గోల్డ్‌స్కీమ్ పేరుతో గోల్డ్‌స్కాంలు
posted on Jul 13, 2012 11:07AM
నిన్నటిదాకా డిపాజిట్లు సేకరించిన కొన్ని బ్యాంకుల గురించి, వాటి మోసాల గురించి బాధితుల గోడు తెరకెక్కింది. నేడు బంగారు షాపుల్లో కొత్తగా గోల్డ్‌స్కీమ్ అమలు చేస్తున్నామంటూ వినియోగదారులను మోసం చేస్తున్న సంఘటనలు రాష్ట్రంలో పలుచోట్ల వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలోని ఏటూరునాగారంలో ఈ తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఒక్కసారి బంగారం కొనలేని వారందరికీ సువర్ణావకాశం అన్న ప్రకటనలు పలువురిని ఆకట్టుకున్నాయి. నెలనెలా కొంతసొమ్మును చెల్లించి చివర్లో దాని విలువైన బంగారాన్ని తీసుకోవచ్చని దుకాణదారులు ప్రకటనలు జారీ చేశారు.
పెద్ద ఎత్తున వ్యాపారం చేసేవారిని చూసి మథ్యతరగతి వర్తకులూ ఇదే తరహాలో పథకాలను ప్రవేశపెట్టారు. ప్రభుత్వఉద్యోగులు, చిన్న ఉద్యోగులు ఈ తరహాపథకాలకు ఆకర్షితులవుతున్నారు. దుకాణదారులు ఏజెంట్లను పెట్టుకుని మరీ ఈ పథకాలు నడుపుతున్నారు. దీంతో ఏజెంట్లు తమ కమిషన్ కోసం తమ దుకాణప్రత్యేకతను సెంటిమెంటుతో మిక్స్‌చేసి మరీ చెబుతున్నాడు. ఎప్పుడైతే సెంటిమెంటును ఏజెంటు టచ్ చేశాడో వెంటనే ఆ గోల్డ్‌సేవింగ్స్ స్కీమ్ వినియోగదారునికి నచ్చేస్తోంది. ఇలా బంగారం వర్తకుడు లక్ష్మినారాయణ ఓ కోటిరూపాయలకు పైచిలుకు గోల్డ్‌సేవింగ్స్ స్కీమ్ పేరిట సేకరించి ఉడాయించారు. దీంతో నెలనెల పొదుపు చేసుకున్న మధ్యతరగతి, పేదలు ఘొల్లుమంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయిస్తున్నారు. నిందితులు కూడా ఆ మొత్తం డబ్బు పూర్తిగా ఖర్చు అయ్యాక పోలీసులకు చిక్కుతున్నారు.