భయం కారణంగా మన విలువలను వదులుకోకూడదు: సుందర్ పిచాయ్

 

భారత్ లో అసహనం పెరిగిపోతోందని కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతోంది. ఆ అసహనం జబ్బు ఇప్పుడు అమెరికాకి కూడా పాకిపోయింది. వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేయబోతున్న డోనాల్డ్ ట్రంప్ అమెరికాలోకి ముస్లింలను అనుమతించకూడదని, ఇప్పటికే స్థిరపడిన వారి పూర్తి వివరాలు సర్వే చేసి సేకరించాలని చెప్పడంతో అమెరికాలో కూడా మత అసహనంపై చర్చ మొదలయిపోయిందిపుడు. అమెరికాలో ఎక్కువ శాతం మంది ప్రజలు ఆయన అభిప్రాయాన్ని తప్పు పట్టారు. చివరికి ఫేస్ బుక్, గుగూల్ సీ.ఈ.ఓ.లు మార్క్ జూకర్ బెర్గ్, సుందర్ పిచాయ్ లు కూడా ఆయనతో విభేదించారు. సుందర్ పిచాయ్ ‘మీడియం’ అనే బ్లాగులో ఈ మత అసహనంపై తన అభిప్రాయాలు ఇలాగ వ్యక్తం చేసారు.

 

“కేవలం భయం కారణంగా మనం మన విలువలని కోల్పోకూడదు. నేను అమెరికాలో స్థిరపడి 22సం.లు అయింది. నా స్వదేశమయిన భారత్ లో నివసిస్తున్నప్పుడు నాకు దాని పట్ల ఎటువంటి భావన ఉండేదో, అటువంటి భావనే అమెరికా పట్ల నేను పొందుతున్నాను. ఈ దేశం కూడా నా స్వంత దేశమనే భావన పొందుతున్నాను. అమెరికా ఎప్పుడూ స్వేచ్చా స్వాతంత్ర్యాలకి ప్రతీకగా నిలుస్తూనే ఉంది. ఇక్కడ సంకుచితత్వానికి తావు లేదు. ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా అందరికీ తమ కలలను సాకారం చేసుకొనేందుకు సమానావకాశాలు కల్పిస్తుంది. నిజానికి అమెరికా అంటే ఒక వలసవాదుల దేశం. ఇప్పుడు మీడియాలో మత అసహనం గురించి కొందరు చెపుతున్న మాటలు వింటునప్పుడు మనసుకి కష్టం అనిపిస్తోంది. ఒక దేశం లేదా ఒక మతానికి చెందిన ప్రజల అభిప్రాయాలను, వారి తెలివితేటలను, దేశాభివృద్ధిలో వారి పాత్రని విస్మరించి వారి మతాన్ని మాత్రమే చూడటం చాలా బాధ కలిగిస్తుంది.”

 

“మా గూగుల్ సంస్థలో వివిధ దేశాలు, మతాలు, విభిన్నాభిప్రాయాలు, భిన్నమయిన ఆలోచన దృక్పధాలు కలిగిన వారు అనేక మంది ఉన్నారు. ప్రతీ ఒక్కరికి ప్రత్యేకత ఉంటుంది. కానీ అందరం కలిసి పనిచేస్తున్నాము. ఈ భిన్నత్వమే మా సంస్థకు ఒక ప్రత్యేకతను సంతరించిపెట్టింది. ఆ భిన్నమయిన ఆలోచనా విధానం కారణంగానే అందరం కలిసి ఎన్నో గొప్ప లక్ష్యాలు సాధించగలిగాము. విభిన్నమయిన లక్ష్యాలుగా నిర్దేశించుకొని ముందుకు సాగిపోగలుగుతున్నాము.”

 

“ ఒక సంస్థ అయినా దేశమయినా అభివృద్ధి చెందాలంటే భిన్నాభిప్రాయాలు, విభిన్నమయిన ఆలోచనలను, లోతయిన చర్చలను స్వాగతించవలసి ఉంటుంది. అప్పుడే అత్యుత్తమ నిర్ణయాలు, అత్యుత్తమయిన ఫలితాలు వస్తాయి. అవే అభివృద్ధికి బాటలు పరుస్తుంది.” “మత అసహనం పెరిగినపుడు అందరూ కలిసికట్టుగా దానిని అడ్డుకోవాలి. మెజార్టీ వర్గం చెప్పినదే వేదం అని భావించినట్లయితే, మైనార్టీ వర్గం గొంతు వినపడకుండా అణచివేసినట్లవుతుంది. ప్రపంచంలో అందరికీ భావ వ్యక్తీకరణ స్వేచ్చ కలిగి ఉండాలి,” అని అభిప్రాయ పడ్డారు సుందర్ పిచాయ్.