మాట మార్చిన కాంగ్రెస్ పార్టీ
posted on Dec 12, 2015 9:59AM
సోనియా, రాహుల్ గాంధీలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సమావేశాలను హైజాక్ చేస్తోందని, సామాన్య ప్రజలకు మేలు చేకూర్చే కొన్ని బిల్లులు ఆమోదం పొందకుండా అడ్డుపడుతోందని బీజేపీ ఎదురు దాడికి దిగడంతో కాంగ్రెస్ పార్టీ కంగు తింది. నేషనల్ హెరాల్డ్ కేసు ఎప్పుడు ఏవిధంగా మొదలయిందో, అందులో సోనియా, రాహుల్ గాంధీల పాత్రలు, దానిపై ఇంతవరకు సాగిన కోర్టు కేసు మొదలయిన అన్ని అంశాలను వివరంగా తెలియజేసే ఒక చిన్న పుస్తకాన్ని బీజేపీ నిన్న విడుదల చేసింది. ఆ పుస్తకాన్ని పార్లమెంటు సభ్యులందరికీ పంచిపెడుతోంది.
ఊహించని ఈ పరిణామంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జరిగిన పొరపాటును సరిదిద్దుకొనే ప్రయత్నం చేసింది. తాము నేషనల్ హెరాల్డ్ కేసు కారణంగా పార్లమెంటును స్తంభింపజేయడం లేదని, వ్యాపం కేసులో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ రాజినామా కోసం, లలిత్ మోడీ కేసులో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే మరియు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ రాజీనామాల కోసం, దళితులపై అభ్యంతరకరమయిన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి వి.కె. సింగ్ రాజీనామాల కోసం పట్టుబడుతూ పార్లమెంటును స్తంభిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ మాట మార్చింది. అయితే ఈ సమావేశాలు మొదలయినపుడు కాంగ్రెస్ పార్టీ మంత్రి వికె. సింగ్ రాజీనామా చేయాలని ఆందోళన చేసింది కానీ మిగిలిన వారి గురించి అది ఉభయ సభలలో అసలు ప్రస్తావించనే లేదు. కానీ సోనియా, రాహుల్ గాంధీల వ్యక్తిగత సమస్యలయిన నేషనల్ హెరాల్డ్ కేసు పరిష్కారం కోసం పార్లమెంటు సమావేశాలు జరుగకుండా అడ్డుపడుతున్నారని బీజేపీ ఎదురు దాడి చేయడంతో, దాని వలన యావత్ దేశ ప్రజలకు తమ పార్టీపై వ్యతిరేకత ఏర్పడుతుందని గ్రహించి కాంగ్రెస్ పార్టీ మాట మార్చింది. ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసు గురించి కాంగ్రెస్ పార్టీ సభ్యులు పార్లమెంటులో ప్రస్తావించకుండా వేరే ఇతర సాకులతో పార్లమెంటు సమావేశాలు జరుగకుండా అడ్డుపడేందుకు సిద్ధం అవుతున్నారు.
పార్లమెంటు సమావేశాలు మొదలయిన ప్రతీసారి కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక వంకతో ఉభయసభలలో కార్యక్రమాలు జరుగకుండా అడ్డుపడుతోంది. ఈసారి కూడా మొదట నేషనల్ హెరాల్డ్ కేసు అంశం లేవనెత్తి సభా కార్యక్రమాలు సాగకుండా అడ్డుపడింది. కానీ ఆ అంశంతో సభను స్థంభింపజేస్తే దేశ ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుందనే సంగతి చాలా ఆలస్యంగా గ్రహించి మాట మార్చింది. కానీ అదే సమయంలో తన వైఖరిలో ఎటువంటి మార్పు లేదనే విషయం స్పష్టం చేస్తోంది.
రోజువారి జీతాలకు పనిచేసే కూలీలు, కార్మికుల జీతాలు పెంచేందుకు కేంద్రప్రభుత్వం ఒక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కానీ సోనియా, రాహుల్ గాంధీలను కాపాడుకోవడం కోసం ఆ బిల్లు ఆమోదం పొందకుండా కాంగ్రెస్ పార్టీ సభ్యులు అడ్డుపడుతున్నారని ప్రధాని నరేంద్ర మోడి విమర్శించారు. దానిపై సోనియా గాంధీ ప్రతిస్పందిస్తూ “ఆయన ఏమి మాట్లాడాలనుకొంటే అది మాట్లాడనివ్వండి,” అని జవాబు చెప్పారు. అంటే ఎవరు ఏమనుకొన్నా మేము చేయవలసింది చేస్తామని చెపుతున్నట్లుంది. ప్రజా సమస్యల పరిష్కారం కంటే తన స్వంత సమస్యల పరిష్కారమే ఆమెకు ముఖ్యం అన్నట్లుంది.