జగన్ కు అమరావతిపై సడెన్ లవ్వు అందుకేనా..
posted on Feb 24, 2021 11:20AM
ఏపీలో అధికారం చేపట్టిన తరువాత జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని భుజాన వేసుకుంది. రాజధాని అమరావతిని టార్గెట్ చేస్తూ స్మశానం అని కొందరు, ఎడారి అని మరికొందరు వైసిపి నేతలు నిందిస్తూ దాడి చేస్తూ వస్తున్నారు. అసెంబ్లీలో తనకున్న రోడ్ రోలర్ మెజారిటీని అడ్డుపెట్టుకుని మూడు రాజధానుల బిల్లును జగన్ సర్కార్ పాస్ చేయించుకుంది. అయితే ఈ వ్యవహారంపై అమరావతి రైతులు హైకోర్టు తలుపు తట్టడంతో ప్రస్తుతానికి విశాఖకు రాజధాని మార్పుకు బ్రేక్ పడింది..
మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలపై హడావిడి మొదలెట్టేశారు. అక్కడ నిర్మాణాలు నిలిచిపోయిన విషయం ఇపుడే తమ దృష్టికి వచ్చిందన్నట్లుగా బిల్డప్ ఇస్తూ.. వాటిని పూర్తి చేయడానికి నిధులు అవసరం కాబట్టి రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వమే బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఆ భవనాల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని కూడా నిర్ణయించింది. అయితే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాత్రి పగలు తేడా లేకుండా నిత్యం జరిగే నిర్మాణ పనులతో సందడిగా ఉండే అమరావతి ప్రాంతం ఇప్పుడు పూర్తిగా నిర్మానుష్యం అయింది ఈ దశలో నిర్మాణ పనులు ఆపివేస్తే వేల కోట్ల నష్టం వస్తుందని తెలిసినా ఇన్నాళ్లు పట్టించుకున్న పాపం పోలేదు అయితే సడెన్ గా అక్కడి నిర్మాణాలు పూర్తి చేయాలనుకుంటున్నామని వైసిపి ప్రభుత్వం ప్రకటించింది.
జగన్ ప్రభుత్వం తాజా ప్రకటనపై ఇటు రాష్ట్ర ప్రజలు, ఆ ప్రాంత వాసులు పెదవి విరుస్తున్నారు. నిధులు సమీకరించి అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలు పూర్తి చేస్తుందని ప్రజలు నమ్మే పరిష్టితిలో లేరు. దీనికి రాష్ట్ర ప్రభుత్వ వైఖరేకారణం. అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు పూర్తవుతున్నా అక్కడ కనీసం ఒక్క ఇటుక కూడా పెట్టని సర్కార్ ఇంత హఠాత్తుగా హడావిడి చేయడం చూసిన జనం.. ఈ హడావిడి వచ్చే నెల 10 వరకు మాత్రమే అంటున్నారు. దీనికి కారణం అమరావతిని అనుకుని ఉన్న విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు చుట్టుపక్కల మున్సిపాలిటీలలో మార్చి 10 న ఎన్నికలు జరగనున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ గెలిచేందుకే.. అమరావతి విషయంలో సానుకూలంగా ఉన్నామన్న ఫీలర్ జనంలోకి పంపించడానికే ఈ ప్రకటనలు చేశారని ప్రజలు భావిస్తున్నారు. దీంతో ఎన్నికలు పూర్తయేవరకు ఈ హడావుడి ఉంటుందని ఆ తర్వాత మళ్లీ.. జగన్ అమరావతి ఊసే ఎత్తరని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
మరోపక్క రాష్ర ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వానికి అప్పులు పుట్టే పరిస్థితి లేదు. దీంతో అంత మొత్తం అప్పు ఎవరు ఇస్తారన్నది పెద్ద సందేహంగా మారింది. అంతేకాకుండా రుణాలివ్వడానికి బ్యాంకులేవీ సుముఖంగా లేవు. అంతేగాకుండా ప్రభుత్వం ఇప్పటికే ఇటువంటి ప్రకటనలు పలుమార్లు చేసింది. కొన్ని కమిటీలు వేసి.. ఈ భవనాలను ఎలా వాడుకోవాలనే పరిశీన కూడా జరిపారు. చివరికి వీటిని పూర్తీ చేసి అమ్ముకుందామని కూడా ఆలోచన చేశారు. మరోపక్క ఇప్పటికిప్పుడు ఇక్కడ నిర్మాణాలు పూర్తీ చేయాలంటే పాత కాంట్రాక్టర్లకు దాదాపు ఆరు వందల కోట్ల వరకూ బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వాటికి ముందుగా ఫండ్స్ సర్దుబాటు చేయాలి. అయితే ప్రభుత్వం మాత్రం ఆ దిశగా కనీసం ప్రయత్నాలు చేసినట్లుగా లేదు .జగన్ సర్కార్ అమరావతిని ఒక నిరర్థక ఆస్తిగానే జమ కడుతోందని ప్రజలు ఇప్పటికి నమ్ముతున్నారు. దీంతో తాజాగా జగన్ ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రజలను మభ్యపెట్టే రాజకీయమేనని.. అక్కడ నిర్మాణాలు పూర్తి చేసి ఉద్దేశ్యం ఎంతమాత్రం ప్రభుత్వానికి లేదని ప్రజలు నమ్ముతున్నారు.