కిడ్నాప్ డ్రామా స్టూడెంట్ సూసైడ్.. కట్టుకథే చంపేసింది!

కీసరలో బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్. యువతిని ఎత్తుకెళ్లిన ఆటో డ్రైవర్లు. గ్యాంగ్ రేప్ చేసి.. పోలీసులు రావడంతో పొదల్లో వదిలేసి పారిపోయారు. ఇదీ పది రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం స్పష్టించిన కేసు. కట్ చేస్తే ఆ మార్నాడు మరో వర్షన్. గ్యాంగ్ రేప్ కాదు, ఆ యువతే బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి పొదల్లోకి వెళ్లింది. గంజాయి తాగి వారితో కలిసి బాగా ఎంజాయ్ చేసింది. పోలీసులను చూసి భయపడి కిడ్నాప్ డ్రామా ఆడింది. ఇలా ఇంకో ప్రచారం. ఈ రెండూ నిజాలు కావు. పోలీసుల విచారణలో మూడూ రోజుల తర్వాత అసలు విషయం వెలుగు చూసింది. ఆమెపై ఎలాంటి అత్యాచారం జరగలేదు. ఇంటి నుంచి పారిపోయేందుకు ఆ యువతి ఆడిన డ్రామా అదని పోలీసులు తేల్చారు. దీంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. ఈ కేసుపై విపరీత ప్రచారం జరగడంతో పరువు పోయిందని భావించిన ఆ యువతి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. ఫార్మసీ స్టూడెంట్ సూసైడ్ ఘటన మరింత కలకలంగా మారింది.

19 ఏళ్ల తెలిసీ తెలియని వయసు. అబద్దాలు చెప్పడం ఆమె హాబీ. కిడ్నాప్ కథలంటే ఎంతో ఇష్టం. చంచల మనస్తత్వం. ఏ సమస్య వచ్చిందో ఏమో గానీ.. ఇంట్లో నుంచి పారిపోవాలని అనుకుంది. అదే పని చేసింది. అంతలోనే తల్లి నుంచి పదే పదే ఫోన్లు రావడంతో.. డ్యామిట్, ఆమె కథ అడ్డం తిరిగింది. అది ఆత్మహత్యకు దారి తీసింది.

కిడ్నాప్‌ నాటకం..
నలుగురు ఆటో డ్రైవర్లు అపహరించి, సామూహిక అత్యాచారం చేశారంటూ కీసరకు చెందిన బీఫార్మసీ విద్యార్థిని పోలీసులకు చెప్పిందంతా కట్టుకథ అని ఆ తర్వాత తేలింది. తొలుత బాధితురాలు తెలిపిన వివరాల ఆధారంగా సామూహిక అత్యాచారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. సాక్ష్యాధారాలు సేకరించాక అత్యాచారం జరగలేదనే నిర్ధారణకు వచ్చారు. తమ కుమార్తెను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారంటూ ఫార్మసీ విద్యార్థిని బంధువులు డయల్‌ 100కు ఫోన్‌ చేశారు. పోలీసులు రాత్రి 7.40 గంటల ప్రాంతంలో అన్నోజీగూడ రైల్వేగేట్‌కు కాస్త దూరంలో పొదల్లో అర్ధనగ్నంగా ఉన్న యువతిని గుర్తించారు. నడవలేని స్థితిలో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు బృందం సీన్‌ రీ-కన్‌స్ట్రక్షన్‌ చేసింది. కిడ్నాప్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆటోడ్రైవర్‌ ఆ సమయంలో ఘటనా స్థలంలో లేడని సెల్‌ఫోన్‌ సిగ్నళ్ల ద్వారా పోలీసులు నిర్ధారించారు. అప్పటికే పోలీసుల అదుపులో ఉన్న ఆటో డ్రైవర్ ను మరోసారి ప్రశ్నించారు. విద్యార్థిని ఆర్‌ఎల్‌నగర్‌లో దిగలేదని, వేరే స్టాప్‌లో దిగిందని అతను చెప్పాడు. అన్నోజిగూడలో యువతిని రక్షించిన స్థలం నుంచి ఆమె ఇంటి బస్‌స్టాప్‌ వరకు ఉన్న సీసీ కెమెరాలన్నీ పరిశీలించారు పోలీసులు. సాయంత్రం 6 నుంచి 7.30 గంటల మధ్య సమయంలో వివిధ ప్రాంతాల్లో ఆమె ఒంటరిగానే తిరిగినట్టు గుర్తించారు.

పోలీసులు ఆధారాలతో సహా ఆ యువతిని ప్రశ్నించడంతో తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తనపై అత్యాచారం జరగలేదనే నిజం ఒప్పేసుకుంది. తాను ఇంట్లో నుంచి పారిపోవాలని అనుకున్నానని.. అంతలోనే అమ్మ నుంచి ఫోన్ రావడంతో అలా అబద్దం చెప్పానని అంగీకరించింది. ఆటో డ్రైవర్ల మీద కోపంతో వారిని ఇరికించే ప్రయత్నం చేశానని చెప్పిందా యువతి.  

ఈ కట్టుకథ.. ఆమె జీవితం అర్థాంతరంగా ముగిసేలా చేసింది. ఈ విషయం విస్తృతంగా ప్రచారం జరగడం.. కొన్ని రోజుల పాటూ అంతా దీని గురించే చర్చించుకోవడంతో ఆమె పరువు పోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ ఫార్మసీ విద్యార్థిని బుధవారం ఉదయం నిద్ర మాత్రంలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను ఘట్ కేసర్ ఆసుప్రతికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. కిడ్నాప్ ఘటన ఎంత సంచలనంగా మారిందో.. యువతి చనిపోవడమూ అంతే కలకలం స్పష్టిస్తోంది. తెలిసీ తెలియక ఆమె ఆడిన అబద్దం.. నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.