కాంగ్రెస్ కి వైఎస్ జగన్ ఆఫర్.. సీఎంని చేస్తే రూ.1500 కోట్లు
posted on Mar 26, 2019 4:34PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి సీఎం పదవి అంటే పిచ్చి అని, సీఎం పదవి కోసం ఆయన ఎంతకైనా తెగిస్తారని టీడీపీ నేతలు తరచూ ఆరోపణలు చేస్తుంటారు. అయితే తాజాగా జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా కూడా జగన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు మద్దతుగా మంగళవారం కడప ఎన్నికల సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తనను సీఎంని చేస్తే కాంగ్రెస్‌కు రూ.1500 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమని జగన్ చెప్పారని ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు జగన్ తనకు చెప్పిన మాట ఇప్పటికీ గుర్తుందని ఆయన అన్నారు. డబ్బులతో ఏదైనా జరుగుతుందని జగన్ అనుకుంటారని, జగన్‌కు అంత సొమ్ము ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పుడూ భవిష్యత్ గురించి, రాష్ట్రం గురించి ఆలోచించే నాయకుడని ఆయన కొనియాడారు. ఈ ఇద్దరికి ఉన్న తేడా తనకు స్పష్టంగా తెలుస్తోందని, ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలని ఫరూక్ అబ్దుల్లా అన్నారు.