అనంతలో కరువుజాడ
posted on Jul 13, 2012 11:32AM
వర్షాభావపరిస్థితులు, నీటి సదుపాయం లేకపోవటం, వ్యవసాయం చేయటానికి అనుకూలమైన వాతావరణం లేకపోవటం వంటి పలు అంశాలతో కరువుజాడలు మళ్లీ అనంతపురం జిల్లాలో కనిపిస్తున్నాయి. ఈ జిల్లాలో 1.81లక్షల హెక్టార్లలో వ్యవసాయం చేస్తారు. కానీ, ఈ ఏడాది 71వేల హెక్టార్లలో మాత్రమే వ్యవసాయం చేస్తున్నారు. సాధారణం కన్నా 74శాతం తక్కువ వర్షపాతం ఇక్కడ నమోదైంది. దీంతో ధైర్యం చేసి పంటవేసి నష్టపోవటం ఇష్టం లేక రైతులు అస్సలు ఆ ఊసే ఎత్తటం లేదు. పండ్లతోటలు, ఇతర ఆదాయవరులపై వారు ఆధారపడనున్నారు. పశుగ్రాసానికి కూడా కొరత ఏర్పడిరది. దీంతో పాడిపరిశ్రమ కూడా కునారిల్లుతోంది. జిల్లాలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది.
ఒకవైపు ప్రభుత్వసాయం అందక, మరోవైపు బ్యాంకర్ల జులుం కూడా అనంతపురం జిల్లారైతును కుదేలు చేసింది. జిల్లా రైతులు సాధారణంగా వ్యవసాయం చేసే ప్రాంతంలో సగం కన్నా తక్కువగా సాగు చేస్తున్నందున వ్యవసాయ శాఖ పరంగా ఈ ప్రాంతాన్ని కరువుప్రాంతంగా గుర్తించారు. ముందస్తుగా రాష్ట్రప్రభుత్వానికి ఈ కరువు సమాచారాన్ని పంపించారు. దానితో పాటు జిల్లా యంత్రాంగం కూడా కరువు రైతులను ఆదుకునే విషయంలో అప్రమత్తమైంది. కలెక్టర్ దుర్గాదాస్ కరువు ప్రాంత రైతులకు బ్యాంకురుణాలు ఆపకుండా తక్షణం అందించాలని ఆదేశాలిచ్చారు. ఇప్పటి వరకూ చేసిన జాప్యం నివారించి తక్షణచర్యలకు సిద్ధం కావాలని బ్యాంకర్లను కోరారు.