మోదీకి నిద్ర లేని రాత్రులు చూపిస్తాం.. ఖలిస్థాన్ గ్రూప్ వార్నింగ్‌..

ప్ర‌ధాని మోదీని రైతులు వ‌ద‌ల బొమ్మాళీ అన్న‌ట్టుగా వెంటాడుతున్నారు. ఇప్ప‌టికే దేశ రాజ‌ధాని స‌రిహ‌ద్దుల్లో నెల‌ల త‌ర‌బ‌డి ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు రైతు చ‌ట్టాల‌ను త‌క్ష‌ణ‌మే ఉప‌సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. చ‌లికి, ఆక‌లి, ద‌ప్పిక‌ల‌కు ఓర్చుకొని.. పోలీసుల లాఠీ దెబ్బ‌ల‌ను కాచుకొని.. మ‌రీ మోదీపై రైతు ఉద్య‌మం హోరెత్తుతోంది. తాజాగా రైతుల త‌ర‌ఫున ప్ర‌ధాని మోదీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది కెనడా బేస్డ్‌ ఖ‌లిస్థాన్ గ్రూప్‌. 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అమెరికా పర్యటనలో నిద్ర లేని రాత్రులను చూపిస్తామని ఖలిస్థానీ సంస్థ.. సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) స‌వాల్‌ చేసింది. క్వాడ్ దేశాల సదస్సు, ఐక్య రాజ్య సమితి సాధారణ సభ ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొనేందుకు మోదీ ఈ నెలలో అమెరికాలో పర్యటించబోతున్న నేపథ్యంలో ఎస్ఎఫ్‌జే ఈ విధంగా హెచ్చరించింది. భారత దేశంలో రైతులపై హింస జరుగుతున్నందు వల్ల మోదీకి వ్య‌తిరేకంగా అమెరికాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పింది. 

భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ కలిసి క్వాడ్ దేశాలుగా ఏర్పాట‌య్యాయి. క్వాడ్ దేశాల సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆతిథ్యం ఇస్తున్నారు. ఈ నెల 24న జరిగే ఈ సమావేశంలో ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్, జపాన్ పీఎం యొషిహిడె సుగ, భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ సమావేశం వైట్ హౌస్‌లో జరుగుతుంది. ఈ నాలుగు దేశాల అధినేతలు వ్యక్తిగతంగా హాజరవుతున్న తొలి సమావేశం ఇదే. కీల‌క‌మైన ఈ భేటీని టార్గెట్ చేస్తూ.. వైట్‌హౌజ్ ముందు మోదీ వ్య‌తిరేక నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తామ‌ని చెప్పింది ఖ‌లిస్థాన్ గ్రూపున‌కు చెందిన సిక్స్ ఫ‌ర్ జ‌స్టిస్ సంస్థ‌. ఈ ఎస్ఎఫ్‌జే సంస్థ‌పై భారత ప్రభుత్వం 2019లోనే నిషేధం విధించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం ఎస్ఎఫ్‌జేపై చర్యలు తీసుకుంది. అందుకు ప్ర‌తీకారంగానా అన్న‌ట్టు ఇప్పుడు పీఎం మోదీ అమెరికా ప‌ర్య‌ట‌న‌లో రైతు సెగ త‌గిలేలా చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది.