేవాళ్ళలో ఇవి ఒకదానితో ఒకటి అతుక్కునే ప్రమాదం ఎక్కువ. అందుకే వారికి గుండెజబ్బులు వచ్చే అవకాశం కూడా ఎక్కువ . అయితే ఈ సమస్యని నివారించటంలో టమాటో సహాయపడగలదు అంటున్నారు ఆస్ట్రేలియన్ నిపుణులు. వీరు కొంతమందికి రోజూ ఓ కప్పు టమాటో రసం మూడు వారాలపాటు ఇచ్చారుట. వాళ్ళలో రక్తం పలుచబడటం గమనించారు. అంటే కణాలు ఒకదానితో ఒకటి అతుక్కునే గుణం తగ్గింది అన్నమాట. కాబట్టి టమాటోలు మంచి ఆహరంగానే కాకుండా ఔ షధంలా కూడా పని చేస్తాయి అంటున్నారు వీరు. సో ఇది టమాటోలు దొరికే సీజనే కాబట్టి రోజూ ఓ కప్పు టమాలో రసం తాగండి... గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
ఇక రోజుకి ఓ మూడు, నాలుగు వెల్లుల్లి రెబ్బలని అలా నోట్లో వేసుకునే అలవాటు చేసుకోండి చాలు. అవి మీ గుండెలోని కొవ్వు పని పట్టే పని చూసుకుంటాయి అంటున్నారు ఆహార నిపుణులు.
గుప్పెడు శనగలు మీ గుప్పెడు గుండెని జాగ్రత్తగా కాపాడతాయంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. రోజూ ఒక 50 గ్రాముల శనగలు తింటే చాలు... అవి చెడ్డ కొలెస్ట్రాల్‌ని, ట్రైగ్జిజరైడ్లని తగ్గిస్తాయి. దాంతో గుండెపోటు వచ్చే ముప్పు 24 శాతం తగ్గినట్టే. సోయా కూడా చెడ్డ కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. కాబట్టి రోజూ సోయాని ఏదో ఒక రూపంలో తీసుకోవటానికి ప్రయత్నించండి అంటున్నారు ఆహార నిపుణులు.
-రమ