మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసు: ప్రధాన నిందితుడు గౌతమ్ తేజ్ అరెస్ట్

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌతమ్ తేజ్ ను ఏపీ సీఐడీ  అరెస్టు చేసింది.  పలమనేరులో సోమవారం గౌతమ్ తేజ్ ను అరెస్టు చేసిన ఏపీ సీఐడీ అధికారులు ఆయనను చిత్తూరు కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి గౌతమ్ తేజ్ కు 14 రోజుల రిమాండ్ విధించారు.  
 
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జులై 21న అగ్ని ప్రమాదం జరిగి కీలక ఫైళ్లు దగ్దం అయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉన్నట్లు కేసు నమోదు అయింది. ఈ నేపథ్యంలో ప్రమాదం జరగడానికి ముందు అక్కడ పని చేసిన ఆర్డీవో, ఇతర అధికారులను పోలీసులు వారం రోజుల పాటు విచారించారు. ఈ క్రమంలో ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడంతో ఈ కేసును ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది.

అసలు మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంలో కీలక ఫైళ్లు దగ్ధం అయిన సంఘటనపై తొలి నుంచీ వైసీపీ నేతలపైనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పోలీసులు  గతంలోనే కొందరు వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి కేసులు నమోదైన వారిలో   వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా, మునిసిపల్ వైస్‌ ఛైర్మన్‌ జింకా వెంకటచలపతి, పెద్దిరెడ్డి ప్రధాన అనుచరులు మాధవరెడ్డి, రామకృష్ణారెడ్డిలు ఉన్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఎనిమిది కేసులు నమోదు చేసినట్లు అప్పట్లోనూ కర్నూలు రేంజ్ డీఐజీ తెలిపారు. ఆ తరువాత నిందితుల ఇళ్లలో సోదాలు కూడా నిర్వహించారు. ఆ సోదాలలో మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా నివాసం నుంచి కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకున్న సంగతి విదితమే.

అలాగే  వెంకటాచలపతి నివాసం నుంచీ కీలకమైన పది ఫైళ్లను అప్పట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో మదనపల్లె తహసీల్దార్ కార్యాలయంలో ఉండాల్సిన ప్రొసీడింగ్స్‌ కు సంబంధించిన ఫైళ్ల జిరాక్స్‌ లు లభ్యమయ్యాయి. ఇక మాధవరెడ్డి నివాసంలో 59, రామకృష్ణారెడ్డి నివాసం నుంచి 124 ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలన్నీ ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన పోలీసులు అప్పట్లోనే ఈ నలుగురిపై కేసులు నమోదు చేశారు.  

ఫోర్జరీ, ప్రభుత్వ రికార్డుల  ట్యాంపరింగ్, దొంగతనం, చోరీ సొత్తు కలిగి ఉండటంతో పాటు సాక్ష్యాలు మాయం చేయడం, నిందితులకు సహకరించడం వంటి ఆరోపణలపై పలుసెక్షన్ల కింద కేసులు నమోదు  చేశారు. మొత్తంగా మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందన్న ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడంతో ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి బదలీ చేసింది. ఇప్పుడు సీఐడీ అధికారులు గౌతమ్ తేజ్ ను అరెస్టు చేయడంతో ఈ ఫైళ్ల దగ్ధం వెనుక ఉన్న సూత్రధారుల గుట్టు బయటపడే అవకాశాలున్నాయి.