కేంద్ర బడ్జెట్ లో మరోసారి కేసీఆర్ స్కీం!
posted on Jul 5, 2019 4:26PM

తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన ‘రైతుబంధు’ గ్రాండ్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ను రెండోసారి అధికారంలోకి తీసుకురావడంలో ఈ పథకం కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. ఇక రైతుబంధును ఎన్నికలకు వెళ్లే ముందు కేంద్రంలో మోడీ సర్కార్ కూడా ‘పీఎం కిసాన్’ పేరుతో అమలు చేసింది. దీంతో కేసీఆర్ పథకాన్ని కేంద్రం కాపీ కొట్టిందని టీఆర్ఎస్ శ్రేణులు అన్నాయి. అయితే ఇప్పుడు మరోసారి అలాంటి కాపీ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకాన్ని పోలిన పథకాన్ని కేంద్రం ప్రకటించింది. 'హర్ ఘర్ జల్' పేరుతో కేంద్రం ప్రకటించిన ఈ పథకంలో దేశంలోని ప్రతీ ఇంటికి 2024 లోపు మంచినీళ్లు అందించేందుకు కేంద్రం ప్లాన్ చేస్తోందని ఆర్థిక మంత్రి బడ్జెట్ లో ప్రస్తావించారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతీ ఇంటికి మంచినీరును అందిస్తామన్నారు. గతంలో రైతుబంధు పథకాన్ని కేంద్రం కాపీ కొట్టిందన్న టీఆర్ఎస్ శ్రేణులు.. మరి ఈసారి అదేవిధంగా కేంద్రంపై వ్యాఖ్యలు చేస్తారేమో చూడాలి.