ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ కి చెంపపెట్టు
posted on Mar 27, 2019 11:16AM

లోక్ సభ ఎన్నికలకు ముందు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. టీఎస్ యూటీఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి.. పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్‌పై 2637 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. టీఎస్ యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డికి 8924 ఓట్లు రాగా, పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్‌కు 6287 ఓట్లు వచ్చాయి. పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్‌కి అధికార పార్టీ టీఆర్‌ఎస్ తన మద్దతును ప్రకటించగా, టీఎస్ యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డికి సీపీఎం తమ మద్దతును ప్రకటించింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన పాతూరి సుధాకర్‌రెడ్డి.. పీఆర్టీయూ అభ్యర్థి కూర రఘోత్తంరెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు.
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్,మెదక్ పట్టభద్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, టీఆర్‌ఎస్ మద్దతుతో పోటీ చేసిన గ్రూప్–1 మాజీ అధికారి మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్‌పై 39,430 ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలుపొందారు. జీవన్‌రెడ్డికి 56,698 ఓట్లు రాగా, చంద్రశేఖర్ గౌడ్‌కు 17,268 ఓట్లు పోలయ్యాయి.
ఈ ఫలితాల గురించి స్పందించిన జీవన్ రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని అన్నారు. ప్రభుత్వ నియంతృత్వ విధానాలపై వ్యతిరేకతకు ఈ ఎన్నికలు నిదర్శనమని పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాడతానని ఆయన చెప్పారు. తనపై నమ్మకముంచి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపిన ఆయన ప్రజాగొంతుకనై మండలిలో పోరాడుతానని హామీ ఇచ్చారు.