జగన్ అరెస్టు: 2014పైనే కాంగ్రెస్ దృష్టి
posted on May 28, 2012 1:59PM
వైయస్ జగన్ అరెస్టుతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉపఎన్నికల్లో ప్రయోజనం పొందినప్పటికీ క్రమంగా అది తగ్గుతూ పోతుందని కాంగ్రెసు పార్టీ భావిస్తోంది. 2014 ఎన్నికలపైనా దృష్టి పెట్టి ఉప ఎన్నికలు జరుగుతున్న కీలకమైన సమయంలో వైయస్ జగన్ అరెస్టుకు కాంగ్రెసు అధిష్టానం అనుకూలంగా వ్యవహరించినట్లు చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 2014 ఎన్నికల వరకు మనుగడ సాగించడం కష్టమని, ఈలోగా వైయస్ జగన్ అవినీతిని ప్రజల్లోకి తీసుకుని వెళ్లవచ్చునని, దాని వల్ల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని కాంగ్రెసు నాయకులు అంచనా వేస్తున్నారు. సానుభూతితో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రయోజనం పొందడమనేది తాత్కాలిక దశ మాత్రమేనని, రాను రాను ప్రజలు జగన్‌ను అర్థం చేసుకుంటారని అంటున్నారు. ఉప ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని అంటున్నారు. అయితే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వర్గం మాత్రం ఆ విషయాన్ని కొట్టిపారేస్తోంది. ఉప ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు లేవని కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే అధిష్టానానికి వివరించారని చెబుతున్నారు.