డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ అనే మాటకు నిజమైన అర్థం.. నందమూరి కళ్యాణ్‌రామ్‌!

నందమూరి కళ్యాణ్‌రామ్‌.. నందమూరి నట వారసుడిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రవేశించారు. రొటీన్‌కి భిన్నంగా ఉండే కథాంశాలను ఎంపిక చేసుకోవడం ఆయన ప్రత్యేకత. హీరోగానే కాదు, నిర్మాతగా కూడా తనేమిటో ప్రూవ్‌ చేసుకున్నారు. కళ్యాణ్‌రామ్‌ నిర్మించిన సినిమాలన్నీ విభిన్నమైనవే. ఔట్‌పుట్‌ కోసం ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వని నిర్మాతగా, డాషింగ్‌ అండ్‌ డేరింగ్‌ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నారు. 

1989లో నందమూరి బాలకృష్ణ, కోడి రామకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన ‘బాలగోపాలుడు’ చిత్రం ద్వారా బాలనటుడిగా పరిచయమైన కళ్యాణ్‌రామ్‌ ఆ తర్వాత మరో సినిమా చెయ్యలేదు. మంచి హీరోగా పేరు తెచ్చుకోవాలన్నది కళ్యాణ్‌రామ్‌ లక్ష్యం. దాంతో డిగ్రీ పూర్తవ్వగానే హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు. కానీ, తమ కుటుంబంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసిన వారు ఎవరూ లేకపోవడంతో అది పూర్తి చేసిన తర్వాత సినిమాల విషయం ఆలోచించమని తండ్రి హరికృష్ణ చెప్పడంతో అమెరికా వెళ్ళి అక్కడ ఎం.ఎస్‌. పూర్తి చేశారు కళ్యాణ్‌రామ్‌. 

కళ్యాణ్‌రామ్‌ను హీరోగా పరిచయం చేసేందుకు ఉషాకిరణ్‌ మూవీస్‌ అధినేత రామోజీరావు ముందుకొచ్చారు. కాశీనాథ్‌ దర్శకత్వంలో ‘తొలిచూపులోనే’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. కానీ, ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత వైజయంతి మూవీస్‌ అధినేత సి.అశ్వినీదత్‌ నిర్మాతగా, మలిఖార్జున్‌ దర్శకత్వంలో రూపొందిన ‘అభిమన్యు’ చిత్రంతో రెండో ప్రయత్నం చేశారు. కానీ, ఈ సినిమా కూడా కళ్యాణ్‌రామ్‌ను హీరోగా నిలబెట్టలేకపోయింది. హీరోగా మంచి పేరు తెచ్చుకోవాలన్న తన యాంబిషన్‌ను పూర్తి చేసుకునేందుకు తనే రంగంలోకి దిగారు. తన తాతగారైన నందమూరి తారకరామారావు పేరున ఒక బేనర్‌ స్థాపించి తనే నిర్మాతగా మారారు. తొలిసారి నిర్మించే సినిమా అయినప్పటికీ పేరున్న డైరెక్టర్‌తో కాకుండా కొత్త డైరెక్టర్‌కి అవకాశం ఇవ్వడం అతనిలోని డేర్‌ను తెలియజేస్తుంది. 

సురేందర్‌రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘అతనొక్కడే’ చిత్రాన్ని నిర్మించారు కళ్యాణ్‌రామ్‌. ఆ సినిమా సెన్సేషనల్‌ హిట్‌ అయి హీరోగా ఒక్కసారిగా లైమ్‌లైట్‌కి వచ్చారు కళ్యాణ్‌రామ్‌. ఆ తర్వాత చేసిన సినిమాలు మళ్ళీ వరసగా ఫ్లాప్‌ అయ్యాయి. మధ్యలో మళ్ళీ తనే నిర్మాతగా చేసిన ‘హరేరామ్‌’ ఒక డిఫరెంట్‌ మూవీగా పేరు తెచ్చుకుంది. అతని కెరీర్‌లో మళ్ళీ పెద్ద హిట్‌గా నిలిచిన సినిమా ‘పటాస్‌’. అనిల్‌ రావిపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత చేసిన చాలా సినిమాలు హీరోగా, నిర్మాతగా కళ్యాణ్‌రామ్‌ను నిరాశపరిచాయి. 2017లో ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయంలో నిర్మించిన ‘జై లవకుశ’ భారీ విజయాన్ని సాధించింది. 

2022లో ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బేనర్‌లో నిర్మించిన ‘బింబిసార’ చిత్రం  కళ్యాణ్‌రామ్‌కు మంచి పేరు తెచ్చి పెట్టడమే లాభాలను ఆర్జించింది. తాజాగా ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై ‘దేవర’ చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు కళ్యాణ్‌రామ్‌. ఈ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. సెప్టెంబర్‌ 27న ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఇక కళ్యాణ్‌రామ్‌ హీరోగా నటిస్తూ మరో నిర్మాత భాగస్వామ్యంలో నిర్మిస్తున్న ఎన్‌ఆర్‌కె21 చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. ఈ చిత్రాన్ని ఇదే ఏడాది రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అపజయాలు ఎదురైనా నిరాశ చెందకుండా ఆత్మవిశ్వాసంతో సినిమాలు చేస్తూ విజయాలు అందుకుంటున్నారు కళ్యాణ్‌రామ్‌. అలాగే 10కి పైగా సినిమాలు నిర్మించి నిర్మాతగా కూడా విజయాలు సాధిస్తున్న నందమూరి కళ్యాణ్‌ రామ్‌ పుట్టినరోజు జూలై 5. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగువన్‌.