మనుషుల్లో దేవుడు కావాలంటే.. మీరు ఇలా ఉండాలి..

కొన్ని సార్లు ముఖ పరిచయం కూడా లేనివారు మనకి సహాయం చేస్తే ఆ సమయంలో దేవుడిలా వచ్చి సాయం చేసారు అంటాం. వాళ్ళు చేసేది చిన్నదే అయినా ఆ సందర్భంలో చాలా ఊరట ఇస్తుంది.   బస్ లో అవసరమైన చిల్లర ఇవ్వడం కూడా కావచ్చు,  వృద్ధురాలిని రోడ్డు దాటించడం, ఇంటర్వ్యూకి లేటవుతుందని కంగారుపడుతున్న వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వడం ఇలాంటివి ఎన్నో రోజువారి జీవితంలో చిన్నవి అనుకుని ఒకరు చేస్తే అది ఆ సమయంలో  ఎదుటివారి  జీవితంలో సంతోషాన్ని నింపవచ్చు. ఏమీ ఆశించకుండా  ఇలా సాయం చేసేవాళ్ళను దేవుడితో సమానంగా పోలుస్తాం.  మనుషుల్లో దేవుడని స్తుతిస్తాం. కేవలం ఇలా  అనుకోవడమే కాకుండా ఇలా మనుషుల్లో కనిపించే దేవుళ్లను తలచుకుంటూ, వారికి కృతజ్ఞతలు  చెప్పుకోవడానికి ఒక ప్రత్యేకమైన రోజును విదేశీయులు ఏర్పాటు చేసుకున్నారు. మంచి ఎవరు చెప్పినా వినాలి అన్న చందాన, మనుషులలో దేవుళ్లను స్మరించుకోవడానికి ఏ దేశాల వారైనా అర్హులే. ఇది కేవలం ఇతరులను తాము తలచుకోవడమే కాదు, తమ మంచితనంతో, మానవత్వపు హృదయంతో అందరూ తమ గురించి గొప్పగా చెప్పుకునే దిశగా ప్రతి ఒక్కరూ జీవించవచ్చు.    ప్రతి సంవత్సరం ఆగస్టు 22వ తేదీని "బీ యాన్ ఏంజెల్ డే " గా జరుపుకుంటారు. వేరొకరికి మంచి చేయాలనే పాజిటివ్ థింకింగ్ పెంచడమే ఈ రోజు ఉద్దేశం.

ఇతరులకు మంచి చేయాలని సంకల్పించే ఈ రోజుకి ఒక చరిత్ర కూడా ఉంది. ఏ దేశమయినా, ఏ మతమైనా దేవుడు తప్పనిసరి. ప్రతి మతంలోనూ కొందరు శక్తివంతమైన వ్యక్తులుంటారు. వీరు స్వయానా ఆ దేవుడి ఆశీర్వాదం పొందినవారిగా గుర్తింపబడతారు. వీరిని దైవాంశ సంభూతులుగానూ, దేవదూతలుగానూ సంభోధిస్తారు.  దేవుడి ఆదేశాల మేరకు మనుషులకి సహాయం చేయడానికి మానవ జన్మ ఎత్తారని చెబుతుంటారు.  విదేశీయుల నమ్మిక ప్రకారం రెక్కలతో ఆకాశంలో ఎగురుతున్న దేవదూత వారికి ఎంతో మంచి చేస్తుందని నమ్ముతారు.  మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మన్లతో పోరాడుతున్నప్పుడు బ్రిటిష్ ఫ్రెంచ్ దళాలు అక్కడ దేవదూతల్ని చూసినట్టు చెప్పేవారు.   రెవరెండ్ జేన్ హోవర్డ్ ఫెల్డ్ మెన్ అనే మహిళ దేవదూతలు ఉన్నారని చాలా బలంగా నమ్మేది. దేవదూతలు తనను ప్రభావితం చేశారని ఆమె స్వయంగా చెప్పింది.  ఇందుకోసమే ఆమె 27 సంవత్సరాల క్రితం ప్రజలు చేసే చిన్న చిన్న సహాయాలను  ప్రోత్సహించాలని ప్రతి ఒక్కరూ దేవదూతలుగా మారవచ్చనే అర్థం ప్రపంచానికి చాటి చెబుతూ ఈ రోజును మొదలుపెట్టింది. ఇన్నాళ్లు దీనికి పెద్ద ప్రాముఖ్యం లేదు కానీ  సోషల్ మీడియా ప్రభావం కారణంగా దీని గురించి ప్రజలకు వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఎంతోమంది ఈ రోజుకు ప్రాముఖ్యం ఇస్తున్నారు.  

కొన్ని సమయాల్లో మనం చేసే చిన్న సాయం ఎదుటివారి మూడ్ ని మార్చేయవచ్చు. వాళ్ళకి మనుషుల్లో ఇంకా మానవత్వం ఉంది అనే నమ్మకాన్ని కలిగించవచ్చు. ఒక్కోసారి డబ్బు సాయం చేయలేకపోయినా కష్టాల్లో ఉన్న వారికి చిన్న ఓదార్పు,  మనస్ఫూర్తిగా ఒక నవ్వు కూడా ఎంతో ధైర్యం ఇస్తుంది. మనం చేస్తే తిరిగి వాళ్ళు చేస్తారని ఆశించకుండా చేసే సహాయం  మనిషి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇది శరీరంలో హ్యాపీ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది.

ఈ రోజు ఏం చేయొచ్చంటే..

ఈరోజు వేరొకరికి సహాయం చేయడమే కాదు. చాలా రోజులుగా వేరొకరి మీద ఉన్న కోపాన్ని మరిచిపోవడం, వాళ్లు చేసిన తప్పులను క్షమించేయడం కూడా చేయొచ్చు.  అది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచి చేస్తుంది. అలాగే మనకి రోజువారి పనుల్లో సహాయం చేసే ఎంతోమందికి ఒక చిన్న థాంక్స్ చెప్పొచ్చు. అది వాళ్ళలో మీ పట్ల మంచి అభిప్రాయాన్ని పెంచడంతో పాటు, వాళ్ళు మీ కోసం చేసే పనులు మరింత ప్రేమగా చేస్తారు. కేవలం బయటివారికే కాదు.. ఇంట్లో  పిల్లలకి హోంవర్క్ లో హెల్ప్ చేయడం,  లేదా భాగస్వామికి నవ్వుతూ ఒక గులాబీ పువ్వు ఇవ్వడం ఇద్దరి మద్యా ఉన్న చిన్న చిన్న అపార్థాలను కూడా తొలగిస్తుంది. ఇరుగు పొరుగు వారి విషయంలో ఇగోకు పోవడం, గొడవ పడటం ఆపి  వారిని మనసారా పలకరించవచ్చు. మీకు సమయం ఉంటే దగ్గరలో ఉన్న అనాధాశ్రమంలో ఉన్న పిల్లల్ని కలిసి కాస్త టైం స్పెండ్ చేయొచ్చు. ఇవన్నీ చేయలేకపోయినా కనీసం ఒక మొక్కని నాటొచ్చు. మీరు నాటే మొక్క ఎప్పుడూ మీకు అనుబంధమై ఉంటుంది. సరిగ్గా గమనిస్తే అది కూడా మీతో సంభాషిస్తున్నట్టే ఉంటుంది.  ఇది చాలు కదా. ఒక మనిషిని మనిషిగా ఉంచడానికి. వేరొకరి దృష్టిలో  గొప్ప వ్యక్తిగా ఉంచడానికి.

Related Segment News