వస్తావా..చస్తావా..? వరుడిని కిడ్నాప్ చేసిన యువతి

పచ్చని పెళ్లి మండపం..మరి కొద్ది క్షణాల్లో వధువు మెడలో వరుడు తాళి కట్టబోతున్నాడు..అంతలో డిష్యూం..డిష్యూం అంటూ గన్ పేలిన శబ్ధం..ఆ షాక్ నుంచి బంధు మిత్రులు తెరుకునేలోపే పెళ్లి కుమారుడి తలకు రివాల్వర్ గురిపెట్టి వస్తావా చస్తావా అంటూ బెదిరించింది. దీంతో అక్కడున్నవారంతా నోరెళ్లబెట్టి చూస్తుండగానే అతన్ని తీసుకుని కారులోకి ఎక్కించుకుని దర్జాగా వెళ్లిపోయింది. ఇది సినిమాలో జరిగింది కాదు నిజ జీవితంలో జరిగిన సంఘటన. ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌కి చెందిన అశోక్ యాదవ్ అనే యువకుడు ఆసుపత్రిలో కాంపౌండర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేసే మరో యువతితో పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు.

 

అయితే అశోక్‌కు ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. నిన్న రాత్రి పెళ్లి జరగాల్సి ఉంది. సరిగ్గా వివాహం తుది అంకానికి చేరుతుందనగా ఓ మహిళ ఇద్దరు మనుషులను తీసుకొచ్చి బీభత్సం సృష్టించింది. తనని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు మరో మహిళను పెళ్లి చేసుకుంటున్నాడని ఆరోపించింది. ఇంతలో అశోక్ పాయింట్ బ్లాంక్‌కి రివాల్వర్ గురిపెట్టి మండపం నుంచి తీసుకెళ్లిపోయింది. దీంతో అశోక్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్దిసేపట్లో పెళ్లి అవుతుందనగా కాబోయే భర్తను తీసుకెళ్లిపోయిందన్న బాధతో వధువు కన్నీరుమున్నీరైంది. మరోవైపు అశోకే ఆ యువతితో ఈ డ్రామా ఆడించాడని కొందరు ఆరోపిస్తున్నారు. నిజానిజాలు తెలియాలంటే పోలీసుల దర్యాప్తు పూర్తికావాల్సిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu