జుట్టు ఎందుకు తెల్లబడుతుంది... దీన్ని నివారించడానికి ఏమి చేయాలంటే..

దాదాపు అన్ని వయసుల వారిలోనూ జుట్టు సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. జుట్టు రాలడం నుండి జుట్టు బూడిద రంగులోకి మారడం వరకు, సమస్యలు చాలా సాధారణంగా కనిపిస్తుంటాయి.  అయితే దాని వెనుక కారణం మీకు తెలుసా? కాలుష్యం, ఆహార అలవాట్లు, ఒత్తిడి వంటి పరిస్థితులు జుట్టుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సాధారణంగా 50 ఏళ్ల తర్వాత జుట్టు తెల్లబడటం ప్రారంభిస్తుంది, కానీ కొందరిలో ఈ సమస్య 20-30 ఏళ్ల వయస్సులో లేదా అంతకంటే ముందే కూడా రావచ్చు. జుట్టు తెల్లబడటానికి గల  కారణాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

వృద్ధాప్యంలో సాధారణంగా వెంట్రుకల కుదుళ్లలో రంగు ఉత్పత్తి తగ్గడం ప్రారంభమవుతుంది.  ఈ కారణంగానే జుట్టు రంగు మారడమనే సమస్య ఏర్పడుతుందని వైద్యులు అంటున్నారు. కానీ ఇది ఎందుకు జరుగుతుంది?? దానిని ఎలా నిరోధించవచ్చు?? పూర్తిగా తెలుసుకుంటే..


జుట్టు కుదుళ్లలో వర్ణద్రవ్యం ఉత్పత్తి చేసే కణాలు ఉంటాయి, ఇవి జుట్టుకు నలుపు రంగును ఇచ్చే మెలనిన్ అనే రసాయనాన్ని తయారు చేస్తాయి. ఈ కణాలు చనిపోవడం వల్ల మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీని కారణంగా జుట్టు సమస్యలు మొదలవుతాయి, ముఖ్యంగా జుట్టు బూడిదరంగు లేదా తెల్లగా మారుతుంది.  ఒకసారి ఒక ఫోలికల్ మెలనిన్ ఉత్పత్తిని ఆపివేస్తే, అది మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం లేదు.

చిన్న వయసులో వచ్చే సమస్యలు..

వయసు పెరిగే కొద్దీ జుట్టు తెల్లబడటం సహజమే, అయితే ఈ సమస్య చిన్న వయసులోనే ఎందుకు మొదలవుతుంది? అనే విషయాలు పరిశీలిస్తే.. అధిక ఒత్తిడిని తీసుకోవడం లేదా ఏదైనా అంతర్లీన ఆరోగ్య సమస్య వంటివి జుట్టు సమస్యలకు కారణమవుతాయి. 

జుట్టు సమస్యలు ఎక్కువగా జన్యువులపై ఆధారపడి ఉంటాయని  నిపుణులు చెబుతున్నారు.  ఇది జుట్టు ఎప్పుడు నెరిసిపోతుందో నిర్ణయిస్తుంది. తల్లిదండ్రులలో ఎవరికైనా 30 సంవత్సరాల వయస్సులో జుట్టు నెరిసి ఉంటే, పిల్లలకు కూడా ముందుగా నెరిసిపోయే అవకాశం ఉంది.

 తప్పక  తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు..

విటమిన్ B12 లోపం.

న్యూరోఫైబ్రోమాటోసిస్ - నరాలు, ఎముకలు, చర్మాన్ని ప్రభావితం చేసే ఒక వారసత్వ వ్యాధి.


బొల్లి సమస్య - ఈ పరిస్థితి మెలనోసైట్లు (వెంట్రుకల కుదుళ్ల బేస్ వద్ద వర్ణద్రవ్యం ఉత్పత్తి చేసే కణాలు) వాటి వర్ణద్రవ్యాన్ని కోల్పోతాయి.


అలోపేసియా అరేటా సమస్య జుట్టు రాలడానికి సంబంధించినది, అయితే దీనివల్ల జుట్టు బూడిద రంగులోకి మారుతుంది.


జుట్టు తెల్లబడకుండా ఆపడం ఎలా?

వంశపారంపర్య ప్రమాదాన్ని తగ్గించలేనప్పటికీ, జుట్టు రంగు మారడాన్ని నివారించడానికి కొన్ని ప్రయత్నాలు చేయవచ్చు. యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ ఎక్కువగా తినాలి. కూరగాయలు పండ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి జుట్టు నెరసిపోకుండా నిరోధించడంలో సహాయపడతాయి.

ధూమపానం అలవాటుంటే మానేయాలి...

ఆహారం నుండి తగినంత విటమిన్లు పొందాలి. మీ జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్ B-12 అవసరం.

తగినంత ఖనిజాలను పొందాలి.  జుట్టు పెరుగుదలలో ,  కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో ఖనిజాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.


                                   ◆నిశ్శబ్ద.